- విజయ్ కావాలనే బలప్రదర్శన చేయడంతో దుర్ఘటన చోటు చేసుకుందని వెల్లడి
- మధ్యాహ్నం రావాల్సిన విజయ్ సాయంత్రం వచ్చారని పేర్కొన్న పోలీసులు
- ప్రచార సభకు వచ్చిన వారికి మంచినీళ్లు, ఆహారం లేకున్నా పట్టించుకోలేదని విమర్శ
టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ ఉద్దేశపూర్వకంగా ప్రచార సభకు ఆలస్యంగా రావటం వల్లనే దుర్ఘటన జరిగిందని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. తమిళనాడులోని కరూర్‌లో విజయ్ ప్రచార సభలో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. విజయ్ కావాలనే రాజకీయ బలప్రదర్శన చేయడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
“విజయ్ ర్యాలీ శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. ఉదయం 11 గంటలకే జనం భారీ ఎత్తున తరలి వచ్చారు. మధ్యాహ్నం ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడాల్సి ఉండగా, ఆయన సాయంత్రం ఏడు గంటలకు వచ్చారు. భారీ జనసందోహాన్ని చూపించడానికే ఆయన ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు. మధ్యాహ్నం నుండి ఎండలో నిలుచున్న ప్రజలు అలసిపోయారు. విజయ్ బస్సు షెడ్యూల్‌కు భిన్నంగా పలుచోట్ల ఆగింది. వాటికి అనుమతి కూడా లేదు. అలా ఆగడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది” అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
ప్రచార సభకు వచ్చిన వారికి మంచినీళ్లు, ఆహారం లేవంటూ చేసిన హెచ్చరికలను విజయ్ కానీ, పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ కానీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. సాయంత్రం ఏడు గంటలకు విజయ్ వచ్చేసరికి జనసమూహాన్ని నిర్వహించడం కష్టంగా మారిందని, అదే తొక్కిసలాటకు దారి తీసిందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
- నటుడు విజయ్ టీవీకే పార్టీ కరూర్ సభలో తొక్కిసలాట
- మరో మహిళ మృతితో 41కి చేరిన మృతుల సంఖ్య
- మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున ప్రకటించిన విజయ్
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పరిహారం ప్రకటన
- ఘటనపై న్యాయ విచారణకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదేశం

నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ నిర్వహించిన ప్రచార సభలో పెను విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన ఈ సభలో తొక్కిసలాట జరిగి మృతుల సంఖ్య 41కి చేరింది. మరో 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
వివరాల్లోకి వెళితే… శనివారం సాయంత్రం వేలాయుధంపాలెంలో ఏర్పాటు చేసిన సభకు విజయ్‌ను చూసేందుకు వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు పోటెత్తారు. అంచనాలకు మించి జనం రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. విజయ్‌ను దగ్గర నుంచి చూసేందుకు ప్రజలు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడం, అదే సమయంలో కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
బయటకు వెళ్లే దారులు ఇరుకుగా ఉండటంతో తొక్కిసలాట జరిగి, ఊపిరాడక చాలామంది కిందపడిపోయారు. చాలామంది వారిని తొక్కుకుంటూ వెళ్లడంతో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వేలుసామిపురానికి చెందిన సుగుణ (65) అనే మహిళ మరణించడంతో మృతుల సంఖ్య 41కి పెరిగింది.
ఇక, ఘటన జరిగిన వెంటనే కరూర్ చేరుకున్న సీఎం ఎం.కె. స్టాలిన్, మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. భద్రతా లోపాలపై విచారణ జరిపేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అరుణా జగదీశన్‌తో న్యాయ విచారణకు ఆదేశించారు.
ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని నటుడు విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది “పూడ్చలేని లోటు” అని, తన హృదయం తీవ్రమైన భారంతో నిండిపోయిందని అన్నారు. మృతుల కుటుంబాలకు తనవంతుగా రూ. 20 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానని, బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.
మరోవైపు, ప్రజల రాకను అంచనా వేయడంలో పోలీసు, నిఘా వర్గాలు విఫలమయ్యాయని, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రతిపక్ష నేత పళనిస్వామి ఆరోపించారు. అధికారులు కేసు నమోదు చేసుకుని, సభల నిర్వహణలో భద్రతా ప్రమాణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
తొక్కిసలాట ఘటనను 2 వారాల ముందే ఊహించి చెప్పిన వ్యక్తి.. వీడియో ఇదిగో!

