Sri Rama Navami, Bhadrachalam
ఆంధ్రప్రదేశ్

సీతారాముల కళ్యాణం చూతము రారండీ

  • నేటి రామయ్య కళ్యాణానికి ముస్తాబైన భద్రాచలం
  • పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి
  • సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ట్రైబల్ మ్యూజియం

భద్రాచలంలో అంగరంగ వైభవంగా ఆదివారం జరగనున్న  శ్రీ సీతారాముల కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రంగు రంగుల పూలు, స్వాగత తోరణాలతో మిథులా స్టేడియం పెళ్లి వేడుకకు ముస్తాబైంది. ముత్యాల ముగ్గులు, తీరొక్కపూలతో అలంకరించిన పెళ్లి మండపం కల్యాణ క్రతువుకు సిద్ధమైంది. సిరి కల్యాణపు తిలకం, బుగ్గన చుక్క, పాదాలకు పారాణితో వరుడు రామయ్య, కస్తూరి నామము, పూల జడ, బుగ్గన చుక్కతో వధువు సీతమ్మ తల్లి పెళ్లికి తయారయ్యారు. ఈ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులారా చూసేందుకు ఇప్పటికే వేలాది మంది భక్తులు భద్రాచలం చేరుకున్నారు. భక్తుల రాకతో భద్రగిరి పులకించి పోతోంది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు తిరు కల్యాణ మహోత్సవం ప్రారంభమై 12,30 గంటలకు ముగుస్తుంది. సరిగ్గా అభిజిత్ లగ్నంలో భక్తుల జయ జయ ద్వానాల మధ్య రాములోరి పెండ్లి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. కళ్యాణాన్ని తిలకించేందుకు పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, న్యాయ మూర్తులు భద్రాచలం రానున్నారు. కళ్యాణం అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అలాగే, రూ. 34 కోట్లతో చేపట్టనున్న ఆలయ మాడ వీధుల విస్తరణ పనులకు శంఖుస్థాపన చేస్తారు.

కళ్యాణానికి సకల ఏర్పాట్లు

కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కల్యాణ వేడుక నిర్వహించే మిథిలా స్టేడియంలో భక్తుల సౌకర్యార్థం షామియానాలు, చలువ పందిళ్లు వేశారు. వేసవి దృష్ట్యా మిథిలా మైదానంలో ఫ్యాన్లు, కూలర్లు అమర్చారు. మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ సారి భక్తుల తాకిడి, ప్రముఖుల రాక ఎక్కువగా ఉండటంతో పోలీసు శాఖ ఎక్కడా ఇబ్బందులు తలెత్త కుండా దాదాపు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తోంది. కళ్యాణానికి వచ్చే భక్తులకు సరి పడా 200 క్వింటాళ్ళ తలంబ్రాలను సిద్ధం చేశారు. తలంబ్రాలకు 80, లడ్డూల పంపిణీకి 19 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు లక్షన్నర లడ్లు భక్తులకు అందించేలా చర్యలు తీసుకున్నారు. కరకట్ట నుండి కళ్యాణం జరిగే స్టేడియం, భద్రాచలం పట్టణం, దేవాలయం పరిసరాల్లో ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు 35 చోట్ల 350 మంది గ్రామ పంచాయితీ సిబ్బందిని అందుబాటులో వుంచారు. భక్తులు గోదావరి లోకి వెళ్ల కుండా భారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు రిస్క్ బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. కళ్యాణం, పట్టాభిషేకం పూర్తయ్యే వరకు భద్రాచలంతో పాటు సారపాక, ఏటపాకలో ఉన్న బార్ షాపులు మూసి వేయాలని ఎక్సైజ్ అధికార్లు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 50 బెడ్లు, ప్రత్యేక వార్డు, పర్ణశాలతో కలుపుకొని13 మెడికల్ క్యాం పులు ఏర్పాటు చేశారు. మెడికల్ ఆఫీసర్లు,  సిబ్బందిని, సరి పడా మందులను అందుబాటులో ఉంచారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపటారు.

Related posts

తెలుగులో అన‌ర్గ‌ళంగా మాట్లాడుతున్న ఇథియోపియా మహిళా మంత్రి…

Drukpadam

తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన సునీత..

Drukpadam

ఈ అలవాట్లతో కిడ్నీలకు డేంజర్!

Drukpadam