- ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వేదికపై ఘటన
- స్టాలిన్ ఎడమచేయి పట్టుకుని కిందపడకుండా పట్టుకున్న మోదీ
- ఆపై ఇద్దరూ కలిసి స్టేజిపైకి
నడుస్తుండగా తూలి పడబోయిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేయి పట్టుకుని నడిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైలోని ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ వేదికపై జరిగిందీ ఘటన. మోదీ, స్టాలిన్ ఇద్దరూ నడుస్తుండగా, క్రీడామంత్రి ఉదయనిధి వారి వెనకే ఉన్నారు. ఈ క్రమంలో స్టాలిన్ ఒక మెట్టు తప్పిపోయి అడుగువేయడంతో ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి కిందపడబోయారు. పక్కనే ఉన్న మోదీ వెంటనే స్టాలిన్ ఎడమ చేయి పట్టుకుని కిందపడకుండా సాయం అందించారు. ఆపై ఇద్దరూ కలిసి స్టేజిపైకి చేరుకున్నారు.
ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మాట్లాడుతూ.. 2036 ఒలింపిక్ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. క్రీడాకారులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు, దేశాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ ఎకోసిస్టంకు కేంద్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. తమిళనాడును క్రీడలకు దేశ రాజధానిగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.