- ఇటీవల 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో దక్కిన మెజారిటీ మార్క్
- ప్రస్తుత మెజారిటీ మార్క్ 119 కాగా 121గా ఉన్న ఎన్డీయే బలం
- బిల్లులు ఆమోదింపజేసుకునేందుకు మార్గం సుగమం
పెద్దల సభ అయిన రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలం మెజారిటీ సంఖ్యను దాటింది. ఇటీవల కొత్తగా 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికవడంతో అధికార కూటమి మెజారిటీ మార్క్‌ను విజయవంతంగా దాటింది.
రాజ్యసభలో మొత్తం 245 సీట్లు ఉండగా ప్రస్తుతం 8 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో జమ్మూకశ్మీర్‌లో 4, మరో నాలుగు నామినేటెడ్ స్థానాలుగా ఉన్నాయి. ఇటీవల కొత్త సభ్యుల ఎన్నిక తర్వాత.. ఖాళీగా ఉన్న 8 స్థానాలను మినహాయిస్తే రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 237గా ఉంది. ఇక మెజారిటీ సంఖ్య 119గా ఉంది. కొత్త సభ్యుల ఎన్నికతో ఎన్డీఏ ఈ ఫిగర్‌ను విజయవంతంగా దాటింది. ప్రస్తుతం ఎన్డీయే సభ్యుల సంఖ్య 121గా ఉంది. దీంతో పార్లమెంటు ఎగువ సభలో బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ఎన్డీయేకి మార్గం సుగమం అయింది.
ఇక ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కొత్తగా 9 మంది సభ్యులను ఏకగ్రీవంగా గెలిపించుకోవడంతో సభలో బీజేపీ సంఖ్యా బలం 96కి పెరిగింది. ఎన్డీయే బలం 121, ప్రతిపక్షాల సభ్యుల సంఖ్య 85కి చేరుకుంది.