తెలంగాణ రాజకీయ వార్తలు ..

సీఎం రేవంత్ రెడ్డి పైన ఆయన సోదరులపై కొండా సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు ..

రాష్ట్ర మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద నిన్న రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. సురేఖ మాజీ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) సుమంత్‌ను అరెస్టు చేసేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది.

జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసంలో సుమంత్ ఉన్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మఫ్టీలో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో మంత్రి కుమార్తె కొండా సుస్మిత పోలీసుల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. “మేం కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉన్నామా? వేరే ప్రభుత్వంలో ఉన్నామా? ప్రభుత్వంలో ఉన్న వారిపైనే ఇలా వ్యవహరిస్తారా?” అని ఆమె పోలీసులను నిలదీశారు. అరెస్ట్ వారెంట్ చూపించాలని పోలీసులను అడిగారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన సుస్మిత, సొంత ప్రభుత్వంలోని నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. బీసీ వర్గానికి చెందిన మంత్రి కావడంతోనే తన తల్లిని అణగదొక్కేందుకు పార్టీలోని కొందరు ‘రెడ్లు’ కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి ఈ కుట్ర వెనుక ఉన్నారని ఆమె ఆరోపణలు గుప్పించారు. రేవంత్ రెడ్డి సోదరులకు గన్ మెన్లు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు .. తన తండ్రి కొండా మురళికి ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

హుజూర్‌నగర్‌లోని డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులను సుమంత్ రివాల్వర్‌తో బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో సుమంత్‌ను మంగళవారమే ఓఎస్డీ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. అయితే, సీఎం సూచన మేరకే డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి సుమంత్ ఆ కంపెనీకి వెళ్లారని, మరి రోహిన్ రెడ్డిని ఈ కేసులో ఎందుకు విస్మరించారని సుస్మిత ప్రశ్నించారు. ఒక మంత్రి ఇంట్లోకి పోలీసులు రాత్రిపూట రావడం, ఆమె కుమార్తె సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేయడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ అయింది.

మీడియా ముందుకు వెళ్లకండి.. కూర్చుని మాట్లాడుకుందాం: కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్!

Meenakshi Natarajan calls Konda Surekha for discussion
  • ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని మంత్రికి మీనాక్షి నటరాజన్ సూచన
  • సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్ బెదిరించినట్లు ఆరోపణలు
  • దీంతో ఓఎస్డీగా సుమంత్‌ను తప్పించిన ప్రభుత్వం

“మీడియా ముందుకు వెళ్లవద్దు. కూర్చుని మాట్లాడుకుందాం” అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి సూచించినట్లు సమాచారం. ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని మంత్రికి నటరాజన్ సూచించారు.

ఏం జరిగింది?

కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను ఆయన బెదిరించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లారు. మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నారనే సమాచారంతో మఫ్టీలో ఉన్న పోలీసులు అక్కడకి చేరుకున్నారు. 

అయితే, కొండా సురేఖ కుమార్తె సుష్మిత పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా సుష్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై బురదజల్లేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇవన్నీ చేయిస్తున్నారని ఆరోపించారు. తన తల్లిదండ్రులనే లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖతో నటరాజన్ మాట్లాడినట్లు సమాచారం.

సీఎం రేవంత్ తో విభేదాలు లేవు… ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తామన్నారు: కొండా మురళి

Konda Murali Says No Differences With CM Revanth Reddy
  • మంత్రి సురేఖ ఓఎస్డీ అరెస్టుకు పోలీసుల యత్నంపై స్పందన
  • వైఎస్ఆర్ తర్వాత అంతటి నేత రేవంత్ రెడ్డేనని వ్యాఖ్య
  • తన కుమార్తె వ్యాఖ్యల గురించి తనకు తెలియదన్న మురళి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తమ కుటుంబానికి ఎలాంటి విభేదాలు లేవని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్పష్టం చేశారు. తమ నివాసంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ఈరోజు వరంగల్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ వివాదాలను ఎవరో సృష్టిస్తున్నారని, దానికి తాను బాధ్యుడిని కాదని ఆయన అన్నారు.

వివరాల్లోకి వెళ్తే, మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న రాత్రి ఆమె నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ హైడ్రామా నడిచింది. ఈ ఘటనపై మంత్రి కుమార్తె సుస్మిత కూడా స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా మురళి వివరణ ఇచ్చారు. “వరంగల్‌లో పార్టీ మీటింగ్ ఉండడంతో ఇక్కడికి వచ్చాను. ఇంట్లో ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. సురేఖ కూడా సమావేశానికి వస్తున్నారు” అని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తనకు పూర్తి విశ్వాసం ఉందని మురళి పేర్కొన్నారు. “దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత తెలంగాణకు అంతటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని మేము భావించాం. ఆయనే సీఎం కావాలని కోరుకున్నాం. నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు” అని మురళి గుర్తుచేశారు.

తాను ఇప్పటివరకు సెక్రటేరియట్‌కు ఒక్కసారి కూడా వెళ్లలేదని, భవిష్యత్తులో కూడా వెళ్లనని కొండా మురళి స్పష్టం చేశారు. కేవలం కొండా సురేఖ ఛాంబర్ వాస్తు చూడటానికి మాత్రమే ఒకసారి వెళ్లానని చెప్పారు. “నాకు ఏమైనా అవసరం ఉంటే సీఎం రేవంత్ రెడ్డి లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇళ్లకే వెళ్తాను. వైఎస్ఆర్ ఉన్నప్పుడు మాత్రం ఆయన వెంట వెళ్లేవాడిని” అని అన్నారు. తన కుమార్తె సుస్మిత వ్యాఖ్యల గురించి అడగ్గా, “నా బిడ్డ లండన్‌లో పెరిగింది. ఆమెకు ఏ పదవి లేదు, మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఆమె ఏం మాట్లాడిందో నాకు తెలియదు. నాకు ఫోన్ కూడా చూడటం రాదు” అని తెలిపారు.

Related posts

ఎవరు పీసీసీ …? ఎవరు మంత్రులు హస్తినలో కుస్తీ ..అధిష్టానంతో రేవంత్ బృందం భేటీ …!

Ram Narayana

అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవు: సర్పంచ్‌లతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

Ram Narayana

పొంగులేటి వర్సెస్ కొండా దంపతుల మధ్య …మేడారం టెండర్ల వార్

Ram Narayana