క్రైమ్ వార్తలుతెలంగాణ వార్తలు

రాజలింగమూర్తి హత్యలో భిన్న కోణాలు …ఎస్పీ పర్వేక్షణలో దర్యాప్తు ..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్యపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గత ప్రభుత్వమే కారణమని కేసు వేసిన వ్యక్తి కావడంతో ఈఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, గతంలో రాజలింగమూర్తిపై భూతగాదాల కేసులు ఉండటంతో పోలీసులు ఈ కోణంలోనూ ఆరా తీశారు. రూ .కోట్ల విలువైన భూమిని కోర్టు ద్వారా పొందేందుకు గతంలో రాజలింగమూర్తి ఎవరికైతే సహకరించారో వాళ్లే ఆయన్ను హత్య చేసి ఉంటారని ప్రాథమికంగా తేలినట్లు తెలుస్తోంది. హత్యలో పాల్గొన్న నలుగురిలో… ఇద్దరు పోలీసుల అదుపులో ఉండగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. జిల్లా ఎస్పీ కిరణ్‌ ఖరే ప్రత్యక్ష పరిశీలనలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు… నిందితులు ఉపయోగించిన కత్తిని ఘటనాస్థలంలో స్వాధీనం చేసుకున్నారు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు మాట్లాడుతూ… భూవివాదం నేపథ్యంలోనే తన భర్త హత్య జరిగినట్లు రాజలింగమూర్తి భార్య సరళ ఫిర్యాదు చేశారన్నారు. ఈమేరకు రేణుకుంట్ల సంజీవ్, పింగిలి శ్రీమంత్‌(పెద్ద తూండ్ల), మోరే కుమార్‌(కొంపెల్లి), కొత్తూరు కుమార్, రేణుకుంట్ల కొమరయ్య పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు సీఐ నరేష్‌కుమార్‌ తెలిపారు.

అసలు వివాదం ఏమిటంటే…!
భూపాలపల్లిలోని పోలీసుస్టేషన్‌ ఎదురుగా ఉన్న 319 సర్వే నంబరులో 2.25 ఎకరాల భూమి ఉంది. అందులోని ఒక ఎకరాన్ని సింగరేణి యాజమాన్యం రోడ్డు నిర్మాణానికి సేకరించగా మిగిలిన 1.25 ఎకరాలపై రేణుకుంట్ల కొమరయ్య, బుర్ర చంద్రయ్యల మధ్య వివాదం నడుస్తోంది. హనుమకొండలోని ఓ న్యాయవాదితో కేసు వేయించి, 1.25 ఎకరాలను కోర్టు ద్వారా రేణుకుంట్ల కొమరయ్యకు వచ్చేలా రాజలింగమూర్తి చొరవ చూపారు. ఫీజు కింద ఆరు గుంటల భూమిని ఇచ్చేందుకు కొమరయ్య ఒప్పుకొన్నారని, అందులో నాలుగు గుంటలు న్యాయవాది భార్య పేరిట, రెండు గుంటలు రాజలింగమూర్తి భార్య పేరిట రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తెలిసింది. అయితే, ఖాళీగా ఉన్న స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కొమరయ్య కుటుంబ సభ్యులు పలుమార్లు ప్రయత్నించినట్లు సమాచారం. తన భార్య పేరిట ఉన్న స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరు నెలల క్రితంరాజలింగమూర్తి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై ఈ నెల 20న (గురువారం) భూపాలపల్లి సబ్‌కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. పిటిషనర్‌ మృతితో కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. వివాదం నేపథ్యంలో రాజలింగమూర్తిని బుధవారం రాత్రి భూపాలపల్లిలో కొమరయ్య కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.

హత్యపై సీఎం కార్యాలయం ఆరా!
హత్యకు రాజకీయ కారణాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో అదుపులో ఉన్న నిందితుల సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హత్యకు దారితీసిన పరిస్థితులను సీఎంవో అధికారులు… నిఘావర్గాల ద్వారా తెలుసుకున్నట్లు సమాచారం.

Related posts

తాండూరులో కలకలం రేపిన జిల్లా ఆసుపత్రి పేరు మార్పు ఫ్లెక్సీ వ్యవహారం!

Ram Narayana

దొంగల ముఠాను ఏర్పాటు చేసి దొంగతనాలు చేయిస్తున్న కానిస్టేబుళ్లు!

Drukpadam

ఫోన్ ట్యాపింగ్ విచారణ ఏమైనా డైలీ సీరియలా ? : ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం

Ram Narayana