Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

గ్రామసభల్లో చదివేది తుది జాబితా కాదు…! ప్రభుత్వ పథకాలపై మంత్రి పొంగులేటి క్లారిటీ !

గ్రామసభల్లో చదివేది తుది జాబితా కాదు…! ప్రభుత్వ పథకాలపై మంత్రి పొంగులేటి క్లారిటీ !

  • జాబితాలో ఉంటే ఉన్నట్లు…. లేకపోతే రానట్లు కాదు
  • అర్హత ఉండి పేరు రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేయండి
  • వాటి ఆధారంగానే ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తాం
  • పేదవాళ్లలో బహు పేద వాళ్ళకి మొదటి ప్రాధాన్యత
  • ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షం ఓర్వలేక పోతుంది
  • ఇలాగే చేస్తే బీఆర్ఎస్ కు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవ్
  • తిరుమలాయపాలెం మండల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

గ్రామసభల్లో చదివే జాబితా తుది జాబితా కాదని… ఈ నెల 26 నుంచి అమలు కాబోతున్న నాలుగు పథకాల జాబితాలో పేర్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని జాబితాలో పేరు ఉంటే ఉన్నట్లు…. లేకపోతే రానట్లు కాదని ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అములు చేస్తున్న నాలుగు పథకాలపై తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు … తిరుమలాయపాలెం మండలంలో కేశవాపురం, తిప్పారెడ్డి గూడెం, జల్లెపల్లి, హైదరసాయిపేట, పడమటి తండా, జోగులపాడు, చంద్రు తండా, మహ్మదపురం తదితర గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభలను ఉద్దేశించి మంత్రి పొంగులేటి మాట్లాడారు. పేదవాళ్ళల్లో బహు పేదవాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇలా ఏ పథకం అయినా అర్హత ఉన్న వారికే అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం జరిగే గ్రామ సభల్లో ప్రకటించే జాబితాలో అర్హత ఉండి పేరు రాకపోతే ఆ గ్రామ సభల్లోనే మళ్ళీ తెల్ల కాగితం పైన దరఖాస్తులు రాసి ఇచ్చినా వాటి ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలోనే కాదు…. రాష్ట్రం అంతా ఇదే పద్ధతి అవలంభించడం జరుగుతుందని తెలిపారు. జాబితాలను ప్రకటించే క్రమంలో కొన్ని పొరపాట్లు దొర్లిన మాటలు వాస్తవమేనని వాటిని సవరించేందుకే మళ్ళీ గ్రామ సభలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇది నిరంతర ప్రక్రియ అని విడతల వారీగా ప్రజా ప్రభుత్వంలో ప్రతీ పేదవానికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రతిపక్షం కావాలనే అనవసర రాద్ధాంతాలు సృష్టించుతుందని పేర్కొన్నారు. పేదవాడికి మంచి చేసే ప్రభుత్వాన్ని విమర్శించడం తగదన్నారు. ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఒక పేదవాడికి కూడా న్యాయం చేయలేకపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేక అవాకులు చవాకులు పేలుస్తుందన్నారు. ఇలాగే చేస్తే రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ఈ పర్యటనలో రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, రామసహాయం నరేష్ రెడ్డి, చావా శివరామకృష్ణ, బెల్లం శీను, మంగీలాల్, కొప్పుల అశోక్, రామసహాయం అరవింద్ రెడ్డి, నరేందర్ రెడ్డి, పోట్ల కిరణ్, జడల నగేష్ గౌడ్, అంబేద్కర్, సుధాకర్ రెడ్డి, రాం రెడ్డి, ఉన్నం రాజశేఖర్, చీమ్లా తదితరులు ఉన్నారు.

Related posts

అంబేద్కర్‌ పై కేంద్ర మంత్రి అమిత్‌ షావ్యాఖ్యలకు అఖిలపక్షపార్టీలు ఖండన!

Ram Narayana

కమ్యూనిస్ట్ నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం పోటు ప్రసాద్…పలువురు ప్రముఖుల నివాళు!

Ram Narayana

ఖమ్మం ఖాసీం రజ్వీ పువ్వాడ అజయ్ …తుమ్మల ఫైర్

Ram Narayana

Leave a Comment