- మహారాష్ట్రలోని పలు థియేటర్లలో ఏర్పాటు
- ఆరు గంటలపాటు లైవ్ ప్రదర్శన
- టికెట్ రూ. 99 నుంచి రూ. 300 మాత్రమే
- ఇప్పటికే పలు థియేటర్లు ఫుల్
ప్రపంచకప్ ఫైనల్, ఐపీఎల్ ఫైనల్‌ను ప్రసారం చేసిన సినిమా థియేటర్లు ఇప్పుడు ఎన్నికల ఫలితాలను కూడా ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. దేశంలో సుదీర్ఘంగా సాగిన ఎన్నికలకు నేటితో తెరపడనుంది. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని సినిమా థియేటర్లలో లైవ్‌లో ప్రదర్శించాలని మహారాష్ట్రలోని కొన్ని థియేటర్ల యజమానులు నిర్ణయించినట్టు తెలిసింది.
ముంబైలోని ఎస్ఎం 5 కల్యాణ్, సియాన్, కంజూర్ మార్గ్‌లోని మూవీ మ్యాక్స్ థియేటర్లు, థానేలోని ఎటర్నిటీ మాల్, వండర్‌మాల్, నాగ్‌పూర్‌లోని మూవీ మ్యాక్స్ ఎటర్నిటీ, పూణెలోని మూవీ మ్యాక్స్ వంటి థియేటర్లు వెండితెరపై ఎన్నికల ఫలితాలను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అంతేకాదు, బిగ్‌స్క్రీన్‌పై ఫలితాలను తిలకించాలనుకునే వారి కోసం ఇప్పటికే పేటీఎం వంటి యాప్‌లలో టికెట్ల బుకింగ్ కూడా ప్రారంభమైందట. ఆరు గంటలపాటు ఫలితాలను ప్రసారం చేయనుండగా టికెట్ ధరలు రూ. 99 నుంచి రూ. 300 వరకు ఉన్నాయి. అంతేకాదు, థియేటర్లలో ఎన్నికల ఫలితాలు చూపేందుకు జనం కూడా ఆసక్తి చూపిస్తున్నారట. దీంతో చాలా థియేటర్లు ఇప్పటికే ఫుల్ అయిపోయాయట.