ఆంధ్రప్రదేశ్

ప్రభాకర్ రెడ్డి -పెద్దారెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో తాడిపత్రిలో హైటెన్షన్ …

  • హైకోర్టు అనుమతితో తాడిపత్రిలో అడుగుపెట్టనున్న కేతిరెడ్డి
  • దమ్ముంటే రా తేల్చుకుందామంటూ కేతిరెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఛాలెంజ్
  • భారీ పోలీసు భద్రత నడుమ తాడిపత్రికి రానున్న పెద్దారెడ్డి
  • అదే సమయంలో శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం తలపెట్టిన జేసీ వర్గం
  • తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత.. భారీగా పోలీసు బలగాల మోహరింపు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వేడి మరోసారి తారస్థాయికి చేరింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పట్టణంలోకి అడుగుపెట్టనివ్వబోమని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చిచెప్పారు. “కేతిరెడ్డీ.. దమ్ముంటే తాడిపత్రికి రా.. తేల్చుకుందాం” అంటూ బహిరంగ సవాల్ విసిరారు. హైకోర్టు ఆదేశాలతో ఈరోజు పెద్దారెడ్డి తాడిపత్రికి రానున్న నేపథ్యంలో, ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం ముదరడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

హైకోర్టు ఆదేశాల ప్రకారం, ఈరోజు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకురావాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. గతంలో తనను పట్టణంలోకి రాకుండా అడ్డుకున్నారంటూ పెద్దారెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే, కోర్టు ఆదేశాలు ఎన్ని ఉన్నా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చే ప్రసక్తే లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. “ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేతిరెడ్డి, ఆయన అనుచరులు చేసిన దౌర్జన్యాలకు, అక్రమాలకు ప్రజలకు సమాధానం చెప్పాలి. చట్టాలు, న్యాయాలు మీకు ఒకలా, మాకు ఒకలా వర్తిస్తాయా?” అని ఆయన ప్రశ్నించారు. తనకు వ్యక్తిగతంగా పెద్దారెడ్డిపై కక్ష లేదని, కానీ ఆయన చేసిన పనులను మాత్రం ప్రజలు మర్చిపోలేదని అన్నారు. ముందు తాడిపత్రికి రావడం కాదు, అక్రమంగా నిర్మించిన తన ఇంటి సంగతి చూసుకోవాలని పెద్దారెడ్డికి హితవు పలికారు.

మరోవైపు, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం కూడా తాడిపత్రిలో శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునివ్వడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. 

తాడిపత్రికి వెళ్లకుండా పెద్దారెడ్డిని మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు!

Kethireddy Pedda Reddy Stopped by Police Despite High Court Orders
  • హైకోర్టు ఆదేశాలున్నా పెద్దారెడ్డిని అనుమతించని పోలీసులు
  • హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన పోలీసులు!
  • తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పట్టణంలోకి అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఈ ఆధిపత్య పోరు ఈరోజు నాటకీయ పరిణామాలకు వేదికైంది.

ఈరోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పోలీసు బందోబస్తుతో కేతిరెడ్డిని తాడిపత్రికి చేర్చాలని హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తిమ్మంపల్లి నుంచి పట్టణంలోకి వస్తున్న ఆయనను పోలీసులు మార్గమధ్యంలోనే నిలిపివేశారు. కేతిరెడ్డి కోర్టు ఉత్తర్వులను చూపించినా, ఉన్నతాధికారుల నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు రాలేదని చెప్పి పోలీసులు అనుమతించలేదు.

మరోవైపు, కేతిరెడ్డి ప్రవేశాన్ని అడ్డుకునే వ్యూహంలో భాగంగా మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టణంలో శివుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టినట్టు భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా అనుచరులు, కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో ఇరువర్గాలు ఎదురుపడితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే ముందుజాగ్రత్త చర్యగా పట్టణంలో భారీగా పోలీసులను మోహరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద కూడా బలగాలను ఏర్పాటు చేశారు.

మరోవైపు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తాడిపత్రి పోలీసులు సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ పిటిషన్ కారణంగానే కేతిరెడ్డిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. మొత్తంమీద, కోర్టు ఆదేశాలు, రాజకీయ వ్యూహాల నడుమ తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. 

