- తుర్కియే నుంచి భారత్‌కు అప్పగించిన అధికారులు
- అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్టు ఆరోపణలు
- గతంలో రెండుసార్లు అరెస్ట్ అయినా తప్పించుకున్న డోలా
- ప్రస్తుతం ఢిల్లీలో ఎన్‌సీబీ అదుపులో ఉన్న నిందితుడు
అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నెట్‌వర్క్‌కు భారత దర్యాప్తు ఏజెన్సీలు భారీ షాక్ ఇచ్చాయి. దావూద్ కీలక అనుచరుడు, నిషేధిత డ్రగ్స్ తయారీలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సలీం డోలాను భారత్‌కు అప్పగించారు. తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో ఆ దేశ జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థ, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో డోలాను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని భారత్‌కు తరలించారు. ప్రస్తుతం డోలాను ఢిల్లీలోని ఆర్‌కే పురంలో ఉన్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) కార్యాలయంలో ఉంచారు. విచారణ అనంతరం అతడిని ముంబై పోలీసులకు అప్పగించనున్నారు.
దాదాపు పదేళ్ల క్రితం భారత్ నుంచి పారిపోయిన సలీం డోలా, విదేశాల్లో ఉంటూనే పలు రాష్ట్రాల్లో విస్తరించిన డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నడిపినట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఫైసల్ జావేద్ షేక్, అల్ఫియా ఫైసల్ షేక్ అనే వ్యక్తులు డోలా నుంచి మెఫిడ్రోన్ (ఎండీ) డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో తేలింది. మహారాష్ట్రలోని సాంగ్లీ, గుజరాత్‌లోని సూరత్ నుంచి యూఏఈ, తుర్కియే వరకు విస్తరించిన ఈ డ్రగ్స్ సరఫరాను డోలా తన అనుచరుల ద్వారా పర్యవేక్షించేవాడని గుర్తించారు. గతేడాది ఇంటర్‌పోల్ సహాయంతో డోలా కుమారుడు తాహెర్, మేనల్లుడు ముస్తఫా మహ్మద్ కుబ్బావాలాను యూఏఈ నుంచి భారత్‌కు రప్పించడంతో అతని నెట్‌వర్క్ బలహీనపడింది.
ఎవరీ సలీం డోలా?
1966లో ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో సలీం డోలా జన్మించాడు. చిన్న వయసులోనే అండర్‌వరల్డ్ వైపు ఆకర్షితుడై, దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-కంపెనీలో సభ్యుడైన ఛోటా షకీల్‌తో స్నేహం పెంచుకున్నాడు. మొదట్లో ముంబై, ఢిల్లీ నగరాల్లో గుట్కా స్మగ్లింగ్ చేసేవాడు. క్రమంగా డ్రగ్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టి గంజాయి రవాణా ప్రారంభించాడు.
2012లో 80 కిలోల గంజాయితో ఎన్‌సీబీ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే, దాదాపు ఐదేళ్లు జైలు జీవితం గడిపిన తర్వాత కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. జైలు నుంచి విడుదలయ్యాక పరారీలో ఉన్న డ్రగ్స్ సరఫరాదారు కైలాష్ రాజ్‌పుత్‌తో చేతులు కలిపి సింథటిక్ డ్రగ్స్ ప్రపంచంలోకి ప్రవేశించాడు. ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన ఒపియాయిడ్స్‌తో బటన్ అనే సింథటిక్ డ్రగ్‌ను మాత్రల రూపంలో తయారుచేసి విక్రయించడం మొదలుపెట్టాడు.
2018లో ముంబై యాంటీ నార్కోటిక్స్ సెల్ అధికారులు శాంతాక్రూజ్‌లో 100 కిలోల ఫెంటానిల్‌తో డోలాను అరెస్ట్ చేశారు. కానీ, ఫోరెన్సిక్ నివేదికలో శాంపిల్స్ నెగెటివ్‌గా రావడంతో కేవలం నాలుగు నెలల్లోనే బెయిల్ పొందాడు. బెయిల్ రాగానే భారత్ విడిచి యూఏఈకి పారిపోయాడు. అక్కడ తన కొడుకు తాహిర్ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించి, డ్రగ్స్ ద్వారా సంపాదించిన డబ్బును అందులో పెట్టుబడిగా పెట్టినట్టు అధికారులు గుర్తించారు.