- ఏఐలో గ్లోబల్ ఆధిపత్యం కోసం ముగ్గురు టెక్ దిగ్గజాలను ఏకం చేసిన ట్రంప్
- ఓపెన్‌ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్‌లతో కూడిన జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ ‘స్టార్‌గేట్’
- తాజాగా వైట్‌హౌస్‌లో ఈ ప్రాజెక్టును లాంచ్ చేసిన అధ్యక్షుడు
- వచ్చే 4 ఏళ్లలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడిని కలిగి ఉంటుందని ప్రకటన
- అమెరికాలో 1,00,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తుందని వెల్లడి
- ఓపెన్‌ఏఐని ప్రస్తావిస్తూ వారి వద్ద డబ్బు లేదంటూ మస్క్ విమర్శ
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గ్లోబల్ ఆధిపత్యం కోసం ముగ్గురు టెక్ దిగ్గజాలను ఏకం చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేశారు. ఓపెన్‌ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్‌లతో కూడిన జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ అయిన దీనికి ‘స్టార్‌గేట్’ అని పేరు పెట్టారు. వైట్‌హౌస్‌లో జరిగిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించారు.
అయితే ఈ మెగా ప్రాజెక్టుపై టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్ఏఐ సీఈఓ ఎలాన్ మస్క్ సందేహం వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించే బృందంలో చాట్‌జీపీటీ మేకర్, ఓపెన్ఏఐ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్, ఒరాకిల్ ఛైర్మన్ లారీ ఎల్లిసన్, సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ మసయోషి సన్ ఉన్నారు. స్టార్‌గేట్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించేందుకు వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి మూడు సంస్థల సీఈఓలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ… ఇది చరిత్రలో అతిపెద్ద ఏఐ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. వచ్చే నాలుగు సంవత్సరాలలో మొత్తం 500 బిలియన్ డాలర్ల పెట్టుబడిని కలిగి ఉంటుందని తెలిపారు. దీనిలో భాగంగా మొదటి విడతలో 100 బిలియన్ డాలర్లు తక్షణమే కేటాయించబడతాయన్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ అమెరికాలో 1,00,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తుందని చెప్పారు.
స్టార్‌గేట్‌పై మస్క్ విమర్శ
డొనాల్డ్ ట్రంప్ అతిపెద్ద మద్దతుదారులలో ఒకరైన ఎలాన్ మస్క్ ఈ భాగస్వామ్యానికి దూరంగా ఉన్నారు. ఇటీవల ఓపెన్ఏఐ, దాని నాయకత్వంపై విమర్శలు చేసిన మస్క్, స్టార్‌గేట్ సాధ్యాసాధ్యాలపై సందేహాన్ని వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (ట్విట్టర్)లో మస్క్ ఓపెన్ఏఐ ప్రకటనపై స్పందించారు.
“వాస్తవానికి వారి వద్ద డబ్బు లేదు ($500 బిలియన్). సాఫ్ట్‌బ్యాంక్ వద్ద 10 బిలియన్ డాలర్ల లోపే ఉంటుందనుకుంటున్నాను. ఆ విషయంలో నాకు మంచి అథారిటీ ఉంది” అని మస్క్ పేర్కొన్నారు. దాంతో మస్క్ ఈ ప్రాజెక్ట్‌ను అపహాస్యం చేసేలా మాట్లాడినట్లైంది.
2015లో ఓపెన్‌ఏఐ ప్రారంభమైనప్పుడు ఎలాన్ మస్క్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. లాభాపేక్ష లేకుండా, నిధులు అవసరమైనప్పుడు ఆయన ఈ ప్రాజెక్ట్‌కు నిధులు సమకూర్చారు. కానీ మస్క్ 2018లో ఓపెన్‌ఏఐ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత ఇటీవలి కాలంలో మస్క్, ఓపెన్ఏఐ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్ మధ్య సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్నాయి.
ఆయన చాట్‌జీపీటీ మేకర్‌పై దావా వేశారు. చాట్ జీపీటీ-మేకర్ లైసెన్సింగ్ ఒప్పందాలు, విశ్వాస నిరోధక చట్టాలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ మస్క్… ఓపెన్ఏఐ, సామ్ ఆల్ట్‌మాన్‌లపై పలు వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు స్టార్‌గేట్ ప్రాజెక్టులో ఓపెన్ఏఐ కీలక భాగస్వామి కావడం పట్ల ఆయన పెదివి విరిచారు.