Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కాంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగాలంటూ ఘరానా మోసం… విశాఖలో ముగ్గురి అరెస్ట్

  • కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన విశాఖ సీపీ
  • నిరుద్యోగుల నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేశారని వెల్లడి
  • ఫెడెక్స్ స్కాంలోకి సామాన్యులను లాగడంపై శిక్షణ ఇస్తుంటారని వివరణ
  • కాంబోడియా ఎంబసీకి సమాచారం అందించామన్న సీపీ రవిశంకర్

కాంబోడియాలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసానికి పాల్పడిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మానవ అక్రమ రవాణా అంశం ముడిపడి ఉన్న ఈ కేసులో విశాఖ పోలీసులు ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ మీడియాకు వెల్లడించారు. 

డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట 150 మందిని కాంబోడియా తీసుకెళ్లి నిర్బంధించారని తెలిపారు. నిందితులంతా సైబర్ స్కాం ముఠాల సభ్యులని పేర్కొన్నారు. చైనాకు చెందిన మాఫియా కంపెనీల పనులను ఈ ముఠాలు చేస్తుంటాయని సీపీ వివరించారు. సామాన్యులను ఫెడెక్స్ స్కాంలోకి ఎలా లాగాలో శిక్షణ ఇవ్వడం వీరి పని అని వెల్లడించారు. 

విదేశాల్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తుంటారని, వసూలైన మొత్తంలో 80 శాతం కాంబోడియాలో ఉన్న ముఠాకు ఇస్తుంటారని వివరించారు. ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగి స్కాంలు చేసేవారికి 600 డాలర్ల జీతం ఇస్తుంటారని పేర్కొన్నారు. మాట వినకపోతే చిత్రహింసలకు గురిచేసి బానిసలుగా మార్చుతారని తెలిపారు. గత రెండేళ్లుగా ఈ ముఠా ఆగడాలు నడుస్తున్నాయని సీపీ రవిశంకర్ స్పష్టం చేశారు. 

ఈ కేసు గురించి ఇప్పటికే కాంబోడియా దౌత్య కార్యాలయానికి సమాచారం అందించామని చెప్పారు. కాంబోడియాలోని భారత ఎంబసీ సహకారం తీసుకుంటున్నామని వెల్లడించారు. 

ఈ వ్యవహారంలో ఏజెంట్లుగా పనిచేసిన జ్ఞానేశ్వరరావు, కొండలరావు, రాజేశ్వరరావులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో ఆరా తీస్తామని అన్నారు.

Related posts

శునకం ను రప్పించేందుకు లక్షల రూపాయలు ఖర్చు …ప్రత్యేక ఫ్లయిట్ !

Drukpadam

ఈ కాలంలో తాగేందుకు ఎన్నో వెరై‘టీ’లు!

Drukpadam

కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై ప్రశంసలు గుప్పించిన ప్రధాని మోదీ

Drukpadam

Leave a Comment