Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

అమెరికా కాలేజీలు, వర్సిటీలకు సమస్యగా మారిన చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్!

  • అమెరికా విద్యాసంస్థల్లో అడ్మిషన్ ప్రక్రియ కఠినం
  • విద్యార్థి గత చరిత్ర క్షుణ్నంగా పరిశీలన
  • విద్యార్థులు వ్యక్తిగత వ్యాసం సమర్పించాల్సిన వైనం
  • అందుకోసం చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ లపై ఆధారపడుతున్న విద్యార్థులు

అమెరికాలోని వివిధ కాలేజీలు, యూనివర్సిటీలు ఎవరైనా కొత్త విద్యార్థిని చేర్చుకోవాలంటే అతడి గత చరిత్రను నిశితంగా పరిశీలిస్తాయి. అతడి బయోడేటాలో ఏ చిన్న లోపం ఉన్నా అడ్మిషన్ దక్కదు. 

ఏదైనా విద్యాసంస్థలో అడ్మిషన్ కోరే విద్యార్థి తన పూర్తి వివరాలతో ఓ వ్యక్తిగత వ్యాసం సమర్పించాల్సి ఉంటుంది. ఆ వ్యక్తిగత వ్యాసం ఎంత ప్రభావవంతంగా ఉంటుందన్న దానిపై ఆ విద్యార్థికి సదరు కాలేజీ/వర్సిటీలో అడ్మిషన్ లభిస్తుందా, లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ రచనా నైపుణ్యానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. 

ఇటీవల చాట్ జీపీటీ, గూగూల్ బార్డ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ విరివిగా అందుబాటులోకి వచ్చాయి. దాంతో విద్యార్థులు వ్యక్తిగత వ్యాసం రాసే పనిని ఆయా టూల్స్ కు అప్పగించి నిశ్చింతగా ఉంటున్నారట. చాట్ జీపీటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఏ టాపిక్ ఇచ్చినా, ఆఖరికి కవిత్వం రాయమన్నా రాస్తుంది. ఇలాంటి ఏఐ టూల్స్ ద్వారా రూపొందించిన వ్యక్తిగత వ్యాసాలను విద్యార్థులు కాలేజీలు/వర్సిటీల్లో సమర్పిస్తున్నారట. 

ఇలా వస్తున్న వ్యక్తిగత వ్యాసాలు ఒకదాన్ని మించి ఒకటి ఆహా, ఓహో అనే రీతిలో ఉండడంతో విద్యాసంస్థల అధికారులకు అడ్మిషన్లు ఇవ్వడం ఓ సమస్యగా మారింది. విద్యార్థి రాయాల్సిన వ్యాసం మరెవరో రాయడం బాధాకరమని డార్ట్ మౌత్ కాలేజి అడ్మిషన్స్ డీన్ లీ కాఫిన్ వాపోయారు. ఈ నేపథ్యంలో, అమెరికాలోని చాలా విద్యాసంస్థలు ఏఐ టూల్స్ వినియోగంపై ఆంక్షలు విధించాయి. 

మిచిగాన్ యూనివర్సిటీ అయితే కృత్రిమ మేథ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. అంతేకాదు, విద్యార్థులు వ్యాసం రాసేందుకు చాట్ జీపీటీ తదితర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు అంటూ ప్రకటన జారీ చేసింది. 

ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ భిన్నంగా స్పందించింది. విద్యార్థులు ఏఐ టూల్స్ ను వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, విద్యార్థులు ఏఐ టూల్స్ వినియోగించే క్రమంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికింది. 

జార్జియా టెక్ యూనివర్సిటీ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. తమను తాము నిర్వచించుకోవడానికి, తమ వివరాలు ఎడిట్ చేసుకోవడానికి విద్యార్థులు ఏఐ టూల్స్ వినియోగించుకోవచ్చని, కానీ ఎక్కడో రూపొందించిన కంటెంట్ ను కాపీ చేసి అప్లికేషన్ లో పొందుపరచడానికి మాత్రం ఏఐ టూల్స్ ఉపయోగించొద్దని స్పష్టం చేసింది.

Related posts

అమెరికా కేసు ఎఫెక్ట్… ‘అదానీ’కి షాకిచ్చిన కెన్యా ప్రభుత్వం…

Ram Narayana

మైక్రోసాఫ్ట్ సేవలకు మరోసారి అంతరాయం

Ram Narayana

భారతీయ విద్యార్థిని ఆచూకీ చెబితే రూ.8.32 లక్షల రివార్డు.. అమెరికా ఎఫ్‌బీఐ ప్రకటన

Ram Narayana

Leave a Comment