- లైఫ్ సైన్సెస్ రంగంలో భారీ పెట్టుబడులు సాధించామన్న శ్రీధర్‌బాబు
- ప్రపంచ టాప్ 7 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్ ఒకటన్న మంత్రి
- త్వరలో నెక్స్ట్‌జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించనున్న ప్రభుత్వం
తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గత 20 నెలల వ్యవధిలోనే ఈ రంగంలో రాష్ట్రానికి ఏకంగా రూ.54 వేల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని, దీని ద్వారా 2 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు సృష్టించగలిగామని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ బోర్డు సమావేశానికి ఛైర్మన్ హోదాలో అధ్యక్షత వహించిన అనంతరం ఆయన ఈ వివరాలను పంచుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాల వల్లే ఈ అద్భుత ప్రగతి సాధ్యమైందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ పెట్టుబడుల ప్రవాహంతో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ‘గ్లోబల్ లీడర్’గా అవతరించిందని ఆయన అన్నారు.
ప్రపంచంలోని అతిపెద్ద ఏడు లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా హైదరాబాద్ నిలవడం గర్వకారణమని మంత్రి తెలిపారు. దేశంలో ఈ ఘనతను అందుకున్న ఏకైక నగరం హైదరాబాద్ కావడం విశేషమని పేర్కొన్నారు ముఖ్యంగా ఔషధాల తయారీ, టీకాల ఉత్పత్తి, మెడికల్ టెక్నాలజీ వంటి కీలక విభాగాల్లో ఈ అభివృద్ధి నమోదైనట్లు వివరించారు.
లిల్లీ, యామ్‌జెన్, ఎంఎస్‌డీ, జోయెటిస్, ఎవర్ నార్త్, ఒలింపస్ వంటి అనేక దిగ్గజ అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడమే రాష్ట్రంలో ఉన్న సానుకూల వాతావరణానికి నిదర్శనమని ఆయన చెప్పారు. ఈ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, త్వరలోనే ‘తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్’ విధానాన్ని ప్రకటించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా తెలిపారు.