“ట్విట్టర్ టిల్లు …! ముందు నీ ఇంటిని… పార్టీని చక్కబెట్టుకో!!”
- కేటీఆర్ పై మంత్రి పొంగులేటి ఫైర్
- “మూడున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో నువ్వు అమెరికాలో ఉంటావో… ఇండియాలో ఉంటావో తెలీదు” అంటూ సెటైర్లు
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సత్తా చూపాలని బీఆర్ఎస్‌కు సవాల్
- పదేళ్లలో పేదలకు ఇళ్లు కట్టడంలో బీఆర్ఎస్ విఫలమైందని ఆరోపణ
- కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల కమీషన్లకే పరిమితమయ్యారని విమర్శ
ఏదులాపురం మున్సిపాలిటీ : “నీకు విజన్ ఉందా? నీ నాన్నకు ఉందా తెలుసుకో కేటీఆర్ … ముందు నీ ఇంటిని, నీ పార్టీని చక్కబెట్టుకో… మూడున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో నువ్వు అమెరికాలో ఉంటావా… ఇండియాలో ఉంటావా అన్నది కూడా రాష్ట్ర ప్రజలకు సందేహమే. దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మీ పార్టీ సత్తా చూపించండి” అంటూ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరారు. గురువారం వరంగల్ క్రాస్ రోడ్‌లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 80కుటుంబాలకు చెందిన వారు కాంగ్రెస్‌లో చేరగా వారికి మంత్రి స్వయంగా కండువా కప్పి ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాటు ప్రజల కలలను ఛిద్రము చేసిందని మండిపడ్డారు. వారి హయంలో “ఒకే ఒక లక్ష ఇళ్లు ప్రతి సంవత్సరం కట్టివుంటే, పది లక్షల పేద కుటుంబాలకు గృహాలు అందేవి. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల కమీషన్లలో మునిగిపోయింది. పాము కొర్రల్లో విషం పెట్టుకున్నట్టే, వీరంతా ఒళ్ళంతా విషం నింపుకుని తిరుగుతున్నారని” ఘాటుగా విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్‌ఎస్‌కు గట్టి బుద్ధి చెప్తారని, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్‌ను తిరస్కరించారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తగిన బుద్ధి చెబుతారని పొంగులేటి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు వేగంగా అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీపీసీసీ నాయకులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, టీపీసీసీ నాయకులు ధరావత్ రామ్మూర్తి నాయక్, బొర్రా రాజశేఖర్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, కళ్ళెం వెంకట్ రెడ్డి, మద్ది మల్లారెడ్డి, బండి జగదీష్, ప్రతాపనేని రఘు, భూక్యా సురేష్ నాయక్, వెంపటి రవి, భుజంగ రెడ్డి, వీరా రెడ్డి, భాస్కర్ నాయక్, ప్రద్యుమ్న చారి, సంగయ్య, వెంకటనారాయణ, తోట వీరభద్రం, కర్లపూడి భద్రకాళి, బానోత్ దివ్య, బానోత్ హరి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. “ప్రతి సంవత్సరం లక్ష ఇళ్లు కట్టినా, పదేళ్లలో పది లక్షల పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరేది. కానీ గత ప్రభుత్వం కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల కమీషన్లపైనే దృష్టి పెట్టింది తప్ప పేదల గృహ నిర్మాణాన్ని పట్టించుకోలేదు” అని ఆయన ఆరోపించారు. పాము కోరల్లో విషం ఉన్నట్టు, బీఆర్ఎస్ నేతలు ఒళ్లంతా విషం నింపుకుని తిరుగుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.