- నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు
- చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నాడే కానీ ప్రయోజనం లేదన్న షర్మిల
- కేంద్రంతో ఒక్క ప్రకటన కూడా చేయించలేకపోతున్నాడని విమర్శలు
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. సీఎం చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనలు చూస్తుంటే ‘అయిననూ పోయి రావలె హస్తినకు..’ అన్నట్టుంది అని ఎద్దేవా చేశారు.
ఎన్డీయే కూటమిలో పెద్దన్న పాత్రలో ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు… ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్టు? ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నట్టు? అని చంద్రబాబును ప్రశ్నించారు.
కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి నెల రోజులు దాటినా… మోదీతో గానీ, ఇతర మంత్రులతో గానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు? గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు అని కేంద్ర పెద్దలతో చెప్పించగలిగారా? పోలవరం ప్రాజెక్టుకు నిధులపై స్పష్టత ఇచ్చారా? రాజధాని నిర్మాణంపై కేంద్రం ఇచ్చే సాయం ఏంటో చెప్పగలిగారా? అంటూ నిలదీశారు.
ఒడ్డు దాటేదాకా ఓడ మల్లన్న… దాటాక బోడి మల్లన్న… ఇదే బీజేపీ సిద్ధాంతం అని షర్మిల పేర్కొన్నారు. బాబు గారు ఇప్పటికైనా కళ్లు తెరవడం మంచిది అంటూ ట్వీట్ చేశారు. మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు ఆడుకుంటోంది అని గుర్తిస్తే మంచిదని స్పష్టం చేశారు.