- ఈసీ, బీజేపీ కుమ్మక్కయ్యాయన్న రాహుల్ గాంధీ
- ఎన్నికల ప్రక్రియను ఈసీనే నీరుగారుస్తోందని ఆరోపణ
- మహారాష్ట్రలో 5 నెలల్లో కోటి ఓట్లు పెరగడంపై ప్రశ్నలు
- ఓటర్ల జాబితాల్లో తీవ్ర అవకతవకలున్నాయని విమర్శ
- సీసీటీవీ ఫుటేజ్, డేటా ఇవ్వట్లేదన్న రాహుల్
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)పై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈసీ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే సంస్థగా కాకుండా, దాన్ని ఓ క్రమపద్ధతిలో కూల్చివేయడానికి సహకరిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఎన్నికల ప్రక్రియను పూర్తిగా తారుమారు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు.
ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా విశ్వసనీయతపై ఆయన తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. “అసలు ఓటర్ల జాబితా కచ్చితంగా ఉందా? సరైన వ్యక్తులు ఓటు వేయగలుగుతున్నారా? ప్రజల్లో తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి, వాటికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి” అని రాహుల్ అన్నారు. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల మధ్య కేవలం ఐదు నెలల వ్యవధిలో ఏకంగా కోటి మంది కొత్త ఓటర్లు ఎలా పెరిగారని ఆయన ప్రశ్నించారు. “లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మేము ఘన విజయం సాధించాం. కానీ కొన్ని నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయాం. ఈ మధ్యలో కోటి మంది కొత్త ఓటర్లు పుట్టుకొచ్చారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఈసీని కోరినా వారి నుంచి సమాధానం లేదు” అని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా, హర్యానా, మధ్యప్రదేశ్‌లలో ఒపీనియన్ పోల్స్‌కు, తమ అంతర్గత సర్వేలకు, వాస్తవ ఫలితాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని, ఫలితాలను ముందుగానే నిర్దేశించినట్లుగా ఉందని రాహుల్ ఆరోపించారు. మహారాష్ట్రలో పోలింగ్ కేంద్రాల వద్ద పెద్దగా క్యూలు లేనప్పటికీ, సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ శాతం అమాంతం పెరిగిపోవడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు.
విశ్లేషణ కోసం ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీలను ఈసీ ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తోందని, సీసీటీవీ ఫుటేజ్‌ను ధ్వంసం చేస్తోందని రాహుల్ ఆరోపించారు. “ప్రధాని మోదీ కేవలం 25 సీట్ల మెజారిటీతో ఉన్న ప్రధాని. ఆయన అధికారంలో కొనసాగాలంటే 25 సీట్లను దొంగిలిస్తే సరిపోతుంది. అందుకే ఎన్నికల సంఘం నిజాలను కప్పిపుచ్చుతోంది” అని రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ ఆరోపణలు.. ప్రమాణం చేసి ఫిర్యాదు చేయాలన్న ఈసీ

- కర్ణాటకలో ఓట్ల దొంగతనం జరిగిందన్న రాహుల్ గాంధీ
- మహదేవపుర నియోజకవర్గంలో భారీగా అవకతవకలని ఆరోపణ
- ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత ఎన్నికల సంఘం
- ప్రమాణం చేసి ఫిర్యాదు చేయాలంటూ రాహుల్‌కు సవాల్
- రాహుల్ వ్యాఖ్యలను తప్పుబట్టిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
- రాజ్యాంగ సంస్థలను కించపరచడమే కాంగ్రెస్ పనన్న విమర్శ
లోక్‌సభ ఎన్నికల్లో ‘ఓట్ల దొంగతనం’ జరిగిందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీవ్రంగా స్పందించింది. రాహుల్ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, ఆయన తన ఆరోపణలపై నమ్మకం ఉంటే ప్రమాణపూర్వకంగా ఫిర్యాదు చేయాలని గురువారం స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఫ్యాక్ట్ చెక్’ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది.
“మీరు చెప్పేది నిజమే అయితే, ఈ సాయంత్రంలోగా కర్ణాటక ఎన్నికల అధికారికి ప్రమాణ స్వీకార పత్రం సమర్పించాలి. తద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఒకవేళ మీ ఆరోపణలపై మీకే నమ్మకం లేకపోతే, అర్థరహితమైన అభిప్రాయాలకు రావడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలి” అని ఈసీ రాహుల్‌కు హితవు పలికింది.
అంతకుముందు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో భారీ ఎత్తున ఎన్నికల మోసం జరిగిందని రాహుల్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. బెంగళూరు సెంట్రల్‌లో బీజేపీకి 32,707 ఓట్ల ఆధిక్యం రాగా, ఒక్క మహదేవపురలోనే ఆ పార్టీకి 1,14,046 ఓట్ల భారీ ఆధిక్యం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ ఒక్క సెగ్మెంట్‌లోనే దాదాపు 1,00,250 ఓట్లను దొంగిలించారని, బీజేపీతో కుమ్మక్కై ఈసీయే ఈ మోసానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. డూప్లికేట్ ఓటర్లు, ఇతర రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్నవారి పేర్లను ఆయన ఉదహరించారు.
రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రం ఆగ్రహం
రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. రాహుల్, ఆయన బృందం చేస్తున్న వాదనలు నిరాధారమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవని విమర్శించారు. ఎన్నికల సంఘం ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమకు అనుకూలంగా తీర్పులు రానప్పుడు సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలను కించపరచడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ఆయన అన్నారు. ఓటర్ల జాబితా సవరణ అనేది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న ప్రక్రియేనని, ఇందులో కొత్తగా చేస్తోంది ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.