అంతర్జాతీయం

సంకెళ్లతో న్యూయార్క్‌కు మదురో!

  • అమెరికా వైమానిక దాడులతో వణికిన కరాకస్
  • దాడుల్లో 40 మంది పౌరులు, సైనికుల మృతి 
  • నికోలస్ మదురోను బంధించిన అమెరికా సైన్యం
  • మదురో కళ్లకు గంతలు కట్టిన ఫోటో విడుదల
  • వెనిజులా పాలన, చమురుపై అమెరికా నియంత్రణ
  • అమెరికా చర్యను ఖండించిన రష్యా, చైనా
  • డ్రగ్స్ ఆరోపణలను తోసిపుచ్చిన మదురో

దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో అమెరికా సైన్యం ఊహించని రీతిలో భారీ సైనిక చర్యకు దిగింది. శనివారం తెల్లవారుజామున రాజధాని కరాకస్‌పై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 40 మంది పౌరులు, సైనికులు మరణించారు. ఈ మెరుపు ఆపరేషన్‌లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఇరాక్ యుద్ధం తర్వాత ఒక దేశంలో అధికార మార్పిడి కోసం అమెరికా చేపట్టిన అతిపెద్ద సైనిక చర్యగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది.

వెనిజులా అధ్యక్షుడు మదురోను బంధించిన అనంతరం అమెరికా యుద్ధ నౌకలో న్యూయార్క్‌కు తరలించారు. ఈ సందర్భంగా మదురో చేతులకు సంకెళ్లు వేసి, కళ్లకు గంతలు కట్టిన ఫోటోను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. న్యూయార్క్‌లోని స్టీవర్ట్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్‌కు చేరుకున్న మదురోను, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. వచ్చే వారం ఆయనపై నార్కో-టెర్రరిజం, ఆయుధాల అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరారోపణలపై విచారణ జరగనుంది.

వెనిజులాలో సురక్షితమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడే వరకు ఆ దేశ పాలనా బాధ్యతలను అమెరికాయే చూస్తుందని ట్రంప్ ప్రకటించారు. “వెనిజులాను మేమే నడుపుతాం” అని ఆయన స్పష్టం చేస్తూనే.. ఆ దేశంలోని అపారమైన చమురు నిల్వలను ఇతర దేశాలకు విక్రయించి ఆదాయం పొందుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులా భవిష్యత్తును అమెరికాయే నిర్దేశిస్తుందని ఆయన మాటలను బట్టి స్పష్టమవుతోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ దాడికి కేవలం 48 గంటల ముందే మదురో ఒక ఇంటర్వ్యూలో అమెరికాతో చర్చలకు తాను సిద్ధమని ప్రకటించారు. డ్రగ్స్ నియంత్రణ, చమురు రంగంలో అమెరికా పెట్టుబడుల విషయంలో తాము సహకరిస్తామని ఆయన ‘టెలిసూర్’ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే మదురో ప్రతిపాదనలను బేఖాతరు చేస్తూ అమెరికా ఈ దాడులకు తెగబడటం గమనార్హం.

అమెరికా చేపట్టిన ఈ సైనిక చర్యపై ప్రపంచ దేశాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. రష్యా, చైనాతో పాటు లాటిన్ అమెరికా, యూరప్ దేశాలు అమెరికా దాడులను తీవ్రంగా ఖండించాయి. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని కోరాయి. మరోవైపు అమెరికాలోనే ఈ ఆపరేషన్ చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మదురో అరెస్టుకు డ్రగ్స్ స్మగ్లింగ్‌తో సంబంధం లేదని, ఇది కేవలం అధికార మార్పిడి కోసం చేసిన దాడి మాత్రమేనని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

30 నిమిషాల మెరుపుదాడి.. కరాకస్‌పై 150 యుద్ధ విమానాలు

30 Minutes Attack US used 150 Fighter Jets to Capture Maduro
  • అర్ధరాత్రి వేళ కరాకస్‌ను చుట్టుముట్టిన అగ్రరాజ్యం దళాలు
  • అరగంటలోనే నికోలస్ మదురో బందీ
  • దాడి కోసం 20 స్థావరాల నుంచి కదిలిన యుద్ధ విమానాలు, బాంబర్లు
  • చీకటిలో వణికిన వెనిజులా రాజధాని
  • అమెరికాలో విచారణ ఎదుర్కోనున్న మదురో

జనవరి 3, 2026.. అర్ధరాత్రి సమయం. వెనిజులా రాజధాని కరాకస్ ఆకాశం ఒక్కసారిగా యుద్ధ విమానాల గర్జనతో దద్దరిల్లింది. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన 150కి పైగా అత్యాధునిక యుద్ధ విమానాలు, బాంబర్లు, డ్రోన్లు కరాకస్‌ను చుట్టుముట్టాయి. కేవలం 30 నిమిషాల వ్యవధిలో సాగిన ఈ మెరుపు ఆపరేషన్‌లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో చిక్కారు. హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించేలా సాగిన ఈ సైనిక చర్యతో దశాబ్దాల మదురో పాలనకు అగ్రరాజ్యం చరమగీతం పాడింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్’ ప్రారంభమైంది. అమెరికా తనకున్న అత్యున్నత సాంకేతికతతో కరాకస్ నగరంలో విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. నగరం చీకటిమయమైన వేళ, అమెరికా డెల్టా ఫోర్స్ కమెండోలు హెలికాప్టర్ల ద్వారా మదురో నివసిస్తున్న ‘కోట’ లాంటి భవనంపైకి దిగారు. మదురో సురక్షిత గదిలోకి వెళ్లేలోపే అమెరికా సైన్యం ఆయనను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకుంది. ఈ దాడిలో సుమారు 40 మంది మరణించినట్లు సమాచారం.