- అసెంబ్లీ ఎన్నికల నాటికి ఒక్క తొక్కిసలాట అయినా జరిగితీరుతుందని వ్యాఖ్య
- కనీసం 50 మంది వరకు మరణిస్తారని, విజయ్ అనే వ్యక్తే కారణమవుతాడని వెల్లడి
- డీఎంకే కంటే 10 రెట్లు విషపూరిత వ్యక్తులంటూ తీవ్ర విమర్శలు
తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 41 కి చేరింది. టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో జనం హాజరుకావడంతో ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు ప్రభుత్వం సింగిల్ జడ్జి విచారణకు ఆదేశించింది.
అయితే, ఈ దుర్ఘటన గురించి ఓ వ్యక్తి రెండు వారాల క్రితమే ఆశ్చర్యకరంగా ట్వీట్ చేశాడు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కనీసం ఒక్క తొక్కిసలాట ఘటన అయినా చోటుచేసుకుంటుందని, అందులో కనీసం 50 మంది యువత ప్రాణాలు కోల్పోతారని ట్వీట్ చేశాడు. ఈ ఘటనకు విజయ్ అనే దుర్మార్గుడే కారణమవుతాడని చెప్పాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించి మరో వ్యక్తి ఇదే తరహా ఆరోపణలు చేసిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ట్వీట్ లో ఏమని చెప్పాడంటే..
‘తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల సమయానికి కనీసం ఒక్క తొక్కిసలాటైనా జరిగి తీరుతుంది. అందులో కనీసం 50 మంది యువత ప్రాణాలు కోల్పోతారు. వీటన్నింటికీ విజయ్ అనే వ్యక్తి కారణమవుతాడు. వారు బుద్ధిలేని, క్రూరమైన ఆటవికుల వంటివారు. డీఎంకే కంటే 10 రెట్లు విషపూరితమైన వ్యక్తులు. రాజకీయాల్లో ప్రతిపక్షం, కూటమి భాగస్వాములు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం రాష్ట్ర రాజకీయాల్లోని మూర్ఖత్వాన్ని సూచిస్తుంది” అని పేర్కొన్నారు.
తమిళనాడులో హీరో విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటనపై రాజకీయ దుమారం
- కుట్రకోణం ఉందని టీవీకే పార్టీ ఆరోపణ
- విద్యుత్తు సరఫరాను నిలిపివేశారని విమర్శలు
- విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని పార్టీనే కోరిందని ప్రభుత్వం వివరణ
తమిళనాడులోని కరూర్ జిల్లాలో రెండు రోజుల క్రితం టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం, టీవీకే పార్టీల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి.
ఈ తొక్కిసలాట ఘటన వెనుక కుట్ర ఉందని, విజయ్ ర్యాలీకి వచ్చిన తర్వాత కొంతసేపు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని టీవీకే పార్టీ ఆరోపించింది. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో విజయ్‌ను చూసేందుకు అభిమానులు ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగిందని ఆ పార్టీ పేర్కొంది.
ఈ ఆరోపణలపై తమిళనాడు విద్యుత్ బోర్డు స్పందించింది. విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని టీవీకే పార్టీయే తమకు వినతిపత్రం ఇచ్చిందని రాష్ట్ర విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి తెలిపారు. అయితే, తాము అందుకు అంగీకరించలేదని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 27 రాత్రి వేలుసామిపురం వద్ద భారీ జనసమూహం ఉంటుందని అంచనా వస్తూ టీవీకే నుంచి లేఖ అందిందని విద్యుత్తు బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి వెల్లడించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని విజయ్ మాట్లాడుతున్న సమయంలో కొంతసేపు విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని కోరినట్లు చెప్పారు. టీవీకే పార్టీ అభ్యర్థనను తాము తిరస్కరించామని ఆమె స్పష్టం చేశారు.
ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. తొక్కిసలాట జరిగిన వేదిక వద్ద కరెంట్ కోత లేదని ప్రభుత్వం తెలిపింది. ఆ పార్టీ ఏర్పాటు చేసిన జనరేటర్లలో సమస్య కారణంగా కొన్ని లైట్లు మసకబారాయని జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారని పేర్కొంది.
కరూర్ లో పర్యటించనున్న ఎన్డీయే ప్రతినిధి బృందం… కమిటీలో టీడీపీ ఎంపీకి చోటు

- విజయ్ సభ తొక్కిసలాట ఘటనపై ఎన్డీయే దృష్టి
- నిజ నిర్ధారణ కోసం 8 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు
- ఎంపీ హేమమాలిని నేతృత్వంలో కరూర్ పర్యటన
- కమిటీలో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ కు స్థానం
- బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కమిటీ ప్రకటన
- విచారణ బృందంలో శివసేన, బీజేపీ ఎంపీలు కూడా
తమిళనాడులోని కరూర్ లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ర్యాలీలో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై ఎన్డీయే దృష్టి సారించింది. ఈ దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులు, వాస్తవాలను వెలికితీసేందుకు 8 మంది ఎంపీలతో కూడిన ఉన్నతస్థాయి నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని నాయకత్వం వహించనున్నారు.
ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం ఈ కమిటీని ప్రకటించారు. ఈ బృందంలో మిత్రపక్షాలైన టీడీపీ, శివసేన పార్టీల ఎంపీలకు కూడా స్థానం కల్పించారు. టీడీపీ తరఫున ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్, శివసేన నుంచి శ్రీకాంత్ షిండే సభ్యులుగా వ్యవహరించనున్నారు. వీరితో పాటు కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్, తేజస్వి సూర్య, బ్రిజ్ లాల్, అపరాజిత సారంగి, రేఖా శర్మ వంటి బీజేపీకి చెందిన సీనియర్ ఎంపీలు కూడా ఈ కమిటీలో ఉన్నారు.
ఇటీవల కరూర్ లో జరిగిన విజయ్ సభకు భారీగా జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగి, సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో, ఎన్డీయే ఏర్పాటు చేసిన ఈ బృందం త్వరలోనే కరూర్ లో పర్యటించనుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులు, స్థానిక అధికారులతో మాట్లాడి సమగ్ర వివరాలు సేకరించి, కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందజేయనుంది.