Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ప్రైవేటు స్కూల్స్ వచ్చాక గురుకులాల ప్రభ కొంత తగ్గింది: రేవంత్ రెడ్డి

  • గురుకులాల్లో చదివి ఎంతోమంది ఉన్నతస్థానాల్లో ఉన్నారన్న సీఎం
  • గురుకులాల బాట కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామన్న సీఎం
  • డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామన్న రేవంత్ రెడ్డి

ప్రైవేటు స్కూల్స్ వచ్చాక కొంతవరకు గురుకులాల ప్రభ తగ్గిందని, కాబట్టి ప్రక్షాళన కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఒకప్పటి గురుకుల విద్యార్థులేనని తెలిపారు. గురుకులాల్లో చదివిన వారు ఎంతోమంది ఉన్నతస్థానాల్లో ఉన్నారన్నారు. గురుకులాలు అంటే బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అనే గుర్తింపు తీసుకు రావాలన్నారు.

రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను సీఎం సందర్శించి, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళలో కామన్ డైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు హయాంలో గురుకులాల వ్యవస్థ వచ్చిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇటీవల డైట్ ఛార్జీలు పెంచినట్లు చెప్పారు. గురుకులాల బాట కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామన్నారు. పాఠశాలల్లోని విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు బాగున్నాయన్నారు.

బీఆర్ఎస్ తన పదేళ్ల కాలంలో గురుకులాల్లోని విద్యార్థుల కోసం డైట్ ఛార్జీలను పెంచలేదని విమర్శించారు. కానీ తాము వచ్చాక 40 శాతం పెంచామన్నారు. 16 ఏళ్లలో ఎప్పుడూ కాస్మోటిక్ ఛార్జీలు పెరగలేదని, తాము 200 శాతం పెంచామన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలామంది గురుకులాల్లో చేరుస్తున్నారని, మనల్ని నమ్మి తల్లిదండ్రులు విద్యార్థులను పంపిస్తున్నారని తెలిపారు.

గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థుల మృతి బాధాకరమని, ఈ విషయమై ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతి నెల 10వ తేదీ లోపు గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని విద్యాసంస్థలకు సంబంధించిన నిధులు వస్తాయన్నారు.

Related posts

హైదరాబాద్‌లో ఉన్న భార్యపై లండన్ నుంచి భర్త విష ప్రయోగం

Ram Narayana

తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఎప్పుడో చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్!

Ram Narayana

కుటుంబ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు.. మంత్రి పొంగులేటి!

Ram Narayana

Leave a Comment