తెలంగాణ వార్తలు

శాస్త్రీయ సామ్యవాదానికి తిరుగులేదు…సీపీఐ (ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ

శాస్త్రీయ సామ్యవాదానికి తిరుగులేదు

  • అణచివేతకు వ్యతిరేక పోరాటానికి మతం రంగు
  • ముస్లిం వ్యతిరేక పోరాటంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ చిత్రీకరణ
  • సాయుధ పోరాట స్ఫూర్తితోనే భూసంస్కరణల అమలు
  • ఏచూరి స్ఫూర్తితో శాస్త్రీయ సామ్యవాదం కోసం పురోగమిద్దాం..
  • తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సభలో సీపీఐ (ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ


శాస్త్రీయ సామ్యవాదానికి తిరుగు లేదని సీపీఐ (ఎం) అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. మోడీ, షా, ఆర్ఎస్ఎస్ త్రిశూలంలా వ్యవహరిస్తూ మెజార్టీ ప్రజానీకాన్ని మత ప్రాతిపదికన విభజించాలని చూస్తున్నాయని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని సైతం వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో బుధవారం రాత్రి నిర్వహించిన ‘ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సభ’లో బేబీ ముఖ్య వక్తగా హాజరయ్యారు. సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సభకు ముందుగా సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరులకు జోహార్లు తెలుపుతూ ఎంఏ బేబీ ప్రసంగించారు. దున్నే వానికి భూమి, భూసంస్కరణల అమలు సాయుధ పోరాట ఫలితం అని తెలిపారు. భూమిని తీవ్ర సమస్యగా చూపింది ఈ పోరాటమేనని చెప్పారు. సాయుధ పోరాట ఫలితంగానే కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో తొలుత భూ సంస్కరణలు అమలు అయ్యాయని, ఆ తర్వాతే దేశవ్యాప్తంగా విస్తరించారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ ఎక్కడ స్వాతంత్ర్యం కోసం, నైజాం ప్రభువుకు వ్యతిరేకంగా పోరాడ లేదన్నారు. మోడీ, షాకు మాత్రమే రక్షణ మంత్రిగా వ్యవహరిస్తున్న రాజ్ నాథ్ సింగ్ వీర తెలంగాణ పోరాటానికి మతం రంగు పులుముతున్నారని ఆరోపించారు. ఎర్రజెండా ఉద్యమ కారణంగా… శ్రమజీవుల పోరాట ఫలితంగా తెలంగాణలోని నాటి ఫ్యూడల్ ప్రభుత్వం కూలిందన్నారు. ఎంతో మహత్తర చరిత్ర ఉన్న సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రీకరించటం ఎవరి తరం కాదన్నారు. నెహ్రూ ఏ మతాచారం ప్రకారం తనని ఖననం చేయొద్దని, నారాయణ గురు కులం, మతం లేదని అంటే మహాత్మా గాంధీ వర్క్ ఈజ్ వర్షిప్ ( పని దైవంతో సమానం) అన్న విషయాన్ని గుర్తు చేశారు. అన్ని మతాల ప్రజలు సహజీవనం చేస్తున్న దేశంలో ఆర్ఎస్ఎస్ విద్వేషాలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలని చూస్తుందన్నారు. గోల్వాల్కర్ ‘బంచ్ ఆఫ్ థాట్స్’ పుస్తకంలో ముస్లిం, క్రిస్టియన్, కమ్యూనిస్టులను శత్రువులుగా పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో.. పార్టీ 24వ జాతీయ మహాసభల్లో తీసుకున్న నిర్ణయం మేరకు విశాల ప్రాతిపదికన ఎర్రజెండా ఉనికిని విస్తరింప చేయాలని పిలుపునిచ్చారు.

శ్రామిక వర్గ నేతగా ఏచూరిని గుర్తుపెట్టుకోవాలి..

