తెలంగాణ వార్తలు

మా అబ్బాయి మృతి ఒక మిస్టరీ.. కేటీఆరే సమాధానం చెప్పాలి: మాగంటి గోపీనాథ్ తల్లి సంచలన ఆరోపణలు

  • దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వారసత్వ వివాదంపై విచారణ
  • లీగల్ హెయిర్ సర్టిఫికెట్‌పై మొదటి భార్య, కుమారుడి అభ్యంతరం
  • తహసీల్దార్ ఎదుట హాజరైన ఇరు కుటుంబాల సభ్యులు
  • గోపీనాథ్ మృతిపై ఆయన తల్లి మహానందకుమారి సంచలన ఆరోపణలు
  • రావొద్దంటూ తనను బెదిరించారని కుమారుడు తారక్‌ ఆరోపణ
  • ఇది రాజకీయ కుట్రేనంటున్న రెండో భార్య సునీత వర్గం
  • తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసిన అధికారులు

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబంలో వారసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు అసలైన వారసులం తామేనంటూ మొదటి భార్య మాలినిదేవి, కుమారుడు తారక్ ప్రద్యుమ్న రంగంలోకి దిగడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై శేరిలింగంపల్లి తహసీల్దార్ గురువారం విచారణ చేపట్టారు. గతంలో గోపీనాథ్ రెండో భార్య సునీత, ఆమె పిల్లలకు జారీ చేసిన లీగల్ హెయిర్ సర్టిఫికెట్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టి, ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేశారు.

విచారణకు గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి, కుమారుడు తారక్‌తో పాటు గోపీనాథ్ తల్లి మహానందకుమారి కూడా హాజరయ్యారు. ఆమె తన కోడలు మాలినీదేవికి మద్దతుగా నిలిచారు. రెండో భార్య సునీత తరఫున ఆమె కుమార్తె దిశిర, న్యాయవాది హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనలు విన్న తహసీల్దార్ వెంకారెడ్డి, వారి వద్ద ఉన్న ఆధారాలను స్వీకరించారు. మరిన్ని పత్రాలు సమర్పించేందుకు గడువు కావాలని ఇరువర్గాలు కోరడంతో, ఈ నెల 19వ తేదీలోగా వాటిని అందించాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు.

గోపీనాథ్ మృతి ఒక మిస్టరీ: తల్లి మహానందకుమారి
ఈ సందర్భంగా గోపీనాథ్ తల్లి మహానందకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. “1998లోనే మాలినితో గోపీనాథ్‌కు వివాహమైంది. ఆమే మొదటి భార్య. మాలినితో విడాకుల పిటిషన్ కూడా రద్దయింది. గోపీనాథ్ చావు ఒక మిస్టరీ. ఆయన ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నాడని చెప్పి నన్ను చూడనివ్వలేదు. కేటీఆర్ వచ్చేవరకూ మరణవార్తను ధ్రువీకరించలేదు. ఎందుకు అలా చేశారో కేటీఆరే జవాబు చెప్పాలి. కొడుకుగా ప్రద్యుమ్నకు అన్ని హక్కులు దక్కాలి” అని ఆమె పేర్కొన్నారు.

రావొద్దని బెదిరించారు: కుమారుడు తారక్
గోపీనాథ్ కుమారుడు తారక్ ప్రద్యుమ్న మాట్లాడుతూ.. “నాన్న నాతో టచ్‌లోనే ఉండేవారు. ఆయన మరణవార్త తెలిసి అమెరికా నుంచి రావాలనుకున్నా. కానీ, వస్తే గొడవలు జరుగుతాయని, రావొద్దని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు బెదిరించారు. అందుకు సంబంధించిన కాల్ లాగ్స్ నా దగ్గర ఉన్నాయి. నాన్న అంత్యక్రియలు గౌరవంగా జరగాలనే ఉద్దేశంతోనే ఆగాను. నా పాస్‌పోర్ట్, ఇతర పత్రాల్లో తండ్రిగా గోపీనాథ్ పేరే ఉంది. మమ్మల్ని కొన్ని నెలలుగా మానసికంగా వేధిస్తున్నారు” అని ఆరోపించారు. తాము చట్టప్రకారం విడాకులు తీసుకోలేదని మాలినీదేవి స్పష్టం చేశారు.

