Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

పేదల సంక్షేమం ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం…..మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో పేదల సంక్షేమం ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బుధవారం నేలకొండపల్లి మండల కేంద్రంలోని భక్త రామదాసు ధ్యాన మందిరం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి నేలకొండపల్లి మండలం లబ్ధిదారులకు కాటమయ్య రక్షక కవచం భద్రత కిట్లను, కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.

నేలకొండపల్లి మండలంలో 34 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం క్రింద ఒక్కో జంటకు లక్షా 116 రూపాయల చొప్పున మొత్తం 34 లక్షల 3 వేల 944 రూపాయలను, అదే విధంగా 61 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మొత్తం 17 లక్షల 72 వేల 500 రూపాయల చెక్కులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పేదలకు మంచి జరగాలంటే ఇందిరమ్మ రాజ్యంతో సాధ్యమని ప్రజల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచిందని, ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుతో పాటు మాట ఇవ్వకపోయినా ప్రజా సంక్షేమం దృష్ట్యా కొన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. కులవృత్తులైన గీత కార్మికులకు, మత్స్యకారులు, ఇతర కులాల వృత్తులను ప్రోత్సహించేందుకు, కుల వృత్తులు నమ్ముకున్న వారికి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని అన్నారు.

నిరుపేదలు వైద్యం కోసం ఇబ్బంది పడవద్దని రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచిందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఆడ బిడ్డల తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా వివాహానికి కళ్యాణలక్ష్మి క్రింద ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం పాటించిన ఆర్థిక విధానాల కారణంగా రాష్ట్రం దివాలా తీసిందని, ఇందువల్ల మహిళలకు ఇచ్చిన మాట ఒకటి నెరవేర్చలేదని, త్వరలో ఆ పథకం కూడా ప్రారంభిస్తామని అన్నారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతులకు 18 వేల కోట్ల రుణ మాఫీ చేశామని, 2 లక్షలకు పైగా ఉన్న రైతులకు 13 వేల కోట్ల రుణ మాఫీ తప్పనిసరిగా పూర్తి చేస్తామని అన్నారు. అక్టోబర్ నెలాఖరు వరకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం అవుతుందని, అసెంబ్లీ నియోజకవర్గానికి 4 వేల ఇండ్ల చొప్పున మంజూరు చేస్తామని అన్నారు.

పాలేరు నియోజకవర్గంలో 8 నుంచి 12వ తరగతి వరకు చదివే చిన్నారులకు పి.ఎస్.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యంలో 620 సైకిళ్లను పంపిణీ చేస్తున్నామని, ఇంతకుముందు కూసుమంచి మండలంలో పంపిణీ చేశామని, నేడు నేలకొండపల్లి మండలంలోని చిన్నారులకు సైకిళ్ళు అందిస్తున్నామని అన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదువుకోవాలని మంత్రి సూచించారు.

కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ, కాటమయ్య రక్షక కవచ కిట్లకు సంబంధించి పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి 100 కిట్లు వచ్చాయని, దీనికి సంబంధించి ఎంపిక చేసిన గీత కార్మికులకు ఈ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు ఉన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం తరపున తహసిల్దార్, ఎంపిడిఓ, మండల పంచాయతీ అధికారి ఎప్పుడు అందుబాటులో ఉంటారని, సమస్యలను వారి దృష్టికి తీసుకొని వస్తే, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.

అనంతరం పి.ఎస్.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీఓ జి. గణేష్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర శర్మ, సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి, నేలకొండపల్లి మండల తహసీల్దార్, ఎంపీడీఓ, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఖమ్మం నుంచే తుమ్మల పోటీ …!

Ram Narayana

ఖమ్మం వార్తలు…….

Drukpadam

మమత మెడికల్ కాలేజ్ ప్రాపర్టీ టాక్స్ ఎగొట్టిన ప్రబుద్దుడు నీతులు చెపుతున్నాడు…పువ్వాడ అజయ్ పై ..తుమ్మల ధ్వజం

Ram Narayana

Leave a Comment