తెలంగాణ వార్తలు

మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ కలకలం .. రిసార్ట్‌పై పోలీసుల దాడి .. గంజాయి స్వాధీనం!

  • సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలపై పోలీసుల ఆకస్మిక దాడులు
  • చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో భారీగా గంజాయి, విదేశీ మద్యం పట్టివేత
  • పార్టీకి హాజరైన కొందరికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ
  • సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు వార్తలు
  • టాలీవుడ్‌లో మాదకద్రవ్యాల వినియోగంపై మళ్లీ తీవ్ర ఆందోళన
  • ఘటనపై కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు

ప్రముఖ టాలీవుడ్ గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదంగా మారాయి. మాదకద్రవ్యాల వినియోగం జరుగుతోందన్న పక్కా సమాచారంతో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పరిధిలోని త్రిపుర రిసార్టులో మంగళవారం రాత్రి జరిగిన ఈ వేడుకలపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ ఘటన సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. గాయని మంగ్లీ తన పుట్టినరోజు సందర్భంగా నిన్న‌ రాత్రి చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు హాజరైనట్లు తెలిసింది. అయితే, ఈ పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో అప్రమత్తమైన ప్రత్యేక బృందాలు రిసార్టుపై మెరుపు దాడులు చేశాయి.

పోలీసులు జరిపిన సోదాల్లో పెద్ద మొత్తంలో గంజాయి ప్యాకెట్లు, ఖరీదైన విదేశీ మద్యం సీసాలు లభ్యమైనట్లు సమాచారం. దీంతో పార్టీలో ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా, కొందరికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్లు వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ వినియోగించిన వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనతో తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి మాదకద్రవ్యాల వాడకంపై చర్చ మొదలైంది. ముఖ్యంగా యువత ఇలాంటి పార్టీల పేరుతో పెడదారి పడుతున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. పార్టీ నిర్వాహకుల పాత్రపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ రాకెట్ వెనుక ఎవరున్నారు? సరఫరాదారులు ఎవరు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Related posts

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత!

Ram Narayana

మాజీ ఎంపీ వివేక్, ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలపై ఈడీ ప్రకటన

Ram Narayana

స్కానింగ్ సెంటర్ వ్యవహారంపై నిజామాబాద్ కలెక్టర్ సీరియస్.. విచారణకు ఆదేశం…

Ram Narayana