Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఈ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏమిటో అర్థం కావడంలేదు: బాలకృష్ణ

  • నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • చంద్రబాబు అరెస్ట్ పై భగ్గుమన్న టీడీపీ సభ్యులు
  • 17 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
  • మీడియాతో మాట్లాడిన నందమూరి బాలకృష్ణ 

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో, నేడు అసెంబ్లీలో టీడీపీ సభ్యులు భగ్గుమన్నారు. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. సభలో ఆగ్రహావేశాల నేపథ్యంలో 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వెలుపల మీడియా సమావేశం నిర్వహించారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ఇవాళ అసెంబ్లీలో జరిగింది తలుచుకుంటే చాలా బాధగా ఉందని తెలిపారు. పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో నేడు నియంతృత్వ ధోరణి రాజ్యమేలిందని అన్నారు. 

“మాపైకి కొందరిని ఉసిగొల్పి, కావాలనే మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రపంచంలో ఎవరూ అమలు చేయనన్ని సంక్షేమపథకాలు ప్రజలకోసం అమలుచేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపిన ముఖ్యమంత్రి ఉద్దేశం ఏమిటో అర్థం కావడంలేదు. ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్షసభ్యులపై కక్షసాధించడమే తన ధ్యేయమన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. 

16 నెలలు తాను జైల్లో ఉన్నాను కాబట్టి… 16 రోజులు చంద్రబాబుని జైల్లో పెట్టాలని చేశారు తప్ప… స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు. చంద్రబాబు తప్పుచేశాడని చెప్పడానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి రుజువులు లేవు. చంద్రబాబు చేసిన అభివృద్ధి, దూరదృష్టితో ఆలోచించి ఆయన యువతకు కల్పించిన గొప్ప భవిష్యత్ పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది” అని బాలకృష్ణ వివరించారు.  

ఇలాంటి పరిస్థితులను చంద్రబాబు అనేకం ఎదుర్కొన్నారు!

2021లో స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ ప్రభుత్వం నమోదుచేసిన ఎఫ్.ఐ.ఆర్ లో ఎక్కడా చంద్రబాబు పేరులేదు. రెండేళ్లు ఆగాక తీరుబడిగా దాన్నిమరలా బయటకు తీసుకొచ్చి, రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు చంద్రబాబు అనేకం ఎదుర్కొన్నారు. నేను ఆయన్ని కలిసినప్పుడు కూడా తన గురించి కాకుండా రాష్ట్రం ఇలా అయిపోతోందనే ఆయన బాధపడ్డారు. 

విశాఖపట్నంలో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సమ్మిట్ లో ఈ ప్రభుత్వం ఏఏ పారిశ్రామిక వేత్తలతో ఎన్ని ఒప్పందాలు చేసుకుందో చెప్పాలని మేం డిమాండ్ చేస్తే ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందనలేదు. అమరావతి ఉద్యమానికి పోటీగా జూనియర్ ఆర్టిస్ట్ లతో మూడురాజధానుల ఉద్యమం నిర్వహించినట్టే, వైజాగ్ లో కూడా జూనియర్ ఆర్టిస్ట్ లతో సమ్మిట్ నిర్వహించారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా, వారు అనుకున్నవిధంగా పాలకులు పనిచేస్తున్నారు.

జైల్లో ఉంది చంద్రబాబునాయడు కాదు… రాష్ట్ర భవిష్యత్!

చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలని, బేషరతుగా ఆయనకు క్షమాపణ చెప్పాలని మేం సభలో డిమాండ్ చేశాం. చంద్రబాబునాయుడు అంటే ఒక బ్రాండ్. ఆయన తీసుకొచ్చిన స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వల్ల 2.14లక్షల మంది యువత శిక్షణ పొందితే, దాదాపు 75 వేల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందారు. 

గతంలో కోర్టు కూడా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో ఎలాంటి అవినీతి జరగ లేదని తేల్చేసింది. జైల్లో ఉంది చంద్రబాబునాయడు కాదు… రాష్ట్ర భవిష్యత్. ఈ విషయం ప్రజలు కూడా గ్రహించారు. వారే రోడ్లపైకి వచ్చి,  ఈ దుర్మార్గాలను అడ్డుకుంటారు. మరలా ఇతను ముఖ్యమంత్రి అయితే అందరూ రాష్ట్రం వదిలిపోవాలి.

Related posts

ఉపముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్.. 24 మంది మంత్రుల జాబితా విడుదల…

Ram Narayana

వైసీపీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర

Ram Narayana

చంద్రబాబు బీజేపీ గేట్లు తెరిస్తే దూరాలని చూస్తున్నాడు: మంత్రి బొత్స

Ram Narayana

Leave a Comment