ఈ ఘటనపై డీఎస్పీ వెంకటేశులు స్పందించారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరుగుతోందని, దానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తున్నారని తెలిపారు. అదే సమయంలో కేతిరెడ్డి పట్టణంలోకి వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని, అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఆపాల్సి వచ్చిందని వివరించారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళతామని ఆయన స్పష్టం చేశారు.

పోలీసుల చర్యపై ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు ప్రభుత్వానికి కాకుండా, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. “పోలీసులకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వమా లేక జేసీనా?” అని ఆయన ప్రశ్నించారు. గతంలో తాను ఎలాంటి ఫ్యాక్షనిజం చేయలేదని, అయినా తనను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. పోలీసుల తీరుపై మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తానని కేతిరెడ్డి తెలిపారు. 

తాడిపత్రిలో హైటెన్షన్.. రోడ్డుపైనే కుర్చీ వేసుకుని కేతిరెడ్డి నిరీక్షణ

Ketireddy Pedda Reddy Standoff in Tadipatri Over Road Blockage
  • తాడిపత్రిలో మళ్లీ భగ్గుమన్న రాజకీయ వైరం
  • తాడిపత్రిలోకి వెళ్లేందుకు యత్నించిన కేతిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు
  • ఆరు గంటలుగా నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని నిరసన
  • శాంతిభద్రతల సమస్యల దృష్ట్యా అనుమతి నిరాకరణ
  • కోర్టు ఆర్డర్ ఉన్నా ప్రజలు అడ్డుకుంటారన్న జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య సవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలోకి ప్రవేశించాలన్న పట్టుదలతో ఉన్న కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో, ఆయన ఏకంగా ఆరు గంటలుగా నడిరోడ్డుపైనే కుర్చీ వేసుకుని నిరీక్షిస్తుండటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

సోమవారం ఉదయం, పోలీసుల సూచనలను పక్కనపెట్టి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎర్రగుంటపల్లి ఫ్లైఓవర్ వద్ద శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదే సమయంలో, హైకోర్టు అనుమతితో తాడిపత్రికి వస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు నాగిరెడ్డిపల్లె వద్ద నిలిపివేశారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ ఆయనకు అనుమతి నిరాకరించారు. దీంతోపాటు టీడీపీ కార్యకర్తలు కూడా ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

పోలీసుల చర్యతో ఆగ్రహానికి గురైన పెద్దారెడ్డి, అక్కడే రోడ్డుపై కుర్చీ వేసుకుని బైఠాయించారు. తాడిపత్రిలోకి తనను అనుమతించే వరకు కదిలేది లేదని తేల్చిచెప్పారు. ఆరు గంటలకు పైగా అక్కడే ఉండిపోయిన ఆయన, భోజనం కూడా అక్కడే చేశారు. ఆయనకు మద్దతుగా వచ్చిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఈ పరిణామాలపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. కేతిరెడ్డికి కోర్టు ఆర్డర్ ఉన్నా, ఆయన బాధితులు మాత్రం ఊరిలోకి రానివ్వరని అన్నారు. గతంలో పొట్టి రవి విషయంలోనూ కోర్టు ఆదేశాలున్నా పెద్దారెడ్డే పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుకున్నారని జేసీ ఆరోపించారు. తాము కోర్టును గౌరవిస్తామని, కానీ ప్రజలు మాత్రం పెద్దారెడ్డిని అడ్డుకోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

ముందుజాగ్రత్త చర్యగా తాడిపత్రి సరిహద్దుల్లో 750 మందికి పైగా పోలీసులను మోహరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి రోడ్డుపైనే నిరీక్షిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Related posts

మేడారం గిరిజన జాతరకు చురుగ్గా ఏర్పాట్లు…

Drukpadam

టీకా నా కుమార్తె ఉసురు తీసింది.. రూ. 1000 కోట్లు చెల్లించాలి: బాంబే హైకోర్టును ఆశ్రయించిన తండ్రి!

Drukpadam

కెనడాలో ప్రాణాంతక ‘జాంబీ’ వ్యాధి.. వ్యాక్సిన్లు, చికత్సల్లేవ్!

Drukpadam