ఖమ్మం వార్తలు

రామారావు హంతకులు ఎవరో తేల్చండి …లేదంటే దశలవారీ ఉద్యమం ..సిపిఎం హెచ్చరిక

సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు, రైతుసంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్ష, కార్యదర్శి, చింతకాని మండలం పాతర్లపాడుకు మాజీ సర్పంచ్ సామినేని రామారావు హత్య జరిగి నేటికీ 17 రోజులు అవుతున్నా దోషులను తేల్చటంలో పోలీసుశాఖ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉద్యమ కార్యాచరణ చేపడుతామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు హెచ్చరించారు .ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోతినేని మాట్లాడారు. హంతకులు ఎవరో తేల్చకుండా ఈ నాన్చుడు ఏమిటి ..?ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారని ప్రశ్నించారు ..పైగా భాదితులను, ఫిర్యాదు దారులను స్టేషనలకు పిలిచి వేధింపులకు గురిచేయడమేమిటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీ వైఖరి ఇలాగే ఉంటె హంతకులను పట్టుకునే వరకు ఉద్యమం తప్పదని అన్నారు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వత్తిడి మేరకే హత్య విచారణలో జాప్యం జరుగుతుందని ఆయన ఆరోపించారు .. 19వ తేదీన కాంగ్రెస్, బీజేపీతర అఖిలపక్షాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దీనికి ప్రజాస్వామ్య, ప్రజాతంత్రవాదులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమస్యను ఇలా వదిలే ప్రసక్తే లేదని, నేరస్తులను అరెస్టు చేసే వరకూ ఉద్యమిస్తామని హెచ్చరించారు. అధికార పార్టీ ఒత్తిడి మేరకే విచారణలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. సామినేని హత్య కేసు విచారణ పక్కదోవ పట్టేలా సాగుతోందన్నారు. అధికార పార్టీ ఒత్తిడికి తలగ్గి ఎంక్వైరీని ఇలాగే జాప్యం చేస్తే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అఖిలపక్షాలు, ప్రజాస్వామ్యవాదులతో కలిసి పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామని ప్రకటించారు.

సామినేని కేసు విషయంలో పోలీసు విచారణ కనిపించే నేరస్తులను వదిలి కానరాని వారికోసం అన్వేషణలా సాగుతోందని పోతినేని అన్నారు. హత్య జరిగిన రోజే నేరస్తులు ఫలానా వాళ్లని రామారావు సతీమణి స్వరాజ్యం ఫిర్యాదు చేశారని తెలిపారు. గ్రామానికి చెందిన ఐదుగురు ఈ హత్యా నిందితుల్లో ఉన్నారని ఆమె పిటిషన్ ఇచ్చినా పోలీసులు దానిని పూర్తిగా పక్కన పెట్టేసి.. రామారావుకు కుటుంబ సమస్యలు ఏమున్నాయి? ఆయనకు పార్టీలో అంతర్గత సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఆర్థిక సమస్యలు ఏమున్నాయి?…. రామారావు కుమారులు, కుమార్తె, మనవళ్లు, మనవరాళ్లు వాళ్లు చదువుకున్న కాలేజీలు, ఆ కళాశాలల్లో వారికి శత్రువులు ఎవరున్నారు? అని పోలీసులు విచారిస్తుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేరస్తులు ఫలానా వాళ్లూ అంటే వాళ్లను విచారించకపోగా, హత్య జరిగిన రోజు ఆ గ్రామ, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్స్ పెట్టి ఏ తప్పుడు ఆరోపణలైతే చేశారో ఆ ప్రచారాలకు అనుగుణంగా పోలీసు విచారణ సాగుతోందన్నారు. ఇలా ఎన్ని రోజులు పోలీసు విచారణ సాగించినా దోషులు తేలే పరిస్థితి లేదన్నారు. ఇదీ రాజకీయ హత్య అంటే పోలీసు కమిషనర్ ఏమాత్రం సహించలేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. జిల్లా అత్యున్నతమైన పోలీసు అధికారే ఇలా ఉన్నారంటే ఏ మేరకు అధికార పార్టీ ఒత్తిడి పనిచేస్తుందో అర్థం చేసుకోవాలన్నారు. ఈ హత్య వెనుక పాలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని ఎవరైనా అంటే … వారిపైనే పోలీసు కేసులు నమోదు చేస్తామని సీపీ బెదిరించడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ రూపంలో విచారణ కొనసాగితే సభ్యసమాజం, ప్రజాస్వామ్యం ఏమవుతుందని ప్రశ్నించారు. తాము చేసిన నేరాన్ని తప్పించుకోవటం కోసం చేసే ప్రచారాన్ని నమ్మి విచారణ సాగిస్తే దోషులను ఎప్పటికీ పట్టుకోలేరని తాము సీపీకి సూచించినట్లు తెలిపారు. అయినప్పటికీ , ఇప్పటికీ విచారించే పద్ధతిలో మార్పురాలేదన్నారు. తాము పాతర్లపాడు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పెడదామని భావించే వ్యక్తిని, తమ పార్టీ పూర్తికాలం కార్యకర్తను, తమ పార్టీకి చెందిన రైతుసంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ ను విచారణకు రమ్మని మధిర సీఐ ఫోన్ చేయటాన్ని బట్టి విచారణ ఎంత పక్కదోవ పట్టేలా వెళ్తుందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు …

అజాతశత్రువు, మచ్చలేని మనిషి రామారావు హత్యపై సమాజమంతా స్పందించాలన్నారు. ఈ హత్యాకాండను నిరసిస్తూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో చేపట్టే ఆందోళనలను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేశ్, కళ్యాణం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదినేని రమేష్, రాష్ట్ర సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Related posts

బడికి రాని విద్యార్థి.. ఇంటి ముందు టీచర్లు, విద్యార్థుల ధర్నా!

Ram Narayana

ఎన్ఎస్పీ కెనాల్ మరమత్తు, అధినీకరణ పనులు చేపట్టాలి – మంత్రి తుమ్మల

Ram Narayana

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు ఖమ్మం వర్తకుల వినతి

Ram Narayana