- లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీలో డిమాండ్లు
- మంత్రిగా తనకు చేతినిండా పని ఉందన్న లోకేశ్
- చంద్రబాబు పెట్టిన టార్గెట్ లపై ఫోకస్ చేశానని వెల్లడి
మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. లోకేశ్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ వరుసబెట్టి టీడీపీ నేతలు డిమాండ్ చేయడంతో… ఈ అంశం జనసేనలో ప్రకంపనలు పుట్టించింది. ఈ అంశం వివాదాస్పదం కావడంతో టీడీపీ అధిష్ఠానం కన్నెర్ర చేసింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ కేడర్ కు ఆదేశాలు జారీ చేసింది. జనసేన కూడా తమ పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడొద్దని, సోషల్ మీడియాలో స్పందించవద్దని ఆదేశించింది. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించినా, పార్టీ లైన్ దాటినా చర్యలు తప్పవని హెచ్చరించింది.
మరోవైపు దావుస్ పర్యటనలో నారా లోకేశ్ బిజీబిజీగా ఉన్నారు. ఈ తరుణంలో లోకేశ్ ను ఓ జాతీయ మీడియా ఛానల్ పలకరించింది. లోకేశ్ డిప్యూటీ సీఎం అనే వార్తలు లోకల్ మీడియాలో వస్తున్నాయని… మీ రాజకీయ లక్ష్యం ఏమిటని ఆ ఛానల్ ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా… తాను రాజకీయంగా మంచి పొజిషన్ లో ఉన్నానని లోకేశ్ చెప్పారు.
ఎన్నికల్లో తమను ప్రజలు మంచి మెజర్టీతో గెలిపించారని… 94 శాతం సీట్లలో కూటమి అభ్యర్థులు గెలిచారని లోకేశ్ అన్నారు. ప్రస్తుతం తనకు చేతినిండా పని ఉందని… తనకు అప్పగించిన శాఖలపై పూర్తి స్థాయిలో పని చేస్తున్నానని చెప్పారు. సీఎం చంద్రబాబు పెట్టిన టార్గెట్ లపై ఫోకస్ చేశానని తెలిపారు. గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థ దారుణంగా తయారయిందని… విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఏపీని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారు చేయాలనే చంద్రబాబు విజన్ కోసం తామందరం పని చేస్తున్నామని తెలిపారు.