- చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ అందరినీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ
- వివేక్ తన కుటుంబ సభ్యులకు, పెట్రోల్ బంక్, రైస్ మిల్లులకు, మార్కెట్ వారికి డబ్బులు పంపిస్తున్నారన్న బాల్క సుమన్
- వివేక్ కార్పోరేట్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు
- తండ్రిని పట్టించుకోని వివేక్ చెన్నూరు ప్రజలను పట్టించుకుంటారా? అని ప్రశ్న
చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ అందరినీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఈ మేరకు వివేక్‌పై ఈసీ ప్రతినిధి అబ్ జర్వర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం సుమన్ మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ అభ్యర్థిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వివేక్‌పై ఈడీకి ఫిర్యాదు చేస్తామన్నారు. వివేక్‌కు చెందిన కంపెనీ విజిలెన్స్‌కు రూ.8 కోట్ల నగదు బదిలీ అయిందన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అందరినీ కొనుగోలు చేస్తున్నారన్నారు. ఈ నగదు హైదరాబాద్ నుంచి రామగుండంకు బదిలీ అయిందన్నారు. వివేక్‌కు సంబంధించిన అన్ని సంస్థలు, కంపెనీలపై నిఘా పెట్టాలని తాము ఈసీని కోరామన్నారు. తన కుటుంబ సభ్యులకు, పెట్రోల్ బంక్, రైస్ మిల్లులకు, మార్కెట్ వాళ్లకు ఆ డబ్బులను వివేక్ పంపిస్తున్నారన్నారు.
కరీంనగర్, మంచిర్యాల, మందమర్రి, చెన్నూరులో వ్యాపారులకూ కాంగ్రెస్ అభ్యర్థి డబ్బులు పంపిస్తున్నారన్నారు. వివేక్ కొడుకు, బిడ్డ, అల్లుడు, విశాఖ సంస్థల సిబ్బంది చెన్నూరులో వివేక్ కోసం పని చేస్తున్నారని, చొక్కాలు మార్చినంత సులభంగా ఆయన పార్టీలు మారుస్తున్నారని, అలాంటి వివేక్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వివేక్ మొన్నటి వరకు బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నారని, ఆయన వల్ల బీజేపీ ఇంకా మేనిఫెస్టోని ప్రకటించలేకపోయిందన్నారు. తాను వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తే వివేక్ లా విశాఖ లాంటి సంస్థలు పెట్టేవాడినన్నారు. నాలుగేళ్ల పాటు వివేక్ చెన్నూరులో కనిపించలేదన్నారు. అయినా సొంత తండ్రిని పట్టించుకోని వ్యక్తి చెన్నూరు ప్రజలను పట్టించుకుంటారా? అని ప్రశ్నించారు. ఆయన మొదటి నుంచి కార్పోరేట్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
సామంతరాజులలా ఊరికొకరిని పెట్టుకున్నారని, వివేక్ ఫ్యూడలిజం పాలన చేశారన్నారు. ధన రాజకీయాలు చేసే వివేక్ వంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. ఈ ఎన్నికల్లో వివేక్ కోట్ల రూపాయలు వెదజల్లి తనను ఓడించే కుట్రకు పాల్పడుతున్నారన్నారు. ఈ ఎన్నికలు డబ్బు అహంకారానికి, చెన్నూరు ఆత్మగౌరవానికి… వేల కోట్ల ఆస్తి కలిగిన వ్యక్తికి, వేలకోట్లు తెచ్చే వ్యక్తికి మధ్య జరుగుతున్నాయన్నారు. చెన్నూరు అభివృద్ధిపై తాను ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆవుల మందపై తోడేళ్లు పడినట్లు వివేక్ తన బలగంతో చెన్నూరుకు వచ్చారన్నారు.