నిరుపేదలకే మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ళు…మంత్రి తుమ్మల
నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు
బుధవారం రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి తుమ్మల రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమ కార్యక్రమాల పట్ల చిత్తశుద్ధితో ఉందని అన్నారు … ఎస్సీ కాలని నందు 80 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు, 4 కోట్ల 95 లక్షలతో చిమ్మపూడి నుండి పండితాపురం సంత వరకు నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, కోటి 50 లక్షలతో చిమ్మపూడి నుండి మంచుకొండ వరకు నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ గ్రామంలో గుడిసెల్లో ఉండే నిరుపేదలను మొదటి విడత క్రింద ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని, ఎదుగుదలను నిరంతరం మానిటరింగ్ చేయాలని, పెండింగ్ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు.
దశల వారీగా ఊరిలో పూరి గుడిసే లేకుండా అర్హులందరికీ ఇండ్లు అందించాలని, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలని అన్నారు. 12 వేల కోట్ల రూపాయలతో సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, 25 వేల కోట్లతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, 9 వేల కోట్ల రైతు భరోసా, 33 కోట్లతో చేనేత రుణమాఫీ చేశామని అన్నారు.
గతంలో చిమ్మపూడి గ్రామానికి రోడ్డు లేదని, ప్రస్తుతం అటువంటి మౌళిక వసతుల కల్పన పనులు పూర్తి చేశానని అన్నారు. ప్రజల పిల్లలు చదువుకునేందుకు రఘునాధపాలెం మండలంలో స్వామి నారాయణ స్కూల్, సమీకృత గురుకుల పాఠశాలలు ఏర్పాటు అవుతున్నాయని, విద్య ద్వారానే పేదరికం దూరం అవుతుందని, పిల్లలకు తప్పనిసరిగా చదువు చెప్పించాలని అన్నారు. బుగ్గ వాగు ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేలా కార్యాచరణ చేపట్టామని అన్నారు.
గ్రామాలు పచ్చగా, పరిశుభ్రంగా ఉండాలని, అందరూ సంతోషంగా, ఆనందంగా వుండాలని మంత్రి అన్నారు. సమస్యలు ఒక్కొక్కటిగా అన్నిటినీ పూర్తి చేస్తామన్నారు. పేదలకు, రైతులకు, భవిష్యత్తులో పిల్లలకు ఏం కావాలి ఆలోచించుకొని మంచి కార్యక్రమాలు చేపట్టి, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. కుల, మత, రాజకీయలకతీతంగా అందరూ సామరస్యంగా వుండాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, ఆర్డీఓ నరసింహా రావు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, పీఆర్ ఎస్ఇ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బి ఇఇ పవార్, రఘునాధపాలెం మండల తహసీల్దార్ శ్వేత, ఎంపిడివో అశోక్ కుమార్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.