అద్భుతమైన అసాధారణ శ్రామిక వర్గ నేతగా సీతారాం ఏచూరి ని గుర్తుంచుకోవాలని ఎంఏ బేబీ అన్నారు. ఏచూరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 14వ పార్టీ జాతీయ కాంగ్రెస్ లో బసవ పున్నయ్య ఇచ్చిన భరోసాతో సీతారాం ఏచూరి శాస్త్రీయ సామ్యవాదానికి తిరుగు లేదనే రీతిలో డ్రాప్ నెగ్గేలా చూశారన్నారు. మార్క్స్ , ఎంగిల్స్ ‘ప్యారిస్ కమ్యూన్’ విఫలం కావచ్చు కానీ ‘ కమ్యూన్ ఆఫ్ ఇండియా’ విఫలం కాదని అణచివేతకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటం నిరూపించిందని పేర్కొన్నారు. ప్రముఖ విద్యావేత్త ఐ వీ రమణారావు బేబీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించారు. అంతకుముందు సీతారాం ఏచూరి పై నవతెలంగాణ, ప్రజాశక్తి ప్రచురించిన ‘ ఓ సోషలిస్ట్ ఆచరణ పథం’ పుస్తకాన్ని బేబీ ఆవిష్కరించారు. పార్టీ రాజకీయ విద్యా విభాగం సభ్యులు ‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం’ జ్ఞాపికను బేబీకి అందజేశారు.

  • సాయుధ పోరాట వక్రీకరణ సాధ్యం కాదు: తమ్మినేని*

బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎంత ప్రయత్నించినా తెలంగాణ సాయుధ పోరాట వక్రీకరణ సాధ్యం కాదని సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. సెప్టెంబర్ 17వ తేదీని ఆయా పార్టీలు విద్రోహ దినం, విలీన దినం, విమోచన దినంగా పేర్కొంటున్నాయి అన్నారు. ఎవరెలా చెప్పినా సాయుధ పోరాటం ఎర్ర జెండా పోరాటం తప్ప మరి ఏదీ కాదన్నారు. నెహ్రూ సైన్యం కమ్యూనిస్టులను బలిగొనేందుకు వచ్చింది తప్ప నిజామును లొంగ తీసుకునేందుకు కాదన్నారు. ఒకవేళ లొంగ తీసుకునేందుకు వస్తే రాజ్ ప్రముఖ్ హోదా ఇచ్చేది కాదన్నారు. రూ. లక్షల విలువైన భరణాలు ప్రసాదించేది కాదని తెలిపారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా 3,000 గ్రామాలకు విముక్తి లభించిందని తెలిపారు. నెహ్రూ సైన్యాలు 4000 మంది కమ్యూనిస్టులను పొట్టన పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న తీరును ‘ఏనుగు – గుడ్డివాళ్ల’ కథ ద్వారా వివరించారు. తెలంగాణలో ఎర్రజెండా ఎగురుతుంది అనే ఉద్దేశంతోనే నెహ్రూ సైన్యాలను పంపించినట్లు తెలిపారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, బుగ్గ వీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్, వై. విక్తమ్, సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, ఎం. సుబ్బారావు, చింతలచెరువు కోటేశ్వరరావు, పి. సోమయ్య, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పార్డీ నాయకులు మాదినేని రమేష్, బండి పద్మ, అన్నవరపు సత్యనారాయణ, లిక్కి బాలరాజు, మడుపల్లి గోపాలరావు, శీలం సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు సదానందం నేతృత్వంలో ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన ‘సాయుధ రైతాంగ పోరాట గీతాలు’ ఆకట్టుకున్నాయి.

Related posts

నెలల పసికందుపై కుక్కల దాడి.. హైదరాబాద్ లో దారుణం

Ram Narayana

ప్రధానితో భేటీకి సీఎం రేవంత్ ,డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు చెల్లిస్తున్నారా? ఆ వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త!

Ram Narayana