తెలంగాణ వార్తలు

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి ,మంత్రి పొంగులేటి…

ప్రతిష్ఠాత్మక ఆర్థిక సదస్సు “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ – 2025” కు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రపంచం తెలంగాణను పెట్టుబడుల రాజధానిగా చర్చించుకునేలా ఏర్పాట్లు ఉండేలా అధికారులకు పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

భారత్‌ ఫ్యూచర్‌ సిటీ వేదికగా ఈనెల 8, 9 తేదీలలో నిర్వహిస్తున్న గ్లోబల్‌ సమ్మిట్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో జరుగనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్ల పనులను శనివారం మంత్రి పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోని రాష్ట్రాలతో కాదు.. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్‌ – 2047 విజన్‌ తో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా వృద్ది సాధించేలా, 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యానికి చేరుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదన్నారు. సమ్మిట్‌ కు దేశ, విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులు హాజరవుతున్నందున ఎటువంటి లోటుపాట్లు లేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. మంత్రి వెంట టీజీఐఐసీ ఎండీ శశాంక, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు… రేవంత్ రెడ్డి విహంగ వీక్షణం

Revanth Reddy Oversees Telangana Rising Global Summit Preparations
  • ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు
  • ఉత్తమ్, కోమటిరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే
  • 100 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ఆర్థిక సదస్సు

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలోని ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ జరగనుంది. ఈ సదస్సు ఏర్పాట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు.

ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ అంతర్జాతీయ ఆర్థిక సదస్సును నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న సదస్సులో వివిధ అంశాలపై 27 ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు తరలి వస్తారు.

గ్లోబల్ సదస్సు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినదని, తమ విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గ్లోబల్ సమ్మిట్ వివరాలను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన మీడియాకు వివరించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో 27 సెషన్లు ఉంటాయని, వివిధ రంగాల నిపుణులు, నిష్ణాతులను ఆహ్వానించినట్లు వెల్లడించారు.

ఎయిర్‌లైన్స్ సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమిట్‌కు వివిధ దేశాల ప్రతినిధులు భారీ సంఖ్యలో వస్తారని వెల్లడించారు. ముఖ్య అతిథులకు సమస్య వస్తే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇలాంటి సదస్సు గతంలో ఎన్నడూ జరగలేదని భట్టివిక్రమార్క అన్నారు.

Related posts

రూ. 5 వేలతో పుష్పక్ జనరల్ బస్‌పాస్‌లు తెచ్చిన తెలంగాణ ఆర్టీసీ!

Ram Narayana

అదానీ పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు…

Ram Narayana

తెలంగాణలో ఇక నేరుగా మొబైల్ ఫోన్లకే ట్రాఫిక్ చలాన్లు!

Ram Narayana