Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పెగాసస్ వివాదం.. రేపు రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామన్న రేవంత్‌రెడ్డి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన రేవంత్

పెగాసస్ వివాదం.. రేపు రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామన్న రేవంత్‌రెడ్డి
-ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన రేవంత్
-పెగాసస్ వివాదంపై జేపీసీ, లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్
-తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపణ
-50 మంది ప్రైవేటు హ్యాకర్లతో ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని ఆగ్రహం

పెగాసస్ ‌స్పై వేర్‌ హ్యాకింగ్ వివాదం నేపథ్యంలో రేపు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ను ముట్టడించనున్నట్టు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. నిన్న ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. పెగాసస్ సాఫ్ట్‌వేర్ వినియోగంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులపై నిఘా వేసేందుకు ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసేందుకు ప్రభుత్వం ఉపయోగిస్తోందని ఆరోపించారు.

దేశంలో 121 మంది పెగాసిస్ బాధితులు ఉన్నట్టు ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గతంలో చెప్పారని, ఇప్పటి ఐటీ మంత్రి ఈ సాఫ్ట్‌వేర్ ఎక్కడుందని ప్రశ్నించడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బయటపెడుతోందన్నారు. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం కూడా 2015 నుంచి ప్రతిపక్ష నేతల ఫోన్లు, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్లు ట్యాప్ చేస్తోందన్నారు. ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసి 50 మంది ప్రైవేటు హ్యాకర్లతో కాంగ్రెస్ నేతలు, మీడియా ప్రతినిధులు, న్యాయమూర్తుల ఫోన్లను పరిశీలిస్తున్నారని ఈ నెల 16నే చెప్పానని గుర్తు చేశారు.

పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్‌కు వినియోగిస్తున్నందుకు నిరసనగా దేశవ్యాప్తంగా రేపు రాజ్‌భవన్‌ల ముట్టడికి ఏఐసీసీ పిలుపునిచ్చినట్టు చెప్పారు. ఇందులో భాగంగా రేపు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ను ముట్టడించనున్నట్టు చెప్పారు. పెగాసస్‌పై నిష్పక్షపాత విచారణకు వీలుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. కాగా, రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ నిన్న రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

Related posts

తిరుపతి ఉప ఎన్నికపై సీఎం జగన్ సమీక్ష

Drukpadam

టీడీపీ ఎన్డీఏలో చేరికపై స్పందించిన చంద్రబాబు ,ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ …

Drukpadam

ప్రజాదరణ తట్టుకోలేకనే దాడులు… ఖమ్మం జిల్లా కాంగ్రెస్!

Drukpadam

Leave a Comment