Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

తన నివాసం మీద డ్రోన్ దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తొలి స్పందన..!

  • నెతన్యాహు ఇంటిపై హిజ్బుల్లా డ్రోన్ దాడి
  • ఈ ఘటనను ‘ఘోర తప్పిదం’గా అభివర్ణించిన ఇజ్రాయెల్ ప్రధాని
  • దుష్ట శక్తులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక

తన నివాసంపై శనివారం జరిగిన డ్రోన్ దాడిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తొలిసారి స్పందించారు. ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా ఇవాళ తనను, తన భార్యను హత్య చేయడానికి చేసిన ప్రయత్నం ‘ఘోర తప్పిదం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘ మా భవిష్యత్తు రక్షణ కోసం శత్రువులపై మేము చేస్తున్న న్యాయమైన యుద్ధం కొనసాగించకుండా నన్ను లేదా ఇజ్రాయెల్‌ దేశాన్ని ఈ దాడి ఆపలేదు. నేను ఇరాన్‌తో దాని అనుకూల దుష్టశక్తులతో ఒక విషయం చెప్పదలచుకున్నాను. ఇజ్రాయెల్ పౌరులకు హాని కలిగించడానికి ప్రయత్నించే ఎవరైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఉగ్రవాదులను, వారిని పంపించేవారిని అంతం చేస్తాం. గాజాలో బందీలుగా ఉన్నవారిని విడిపించుకుంటాం. మా దేశ ఉత్తర సరిహద్దులో నివసిస్తున్నవారిని సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. రాబోయే తరాలకు భద్రత కోసం మేము పోరాడుతాం. దేవుడి దయతో మేము గెలుస్తాం’’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  

నెతన్యాహు లక్ష్యంగా ఆయన నివాసంపై శనివారం డ్రోన్ దాడి జరిగింది. కీలకమైన ఈ పరిణామాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారులు కూడా నిర్ధారించారు. సిజేరియాలో ఉన్న ప్రధాని నెతన్యాహు ఇల్లు లక్ష్యంగా డ్రోన్‌ను ప్రయోగించారని, అత్యాధునిక గగనతల రక్షణను దాటి మరీ ఈ డ్రోన్ వచ్చిందని అధికారులు తెలిపారు. లెబనాన్ నుంచి ఈ డ్రోన్‌ను ప్రయోగించారు.

దాడి జరిగిన సమయంలో ప్రధాని నెతన్యాహు, ఆయన భార్య ఇంట్లో లేరని ప్రధాని ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదని తెలిపారు. లెబనాన్, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

Related posts

గ్రీన్‌కార్డు హోల్డర్లకు 3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్!

Ram Narayana

నిజ్జర్ హత్య కేసులో భారత్ సహకరిస్తేనే వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ఉంటాయి: కెనడా

Ram Narayana

నార్త్ కరోలినాలో కాల్పుల కలకలం.. నలుగురు పోలీసుల మృతి!

Ram Narayana

Leave a Comment