ఎన్నికల ముందు రాజకీయ కుట్ర: సునీత వర్గం
ఈ ఆరోపణలను సునీత కుటుంబం ఖండించింది. “గత 25 ఏళ్లుగా గోపీనాథ్‌తో సునీత కలిసే ఉన్నారు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు సమర్పించిన అఫిడవిట్లలో భార్యగా సునీత పేరు, వారి పిల్లల పేర్లే ఉన్నాయి. బ్యాంకు, పాలసీ నామినీగా కూడా సునీతనే ఉన్నారు. ఇన్నాళ్లూ లేని వివాదం సరిగ్గా ఎన్నికల ముందు రావడం రాజకీయ కుట్రలో భాగమే. ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి వంటి పెద్దలందరూ సునీత కుటుంబాన్నే పరామర్శించారు. వారి దగ్గర సరైన ఆధారాలు లేవు” అని సునీత తరఫు వారు వాదిస్తున్నారు. తదుపరి విచారణలో సమర్పించే ఆధారాలను బట్టి తహసీల్దార్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

మాగంటి గోపీనాథ్‌ మృతికి కేటీఆరే కారణం.. ఈ విషయాన్ని ఆయన తల్లే చెప్పారు: బండి సంజయ్

Bandi Sanjay Alleges KTR Responsible for Maganti Gopinath Death

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై  కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి కేటీఆరే కారణమని, ఈ మాట గోపీనాథ్ తల్లే స్వయంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, కేటీఆర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే అసలు నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత రాత్రి బోరబండలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. “కేసీఆర్ మూర్ఖుడైతే, ఆయన కుమారుడు అంతకంటే పెద్ద మూర్ఖుడు. కేసీఆర్ మళ్లీ సీఎం కావడం కేటీఆర్‌కు ఇష్టం లేదు. ఎప్పుడెప్పుడు సీఎం గద్దెనెక్కాలా అని ఆయన చూస్తున్నారు. పదవి కోసం ఎంతకైనా తెగిస్తారు” అని ఆరోపించారు. కూతుళ్లే తల్లిదండ్రులను బాగా చూసుకుంటారని, తండ్రి బాగోగులు చూసుకోవాలని కవితకు సూచించారు.

అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “రాష్ట్రంలో ఏనుగులు తినేటోడు పోయి, పీనుగలు పీక్కుతినేటోడు వచ్చిండు” అంటూ రేవంత్ పాలనపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కేవలం రూ.9 వేల కోట్లపైనే సీబీఐ విచారణ ఎందుకు కోరారని ప్రశ్నించారు. లక్ష కోట్ల అవినీతిపై విచారణ కోరే దమ్ము రేవంత్‌కు ఉందా? అని నిలదీశారు. రేవంత్, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనని, కలిసి లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు.

మజ్లిస్‌పై కూడా బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. “జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే అది మజ్లిస్ గెలిచినట్టే. వాళ్లు గెలిస్తే ప్రజలు బిచ్చగాళ్లు అవుతారు. మహిళల మెడలోని మంగళసూత్రాలు కూడా గుంజుకుపోతారు” అని హెచ్చరించారు. రేవంత్ టోపీ పెట్టుకోవడంపై స్పందిస్తూ, తనకు సినీనటుడు వేణుమాధవ్ గుర్తుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. “నేను హిందువును. తల నరుక్కుంటానే తప్ప టోపీ పెట్టుకొని దొంగ నమాజ్‌లు చేయను. ఇతర మతాలను కించపరచను” అని స్పష్టం చేశారు. చార్మినార్‌పై కాషాయ జెండా ఎగరవేయడమే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు.

కాగా, బండి సంజయ్ రోడ్ షోకు తొలుత అనుమతి రద్దయిందని ప్రచారం జరిగింది. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, పోలీసులు చివరికి ర్యాలీకి అనుమతినిచ్చారు. దీంతో ప్రచారం ప్రశాంతంగా ముగిసింది.

Related posts

ఉద్యోగుల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ‘హెల్త్‌ ట్రస్ట్‌’…రూ.800 కోట్లతో కార్పస్‌ ఫండ్‌

Ram Narayana

అందరి దృష్టిని ఆకర్షించిన టీయూడబ్ల్యూజే ఐజేయూ మహాసభలు…

Ram Narayana

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్రిటిష్ హైకమిషనర్

Ram Narayana