పెంచలయ్య హంతకులను కఠినంగా శిక్షించాలి
హోంమంత్రికి వి శ్రీనివాసరావు లేఖ
అండదండలిచ్చిన వారందరినీ అరెస్టు చేయాలి
గంజాయి, మత్తుమందులను అడ్డుకుని నెల్లూరులో ప్రజలకు అండగా నిలిచిన కె పెంచలయ్యను చంపినవారిని, వారికి అండదండలిచ్చి ప్రోత్సహించిన వారందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, ఆయన కుటుంబాన్ని పరామర్శించి వారికి అన్ని విధాలా పునరావాస చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి అనితను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు హోంమంత్రికి ఆదివారం లేఖ రాశారు. నెల్లూరులోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలయ్య తన కళారూపాలతో, చైతన్యపరుస్తూ గంజాయి, మత్తుమందులతో కుటుంబాలు నాశనం కారాదని పట్టుదలతో పోలీసులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి గంజాయి అంతం చేయాలని చురుకుగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో గంజాయి ముఠా కక్షగట్టి ఆయనను వెంటాడి, వేటాడి అత్యంత దారుణంగా, క్రూరంగా, కన్నబిడ్డల ముందే కత్తులతో నరికి చంపడం రాష్ట్రంలో తీవ్ర ఆందోళన, ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు.
హంతకులు కత్తులు, రాడ్లు, మారణాయుధాలతో స్వైరవిహారం చేసి, బైక్‌పై వెళ్తున్న అతడిని తరిమి తరిమి చంపడం వెనుక గంజాయి మాఫియా ఉందనేది స్పష్టమని తెలిపారు. కొంతకాలంగా గంజాయి ముఠాను నడుపుతూ వారితో చోరీలు, నేరాలు, గంజాయి, మత్తుమందుల అమ్మకాలు చేయిస్తున్న ఒక మహిళ కారణమని పోలీసులు ఇప్పటికే ప్రకటించారని, ఆమెను తక్షణం అరెస్టు చేయాలని, ఎవరు అధికారంలో ఉంటే వారి అండదండలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నట్లు మీరు పదే పదే ప్రకటిస్తూ వచ్చారని, కానీ గంజాయి ముఠా చేసిన ఈ హత్యపై హోంమంత్రిగా కనీసం స్పందించలేదని వివరించారు. మాటమాత్రంగానూ ఖండించలేదని, ఇలా అయితే గంజాయిపై పోరాడే వారికి మీరు ఎలా భరోసా ఇవ్వగలరని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆ గంజాయి మాఫియాకు బలైన యువకుడి కుటుంబాన్ని సందర్శించి, భరోసా కల్పించాలని కోరారు.
పెంచలయ్య భార్య దుర్గకు రూ.50 లక్షల సాయం, ఆరు ఎకరాల భూమి, ఉద్యోగం ఇవ్వాలి
పెంచలయ్యది అత్యంత నిరుపేద దళిత కుటుంబమని, పెంచలయ్య భార్యతో పాటు ఇద్దరు చదువుకుంటున్న పిల్లలున్నారని వివరించారు. ఆ కుటుంబానికి కనీసం రూ.50 లక్షల సహాయం, ఆరు ఎకరాల భూమి, ఒక ఇల్లు శాంక్షన్ చేయాలని కోరారు. ఆయన భార్య దుర్గకు ఉద్యోగం కల్పించాలని, ఇద్దరు పిల్లల చదువుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు మీ నుండి ప్రకటన వస్తుందని, ఇప్పటికైనా వెంటనే ఆ కుటుంబాన్ని సందర్శించి వారికి భరోసా కల్పిస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడో, ఇక్కడో గంజాయి నేరస్తులను పట్టుకుంటున్నప్పటికీ కీలక సూత్రధారులు యథాతథంగా ఉన్న ఫలితమే ఈ హత్యని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, మద్యం, మత్తు పదార్థాల అక్రమ అమ్మకాల మాఫియాను అరికట్టేందుకు మరింత స్పష్టమైన, సమగ్రమైన చర్యలు చేపట్టాలని ఈ దారుణ ఘటన హెచ్చరిస్తుందని వివరించారు. ఈ మాఫియా ముఠాలు రాష్ట్రంలో ఎక్కడున్నా అధికార యంత్రాంగంతో అంటకాగి రక్షణ పొందుతున్నారని, ఇలాంటి శక్తులను ప్రోత్సహించేవారు ఏ పార్టీలో ఉన్నా, అధికార యంత్రాంగంలో ఏ స్థానంలో ఉన్నా అలాంటి శక్తులపట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్, మాఫియాను అరికట్టేందుకు త్రికరణశుద్ధితో తగిన చర్యలు చేపట్టాలని, వాటిపై పోరాడే ప్రజలకు బాసటగా ప్రభుత్వం నిలబడాలని కోరారు.
నెల్లూరు లేడీ డాన్..

