- జీతాలు పెంచడంతో పాటు రెగ్యులరైజేషన్ కూడా చేస్తాం
- అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్
- మిషన్ వాత్సల్య పథకం కింద అనాధ పిల్లలకు నెలకు రూ. 4000
- చిన్న, చిరు ఉద్యోగస్తుల కష్టాలు కన్నీళ్లు తుడవటమే ప్రభుత్వ లక్ష్యం
- తెలంగాణ మంత్రి ధనసరి సీతక్క ( అనసూయ ) వెల్లడి

రాబోయే రోజుల్లో ఆశ వర్కర్ల జీతాలు పెంచడంతో పాటు రెగ్యులరైజేషన్ కూడా చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళ, శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖా మంత్రి ధనసరి సీతక్క ప్రకటించారు. అంగన్వాడీ టీచర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రిటైర్మెంట్ బెనిఫిట్ రెండు లక్షల రూపాయలు అందించడానికి ఆమోదం తెలుపుతూ నిన్న ( బుధవారం) సాయంత్రం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంతకం చేశారని తెలిపారు. చిన్న, చిరు ఉద్యోగుల కష్టాలు కన్నీళ్లు తుడవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం అందించే పథకాలు క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరికీ అందే విధంగా ఉద్యోగులు కూడా సహకరించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె గురువారం పాత కొత్తగూడెం నుండి పెనుబల్లి వెళ్ళే రోడ్డులో రూ. 6.50 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి పనులకు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తగూడెం క్లబ్ లో ఇందిరమ్మ అమృతం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ మిషన్ వాత్సల్య పథకం కింద తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా ప్రభుత్వం నెలకు 4 వేల రూపాయలను అందజేస్తున్నట్లు తెలిపారు. తల్లితండ్రులు లేని పిల్లలు బాధ పడొద్దని, ఇంత పెద్ద ప్రభుత్వం మీ వెంట ఉందని అభయమిచ్చారు.
రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం పథకం
కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృత పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా మూడు జిల్లాల్లో 50 వేల 269 మంది బాలికలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆడ పిల్లలు సరైన పౌష్టికాహారం లేక అనేక రకాల జబ్బుల భారిన పడుతున్నారని అన్నారు. అందుకే, 14 నుండి 18 సంవత్సరాల లోపు బాలికలకు ఈ ఇందిరమ్మ అమృతం పథకం ద్వారా మిల్లెట్స్ తో కూడిన చిక్కీలను నెలకు రెండు ప్యాకెట్లు అందించడం జరుగుతుందన్నారు. ఒక్కో ప్యాకెట్లో 15 చిక్కిలు ఉంటాయని రోజుకు ఒక చిక్కి తిండటం ద్వారా ఆడ పిల్లలు నెలసరి టైంలో వచ్చే సమస్యలను, రక్తహీనతను అధిగమించొచ్చనిచెప్పారు. ఆడ పిల్లను ఎదగనిద్దాం, బ్రతకనిద్దాం, గౌరవిద్దాం, వారిని ప్రోత్సహించి లక్ష్యాలను సాధిద్దామని మంత్రి సీతక్క ఈ సందర్భంగా నినదించారు.
అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్చాం
అంగన్వాడీ కేంద్రాలన్నింటిని ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్చామని, పిల్లలందరికీ నర్సరీ పాటలతో పాటు ఆహారం అందించడం జరుగుతుందని సీతక్క తెలిపారు. ప్రైవేటు పాఠశాలకు వెళ్లి తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేస్తున్నామన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా అంగన్వాడీ కేంద్రాలలో ఏక రూప దుస్తులను అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు ఆడుకోవడానికి 57 రకాల ఆట వస్తువులను అందుబాటులో ఉంచామన్నారు. త్వరలోనే గర్భిణీ స్త్రీలు కింద కూర్చోకుండా అన్ని అంగన్వాడి కేంద్రాలలో బల్లలను ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పంపిణీ చేస్తున్న బాలామృతం కొంత మార్చి, పిల్లలు ఇష్టంగా తినే విధంగా, రుచికరమైన పదార్థాలను వాళ్ల ఆరోగ్యాన్ని పెంపొందించి బలంగా తయారయ్యాలాగా అందిస్తామన్నారు. అంగన్వాడి టీచర్లు పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలను ఆకర్షించే విధంగా బొమ్మలు, పెయింటింగ్ ద్వారా పాఠాలు బోధించాలన్నారు. జిల్లాలో మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికార్లు తయారు చేసిన వేస్ట్ నుండి బెస్ట్ చాలా ఆకర్షించిందని, వాటిని రాష్ట్ర వ్యాప్తంగా చూపెడతామన్నారు. మొదటిసారిగా అంగన్వాడీ కేంద్రాలకు నెల రోజుల వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ముందుగా మంత్రి సీతక్క ఐసిడిఎస్ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ఇందిరమ్మ అమృతం పథకం కింద జిల్లాకు మంజూరైన 74 లక్షల 64 వేల రూపాయల చెక్కును పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రెండు లక్షల రూపాయలు ఇచ్చేందుకు కృషి చేసిన మంత్రి సీతక్కను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత రామచంద్రన్, మహిళ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, ఐటిడిఏ పిఓ రాహుల్ జడ్పీ సీఈవో నాగలక్ష్మి, సిపిఓ సంజీవ రావు,మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లేనినా తదితరులు పాల్గొన్నారు.
సీతారామ చంద్రస్వామిని దర్శించుకున్న సీతక్క
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క, గురువారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ రమాదేవీ, అర్చకులు సీతక్కకు పూర్ణకుంబ స్వాగతం పలికారు.