- బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న జేడీయూ
- తమ ఏకైన ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉంటాడన్న రాష్ట్ర జేడీయూ అధ్యక్షుడు
- మరోసారి చర్చనీయాంశంగా మారిన నితీశ్ కుమార్ వైఖరి
మణిపూర్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వానికి నితీశ్ కుమార్ కు చెందిన జేడీయూ మద్దతు ఉపసంహరించుకుంది. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు మణిపూర్ రాష్ట్ర జేడీయూ పార్టీ అధ్యక్షుడు బీరేన్ సింగ్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. తమకున్న ఏకైక ఎమ్మెల్యే అబ్దుల్ నాసిర్ ప్రతిపక్షంలో ఉంటారని చెప్పారు.
మణిపూర్ లో 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2022లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 6 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ఎన్నికలు జరిగిన కొన్ని నెలల్లోనే ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు.
తాజాగా మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో నితీశ్ కుమార్ వైఖరి చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో, బీహార్ లో ఎన్టీయే కూటమిలో జేడీయూ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ తర్వాత తెలుగుదేశం, జేడీయూలు పెద్ద పార్టీలుగా ఉన్నాయి.