
సిఎం దృష్టికి ఖమ్మం ఇళ్లస్థలాల సమస్య
వాస్తవాలను ప్రజలకందించాలి
విలువలు పాటిస్తూ వృత్తి గౌరవాన్ని పెంచుకోవాలి
పొలం ఉన్న వారు కలం వదిలి హలం పట్టి జీవితం మెరుగు పరచుకొండి:
ఘనంగా టియూడబ్ల్యూజె(ఐజెయు) నగర కమిటీ మహాసభ లో
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. టియూడబ్ల్యూజె(ఐజెయు) ఖమ్మం నగర మహాసభ జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం నగర అధ్యక్షులు మైసా పాపారావు అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు భంగం కలింగించకుండా చూసే బాధ్యత జర్నలిస్టులకుందన్నారు. వాస్తవాలను ప్రజలకందించి వృత్తిని విలువను పెంపొందించుకోవాలన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జర్నలిస్టులతో తనకెంతో అనుబంధం ఉందన్నారు. వారి సమస్యలు తెలుసని తప్పకుండా ఖమ్మం జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికే కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిఎంను కలిసి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
పొలం ఉన్న వారు కలం వదిలి హలం పట్టి జీవితం మెరుగు పరచుకోవాలని తుమ్మల హితవు పలికారు. హెల్త్‌కార్డులు, అక్రిడేషన్లు, పెన్షన్లు తదితర సమస్యలపై రాష్ట్రస్థాయిలో చర్చిస్తామన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఐజెయును అభినందించారు.
ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకంలో జర్నలిస్టులను చేర్చండి : రాం నారాయణ
ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకంలో జర్నలిస్టులను కూడా చేర్చాలని టియూడబ్ల్యూజె(ఐజెయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాం నారాయణ కోరారు. నగర మహాసభలో ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పుకు, ఖమ్మం ఇళ్లస్థలాల జీఓకు సంబంధం లేదన్నారు. హెల్త్‌కార్డులు పని చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే అక్రిడేషన్లు ఇవ్వాలని, జర్నలిస్టులపై జరిగే దాడులను నియంత్రించాలని కోరారు. ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, టియూడబ్ల్యూజె(ఐజెయు) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సామినేని మురారి, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావ్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, కోశాధికారి శివానంద, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి కనకం సైదులు, సీనియర్ జర్నలిస్టు నలజాల వెంకట్రావ్, కెమెరామెన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆలస్యం అప్పారావు, ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కమతం శ్రీనివాస్, డెస్క్ జర్నలిస్టు అధ్యక్షులు కొమ్మినేని ప్రసాదరావు, సీనియర్ జర్నలిస్టులు భూపాల్, మహేందర్, మెహియుద్దీన్, నామా పురుషోత్తం, పసుపులేటి సత్యనారాయణ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గీతాపాలాపనతో మహాసభ ప్రారంభమైంది. ఇటీవల కాలంలో అశువులు బాసిన జర్నలిస్టులకు సంతాప తీర్మానం కనకం సైదులు ప్రవేశపెట్టగా మహాసభ 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించింది. నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్ అతిధులను వేదికపైకి ఆహ్వానించారు.
పలు సమస్యలపై మంత్రి తుమ్మలకు వినతి
మహాసభలో మంత్రి తుమ్మలకు జర్నలిస్టుల సమస్యలపై టియూడబ్ల్యూజె(ఐజెయు) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు వినతి పత్రం అందచేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ జర్నలిస్టుల ఇళ్లస్థలాల నిమిత్తం గత ప్రభుత్వం కేటాయించిన భూమిని స్తంభాద్రి జర్నలిస్ట్స్ హౌజింగ్ సొసైటీకి అప్పగించాలని వినతిపత్రంలో కోరారు. అలాగే హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మీడియా పిఆర్‌ఓ లేదా లైజనింగ్ ఆఫీసర్‌ను నియమించాలని కోరుతూ వినతిపత్రం అందచేశారు.
ఖమ్మం నగర కమిటీ ఎన్నిక
టియూడబ్ల్యూజె(ఐజెయు) ఖమ్మం నగర కమిటీని మహాసభలో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చెరుకుపల్లి శ్రీనివాసరావు(సూర్య), ప్రధాన కార్యదర్శిగా జనర్దనాచారి(నవభూమి), కోశాధికారిగా ఏలూరు వేణుగోపాల్(న్యూస్‌బూమ్) ఎన్నికయ్యారు.
ఖమ్మం ప్రెస్‌క్లబ్ కమిటీ ఎన్నిక
టియూడబ్ల్యూజె(ఐజెయు) అనుబంధమైన ఖమ్మం ప్రెస్‌క్లబ్ నూతన కమిటీని మహాసభలో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నామా పురుషోత్తం(మనం), ప్రధాన కార్యదర్శిగా శీలం శ్రీనివాస్(నమస్తే తెలంగాణ), కోశాధికారిగా కళ్యాణ్ చక్రవర్తి(ముద్ర) ఎన్నికయ్యారు.
ఎలక్ట్రానిక్ మీడియా నగర కమిటీ ఎన్నిక
ఎలక్ట్రానిక్ మీడియా నగర కమిటీని మహాసభలో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గుండ్ల రాంబాబు(10 టివి), ప్రధాన కార్యదర్శిగా కారుమంచి శ్రీనివాస్(సాక్షి టివి), కోశాధికారి వందనపు ఉమేష్(స్టూడియో ఎన్) ఎన్నికయ్యారు.