- అదుపుతప్పి హైవేపై బోల్తా పడిన ఆర్టీసీ బస్సు
- దాదాపు 10 కి.మీ. మేర నిలిచిన ట్రాఫిక్
- నిలకడగా ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితి
షాద్ నగర్ మీదుగా హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ కు గురైంది. జాతీయ రహదారిపై దూసుకెళ్తున్న బస్సు ఉన్నట్టుండి అదుపుతప్పింది. డివైడర్ ను ఢీ కొట్టి రోడ్డుకు అవతలివైపుకు దూసుకెళ్లింది. వేగం ఎక్కువగా ఉండడంతో బోల్తాపడింది. దీంతో బస్సులోని డ్రైవర్, కండక్టర్లతో పాటు మొత్తం 20 మంది గాయపడ్డారు. అయితే, ఆ సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నామని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
రోడ్డుపై బస్సు బోల్తా పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా.. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.