సంప్రదాయిని.. సుద్దపూస అనుకుంటే పొరపాటే….నెల్లూరునే గజగజ వణికించేసిందిగా..! పద్దతికి చీర కట్టినట్టుగా ఉందనుకుంటే పప్పులో కాలేసినట్టే…గంజాయి డాన్…ఈ లేడి.. పోలీసులు విచారణ విస్తూపోయే నిజాలు!
నెల్లూరు జిల్లాలో ఇటీవల శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయా..! అన్నట్లు ఉంది తాజా పరిస్థితి.
తప్పు చేసిన వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి దిగుతున్న సందర్భాలు ఇటీవల చాలానే జరిగాయి.
గతంలో విజయవాడ నుంచి గంజాయి దందా చేపడుతున్న ముఠాను పోలీసులు వెంబండించగా..
నెల్లూరులో పోలీసులపై దాడికి పాల్పడ్డారు.
ఆ సందర్భంలో పోలీసులు కాల్పులు జరిపి ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చింది.
నెల్లూరులో మరో లేడీ డాన్..
ఇటీవలే రౌడీ షీటర్ శ్రీకాంత్, అతని ప్రియురాలు నిడిగుంట అరుణ వ్యవహారం బయటపడింది. పెరోల్ మీద బయటకు వచ్చి వారిద్దరూ చేసిన సెటిల్మెంట్ల వ్యవహారం వెలుగు చూడగా.. లేడీ డాన్ అరుణ తాజాగా ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసింది. ఆ హంతకులను పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. నెల్లూరు రూరల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కె. పెంచలయ్య(38), దుర్గా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు బిడ్డలు. ఎలక్ట్రిషియన్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే పెంచలయ్య.. కొన్నేళ్ల కిందట బోడిగాడితోట నుంచి హౌసింగ్ బోర్డు కాలనీకి మారారు. సమాజ స్పృహతో పాటు వామపక్ష భావజాలం ఉండే ఈయన.. సీపీఎంలో నాయకుడిగా, ఆర్డీటీ కాలనీ ముత్యాలమ్మ గ్రామాభివద్ధి కమిటీ సభ్యుడిగా ఉన్నారు. కాలనీలో కొందరు యువకులు గంజాయి తాగడం.. విచ్చలవిడిగా విక్రయాలు జరగడం గమనించి అడ్డుకున్నారు. సదరు విక్రయాలు ఓ మహిళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిసి.. పోలీసులకు సైతం సమాచారం అందించేవారు. దీంతో ఆయనపై కక్ష పెంచుకున్న గంజాయి బ్యాచ్.. ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం సాయంత్రం పిల్లలతో స్కూటీపై ఇంటికి వెళుతుండగా.. హౌసింగ్ బోర్డు ఆర్చి వద్ద తొమ్మిది మంది గుర్తు తెలియని యువకులు పెంచలయ్యను అడ్డుకున్నారు. మాకే అడ్డు వస్తావా అంటూ ఒక్కసారిగా వారంతా కత్తులతో దాడికి పాల్పడ్డారు. బాధితుడు ప్రాణ భీతితో పారిపోతుండగా.. వెంటాడి పొడిచి మరీ పరారయ్యారు. తీవ్ర గాయాలైన పెంచలయ్యను స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. నేపథ్యంలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద నిందితులు ఉన్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెళ్లగా పోలీసులుపై కత్తి తో దాడికి యత్నించారు. ఈ ఘటనలో ఆదినారాయణ అనే కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో జేమ్స్ అనే నిందితుడి మోకాలికి గాయాలయ్యాయి. మరో 9 మంది నిందితులు పరారయ్యారు. పోలీసులు వాళ్ల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడు జేమ్స్, కానిస్టేబుల్ ఆదినారాయణకు నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. గత రెండు మూడు నెలల నుంచి ప్రశాంతంగా ఉన్న నెల్లూరులో మళ్లీ గంజాయి, రౌడీయిజం పడగ విప్పడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. పెంచలయ్య హత్యలో కల్లూరుపల్లి ఆర్.డీ.టీ కాలనీకి చెందిన అరవ కామాక్షి హత్య చేయించినట్లు దాదాపు నిర్ధారణ అయినట్లు సమాచారం. దొంగతనాలకు పాల్పడే వ్యక్తులతో అసాంఘీక కార్యక్రమాలు చేయించడం, నేర చరిత్ర కలిగిన వ్యక్తులను ప్రొత్సహించినట్లు పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఇలాంటి పద్దతులు మంచిది కాదు అని మందలించినందున పెంచలయ్యను హత్య చేయించినట్లు పోలీసు విచారణలో తేలింది. స్థానిక బోడిగాని తోట వద్ద నివాసం ఉంటూ తన భర్త లారీ డ్రైవర్‌గా చుట్టుపక్కల వారికి చెబుతూ గంజాయి దందా కొనసాగించేదని తెలుస్తోంది. నిరుద్యోగులుగా ఉన్న యువతతో ఈ దందా చేయిస్తున్నట్లు తేలింది.