- భద్రాద్రిలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీని కాదని… ఔట్ డేటెడ్ సబ్ క్రిటికల్ వాడటం వెనుక అవినీతి జరిగిందన్న సీఎం
- భద్రాద్రిని రెండేళ్లలో పూర్తి చేస్తామని ఏడేళ్లకు గానీ పూర్తి చేయలేదన్న రేవంత్ రెడ్డి
- జ్యూడిషియల్ విచారణలో రెండో అంశంగా భద్రాద్రి పవర్ ప్రాజెక్టును చేరుస్తున్నట్లు వెల్లడి
ప్రజల సెంటిమెంట్‌ను కేసీఆర్ తన ఆర్థిక దోపిడీకి ఉపయోగించుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్‌పై చర్చ సందర్భంగా శాసన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… భద్రాద్రిలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీని కాదని… ఔట్ డేటెడ్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడటం వెనుక అవినీతి జరిగిందని ఆరోపించారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం విస్పష్ట నిబంధనలు ఉన్నప్పటికీ దానిని బీఆర్ఎస్ ప్రభుత్వం పాటించలేదన్నారు.
భద్రాద్రి పవర్ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లకు గానీ పూర్తి చేయలేకపోయిందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం మెగావాట్‌కు రూ.9 కోట్ల 74 లక్షలు ఖర్చు చేశారన్నారు. పనికిరాని సబ్ క్రిటికల్ టెక్నాలజీతో రూ.10వేల కోట్ల మొత్తంతో భద్రాద్రిని నిర్మించి నిండా ముంచారన్నారు. ఇందులో వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందన్నారు. అందుకే భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కూడా జ్యూడిషియల్ విచారణలో రెండో అంశంగా చేరుస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.