మదురోపై ఉన్న డ్రగ్స్ స్మగ్లింగ్, నార్కో-టెర్రరిజం ఆరోపణలే ఈ దాడికి ప్రధాన కారణమని అమెరికా చెబుతోంది. బంధించిన మదురోను సంకెళ్లతో న్యూయార్క్‌కు తరలించారు. అక్కడ ఆయనపై క్రిమినల్ విచారణ జరగనుంది. కాగా, వెనిజులాలో తిరిగి ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడే వరకు ఆ దేశ పాలనను తామే చూస్తామని ట్రంప్ ప్రకటించారు. అక్కడి భారీ చమురు నిల్వలను పునరుద్ధరించి, ఇతర దేశాలకు విక్రయించే బాధ్యతను కూడా అమెరికా తీసుకోనుంది.

 ఒక సార్వభౌమ దేశంపై అమెరికా జరిపిన ఈ దాడిని రష్యా, చైనా, క్యూబా వంటి దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, స్టేట్ టెర్రరిజం అని మండిపడ్డాయి. అయితే, తన దేశ యువతను డ్రగ్స్ బారి నుంచి రక్షించడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వెనిజులాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 

డీఈఏ హెడ్‌క్వార్టర్స్‌కు వెనిజులా అధ్యక్షుడు మదురో..

Nicolas Maduro Venezuela President Arrested and Taken to DEA Headquarters

అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా ప్రత్యేక దళాలు అదుపులోకి తీసుకున్నాయి. శనివారం వెనిజులా రాజధాని కారకాస్‌లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అరెస్ట్ చేశాయి. అనంతరం వారిని న్యూయార్క్‌కు తరలించాయి.

న్యూయార్క్‌లోని మాన్‌హాటన్‌లో ఉన్న అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA) ప్రధాన కార్యాలయంలో మదురోను అధికారులు తీసుకెళ్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మదురో దంపతులపై ‘నార్కో-టెర్రరిజం’, అమెరికాలోకి టన్నుల కొద్దీ కొకైన్‌ను దిగుమతి చేయడం, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం వంటి తీవ్రమైన అభియోగాలను నమోదు చేశారు.

ప్రస్తుతం డీఈఏ కార్యాలయంలో ఉన్న 63 ఏళ్ల మదురోను బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించనున్నట్లు అమెరికా మీడియా వర్గాలు వెల్లడించాయి. గతేడాది ప్రముఖ ర్యాపర్ సీన్ “డిడ్డీ” కోమ్బ్స్‌ను విచారణ సమయంలో ఇదే జైలులో ఉంచడం గమనార్హం. ఒక దేశాధినేతను మరో దేశం ఇలా అరెస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.

చేతులకు సంకెళ్లతో నడిచి వస్తూ… “గుడ్ నైట్”, “హ్యాపీ న్యూ ఇయర్” చెప్పిన మదురో… వీడియో ఇదిగో!

Nicolas Maduro Arrested Video Surfaces Online
  • వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన అమెరికా
  • హై-రిస్క్ ఆపరేషన్ తర్వాత న్యూయార్క్ జైలుకు తరలింపు
  • జైలుకు వెళుతూ ‘హ్యాపీ న్యూ ఇయర్’ అని వ్యాఖ్యానించిన మదురో

అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైనిక దళాలు బంధించాయి. వెనిజులా రాజధాని కారకాస్‌లో అత్యంత రహస్యంగా, హై-రిస్క్ ఆపరేషన్ నిర్వహించి మదురోను అదుపులోకి తీసుకుని న్యూయార్క్‌కు తరలించాయి. డ్రగ్ ట్రాఫికింగ్, ఆయుధాల అక్రమ సరఫరా వంటి తీవ్రమైన ఆరోపణలపై మదురోను అరెస్ట్ చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.

కాగా, మదురోను న్యూయార్క్‌లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్‌కు తరలిస్తున్నప్పటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లకు చెప్పులతో ఉన్న మదురో, తన పక్కనున్న వారిని ఆంగ్లంలో “గుడ్ నైట్.. హ్యాపీ న్యూ ఇయర్” అని విష్ చేయడం గమనార్హం. వాహనం నుంచి దిగుతున్నప్పుడు నొప్పితో మూలుగుతున్నట్లు కనిపించడంతో, అరెస్ట్ సమయంలో ఆయనకు గాయాలై ఉండొచ్చని ఆన్‌లైన్‌లో చర్చ జరుగుతోంది.

ఈ అనూహ్య పరిణామంతో వెనిజులా తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది. కారకాస్‌లో భద్రతా బలగాలు మోహరించాయి. ఈ నేపథ్యంలో వెనిజులా సుప్రీం కోర్టు, ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్!

Ram Narayana

ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా ఫ్యాన్స్ మధ్య గొడవ.. గినియాలో వంద మంది మృతి!

Ram Narayana

సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం.. 42 మంది భారత యాత్రికుల సజీవ దహనం..

Ram Narayana