- ప్రభుత్వ ఉద్యోగులు స్మార్ట్ వర్క్ చేయాలన్న చంద్రబాబు
- గతంలో ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చేదని వెల్లడి
- టెక్నాలజీ వల్ల ఎక్కువ గంటలు పనిచేయాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ
ప్రభుత్వ ఉద్యోగులు స్మార్ట్ వర్క్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండొద్దని స్పష్టం చేశారు.
గతంలో ఎక్కువ గంటలు పనిచేసే సంస్కృతి ఉండేదని వెల్లడించారు. అయితే, ప్రస్తుతం టెక్నాలజీ వల్ల ఎక్కువ గంటలు పనిచేసే అవసరంలేదని తెలిపారు. ఉద్యోగులు ఎవరూ ఎక్కువ గంటలు కష్టపడాల్సిన అవసరంలేదని చంద్రబాబు పేర్కొన్నారు. స్మార్ట్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ దినోత్సవ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
హైటెక్ సిటీ తరహాలో… అమరావతిలో డీప్ టెక్నాలజీ బిల్డింగ్
- నూతన ఐటీ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష
- డీప్ టెక్నాలజీ బిల్డింగ్ కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న సీఎం
- భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీదేనని వెల్లడి
- సమీక్షకు హాజరైన ఐటీ మంత్రి నారా లోకేశ్
హైదరాబాద్ నగరానికి హైటెక్ సిటీ ఎలా వన్నె తెచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే, ఏపీ రాజధాని అమరావతిలోనూ హైటెక్ సిటీ తరహాలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ బిల్డింగ్ నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ నూతన ఐటీ పాలసీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీప్ టెక్నాలజీ బిల్డింగ్ అంశం ప్రస్తావనకు వచ్చింది.
గతంలో హైదరాబాదులో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు హైటెక్ సిటీ తీసుకువచ్చామని చంద్రబాబు తెలిపారు. భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని, డీప్ టెక్నాలజీతో కలిగే అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని అన్నారు.
ఈ దిశగా అమరావతిలో డీప్ టెక్నాలజీ భవనం నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాగా, ఈ సమీక్ష సమావేశంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు.