- ఆడియో క్లిప్ వివాదం.. ఎమ్మెల్యేపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం
- అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయం వద్ద నిరసన
- ఎమ్మెల్యే ఫ్లెక్సీలు చించివేసిన అభిమానులు
- బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
- లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు హెచ్చరిక
అనంతపురం నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లం…కొ… అంటూ జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయాన్ని ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఆడియో క్లిప్‌లో ఎమ్మెల్యే ఎన్టీఆర్‌ను దూషించారని ఆరోపిస్తూ, అభిమానులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముందున్న ఫ్లెక్సీలను చించివేశారు. తమ ఓట్లతో గెలిచి, తమ అభిమాన హీరోనే దూషిస్తావా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తమ మధ్యకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, మూసి ఉన్న గదుల్లో చెప్పే క్షమాపణలు తమకు వద్దని అభిమానులు స్పష్టం చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి, అభిమానులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అభిమానులకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ వివాదాస్పద ఆడియో క్లిప్ నకిలీదని, ఇదొక రాజకీయ కుట్ర అని దగ్గుబాటి వర్గం ఆరోపిస్తోంది. తాను నందమూరి కుటుంబ అభిమానినని, ఎవరైనా బాధపడితే క్షమించాలని గతంలోనే దగ్గుబాటి కోరారని వారు గుర్తు చేస్తున్నారు. అయితే, ఈ వివరణను అభిమానులు తోసిపుచ్చారు. రేపు సాయంత్రంలోగా ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై చంద్రబాబు ఫైర్!

- జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వివాదాస్పద వ్యాఖ్యలు
- తెలుగు యువత నేతతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్
- ఎమ్మెల్యే తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
- గ్రూపు రాజకీయాలు, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే సహించేది లేదని స్పష్టీకరణ
- మరో ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరుపై కూడా సీఎం అసంతృప్తి
తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు, అంతర్గత విభేదాలపై ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, వర్గ పోరును ప్రోత్సహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పనితీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
వివరాల్లోకి వెళితే, ‘వార్ 2’ సినిమా విడుదల సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, తెలుగు యువత నాయకుడు గుత్తా ధనుంజయ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో సంభాషణ ఒకటి బయటకు వచ్చింది. లోకేశ్ గురించి మాట్లాడితే ఎవరినీ వదిలిపెట్టేది లేదని, అనంతపురంలో సినిమా ప్రదర్శనకు వీల్లేదంటూ ఎమ్మెల్యే తీవ్రమైన భాషలో హెచ్చరించినట్లు ఆ ఆడియోలో ఉంది. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ అంశం చంద్రబాబు దృష్టికి వెళ్లినట్టు తాజా పరిణామాల ద్వారా అర్థమవుతోంది.
అనంతపురంతో పాటు ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల తీరుపై కూడా ఆయన అసహనంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నేతల వ్యక్తిగత చర్యల వల్ల పార్టీకి నష్టం వాటిల్లితే, ఆ భారాన్ని పార్టీ ఎందుకు మోయాలని ఆయన సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఆడియో నాది కాదు… ఎన్టీఆర్ అభిమానులు బాధపడితే క్షమించాలి: ఎమ్మెల్యే ప్రసాద్

- జూనియర్ ఎన్టీఆర్‌పై దూషణల ఆడియో కలకలం
- టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై మండిపడుతున్న ఎన్టీఆర్ అభిమానులు
- స్పందించిన అనంతపురం ఎమ్మెల్యే
- ఆ ఆడియోలో వాయిస్ తనది కాదని స్పష్టీకరణ
- స్థానిక రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ప్రచారం అని ఆరోపణ
సోషల్ మీడియాలో తన పేరుతో వైరల్ అవుతున్న వివాదాస్పద ఆడియో క్లిప్‌పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందించారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను దూషిస్తున్నట్లుగా ఉన్న ఆ ఆడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు. అది తన గొంతు కాదని, స్థానిక రాజకీయాల్లో తనపై గిట్టనివారే ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
ఈ వివాదంపై దగ్గుపాటి ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. “సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆడియో రికార్డు నాది కాదు. స్థానిక రాజకీయాల్లో భాగంగా కొందరు నాపై కుట్ర పన్నారు. నాకు చిన్నప్పటి నుంచి నారా, నందమూరి కుటుంబాల పట్ల ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయి,” అని ఆయన వివరించారు.
ఈ ఆడియో వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మనోభావాలు దెబ్బతిని ఉంటే, తన తరఫున మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని ఆయన వినమ్రంగా తెలిపారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని ఆయన కోరారు.