ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా … వైసీపీలో ప్రకంపనలు
అదే బాటలో అయోధ్యరామిరెడ్డి …
వైసీపీ మనుగడపై సందేహాలు …జగన్ స్వయంకృతాపరాధమేనా …?
అందరు చెప్పే మాటలే చెప్పిన విజయసాయి రెడ్డి
రాజకీయాలకు దూరం … ఏ పార్టీలో చేరడంలేదని స్పష్టీకరణ
రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా
చంద్రబాబు కుటుంబంతో నాకెలాంటి విభేదాలు లేవు…
పవన్ తో చిరకాల స్నేహం నాది: విజయసాయి
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్
ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు విజయసాయి ఫారెన్ ట్రిప్
నార్వే, ఫ్రాన్స్ వెళుతున్న వైనం
జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయి
సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పార్టీకి ,రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం వైసీపీలో ప్రకంపనలు రేపింది …అసలు వైసీపీలో ఏమి జరుగుతుంది …పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కక్కరుగా పార్టీని ఎందుకు వీడుతున్నారు …ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయగా మరో ఇద్దరు అందుకు సిద్ధంగా ఉన్నారు .. 2019 ఎన్నికల్లో సింగిల్ పార్టీ గా పోటీచేసి 51 శాతం ఓట్లు 151 అసెంబ్లీ , 22 ఎంపీ సీట్లు గెలుచుకొని పార్లమెంట్ లో మూడవ అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ 2024 లో ఓటమికి కారణాలు ఏమిటి …ఆపార్టీ అధినేత ఒంటెత్తు పోకడేనా …ఎవరి మాట వినకపోవడమేనా మరింకేదైనా కారణాలు ఉన్నాయా …? రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి… ఓటమి తర్వాత కూడా తమలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుగుతాను ,తిరిగి మనదే అధికారం అంటూ చెప్పడం విడ్డురంగా ఉండనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. పార్టీని బలోపేతం చేయాలనే జ్యాసేలేదు …ఎంతసేపటికి జగన్ తనను చూసి ఓట్లు వేశారని ,అందుకు తాను చెప్పినట్లు వింటే వినండి లేకపోతె లేదని అన్నట్లుగా వ్యవరించడంతో ఎన్నికల్లో జరిగిన పరాభవం కోలుకోలేకుండా చేసింది …తాజా పరిణామాలు గోరు చుట్టుపై రోకటిపోటులా ఉన్నాయి …ఆయన ఇంగ్లాండ్ వెళ్లిన సమయంలో ఆపార్టీలో జరుగుతున్నరాజకీయ పరిణామాలు వూహాత్మక తప్పిదాలకు మూల్యం చెల్లించక తప్పదా …? అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు …
తన రాజకీయ ఎదుగుదలలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన సొంత చెల్లిని , తల్లిని దూరం పెట్టారనే అపప్రదను జగన్ మూట కట్టుకున్నారు …తన చెల్లి అధికారంలో ఉన్న పార్టీ కన్నా తన అన్నపైన ఉన్న కక్షతో ఆయనపై విమర్శలు గుప్పిస్తుంది …ఆ విమర్శలు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి పెద్దగా ఉపయోగపడకపోయిన ప్రత్యర్థి పార్టీలకు మాత్రం జగన్ కు వ్యతిరేకంగా మంచి ఆయుధాలను అందిస్తున్నారు …
విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రేపు (జనవరి 25) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, అయితే ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. వేరే పదవులు, ప్రయోజనాలు, డబ్బు ఆశించి రాజీనామా చేయడంలేదని విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం అని, ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని, తనను ఎవరూ ప్రభావితం చేయలేదని వివరించారు.
మరో వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా విజయసాయి బాటలోనే నడిచారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. వచ్చే వారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని తెలిపారు. అయోధ్య రామిరెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు.
వైసీపీ సీనియర్ నేత, జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన విజయసాయిరెడ్డి తన ట్వీట్ తో హాట్ టాపిక్ గా మారారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ఆయన చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… విజయసాయిరెడ్డి పార్టీ కోసం గళం విప్పిన సందర్భాలు అతి తక్కువ అని చెప్పాలి. విజయసాయి జగన్ కు దూరం జరుగుతున్నారని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. అది ఇవాళ నిజం అయింది.
కాగా, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసాయి… తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఇక తాను వ్యవసాయం చేసుకుంటూ బతుకుతానని వెల్లడించారు. “ఇక నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను” అని విజయసాయిరెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టీడీపీతో రాజకీయంగా విభేదించానే తప్ప… చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది అని ఆయన తన ట్విట్ లో వెల్లడించారు.
ఇక, నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నానని విజయసాయి తన వీడ్కోలు ప్రకటనలో పేర్కొన్నారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని అంటూ ట్వీట్ చేశారు. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.
“పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ/రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశాను… కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశాను. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి… కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని అందించి… తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ గారికి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు” అంటూ విజయసాయి పేర్కొన్నారు.
ఆయన శుక్రవారం సీబీఐ కోర్టును ఆశ్రయించారు. తాను విదేశాలకు వెళ్లాల్సి ఉందని, అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ ఆస్తుల కేసులో విజయసాయిరెడ్డి కూడా నిందితుడు అని తెలిసిందే. ఆయన బెయిల్ పై బయటున్నారు. దాంతో, విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి.
ఈ నేపథ్యంలో… తాను నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ నేడు పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు తన విదేశీ పర్యటన ఉందని, అనుమతించాలని కోర్టును కోరారు. జగన్ ఆస్తుల కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ స్పందన కోసం తదుపరి విచారణను న్యాయస్థానం జనవరి 27కి వాయిదా వేసింది.