అంతర్జాతీయం

వెనెజువెలాలో ఉద్రిక్తత.. అధ్యక్ష భవనం వద్ద కాల్పులు…

  • మిరాఫ్లోర్స్ అధ్యక్ష భవనం సమీపంలో భారీగా పేలుళ్లు, కాల్పులు
  • తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన డెల్సీ రోడ్రిగ్జ్
  • వెనెజువెలాను తామే నడిపిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  • అమెరికా చర్యను తప్పుబట్టిన భారత్, రష్యా, చైనా మరియు బ్రెజిల్

వెనెజువెలా రాజకీయ సంక్షోభం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు బందీగా పట్టుకున్న తర్వాత రాజధాని కారకాస్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తాజాగా అక్కడి మిరాఫ్లోర్స్ అధ్యక్ష భవనం సమీపంలో భారీగా కాల్పులు, ఘర్షణలు జరిగాయి. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ, నగరం మొత్తం భయాందోళనలో మునిగిపోయింది.

మదురో గైర్హాజరీలో వెనిజువెలా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికాతో చర్చలకు సిద్ధమని ఆమె సంకేతాలిచ్చారు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం వెనెజువెలాలో సరైన అధికార మార్పిడి జరిగే వరకు ఆ దేశాన్ని అమెరికా నడిపిస్తుందని స్పష్టం చేశారు.

అమెరికా తీరుపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా స్పందించారు. గతంలో గెరిల్లా పోరాటం చేసిన తాను మాతృభూమి రక్షణ కోసం మళ్లీ ఆయుధం పడతానని హెచ్చరించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా సైతం అమెరికా చర్యను తీవ్రంగా ఖండించారు. ఒక సార్వభౌమ దేశంపై బాంబులు వేయడం, అధ్యక్షుడిని పట్టుకోవడం ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు.

అమెరికా సైనిక చర్యను రష్యా, చైనా దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇది ఒక దేశంపై జరిగిన సాయుధ దురాక్రమణ అని రష్యా అభివర్ణించగా, ఒక దేశాధ్యక్షుడిపై బలాన్ని ప్రయోగించడం దిగ్భ్రాంతికరమని చైనా పేర్కొంది.

ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వెనెజువెలా ప్రజల క్షేమం తమకు ముఖ్యమని, అన్ని పక్షాలు శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతినకుండా చూడాలని భారత్ కోరింది.

‘వెనెజువెలాను ఇప్పుడు నేనే నడిపిస్తున్నా’: ఎన్బీసీ ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump Claims He Is Running Venezuela in NBC Interview
  • వెనెజువెలాతో తాము యుద్ధం చేయడం లేదన్న ట్రంప్
  • డ్రగ్ మాఫియాపైనే తమ పోరాటమని స్పష్టీకరణ
  • ప్రస్తుతానికి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదన్న అధ్యక్షుడు 
  • వెనెజువెలా చమురు రంగాన్ని పునర్నిర్మించే బాధ్యత అమెరికా కంపెనీలదేని వెల్లడి

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ తర్వాత ఆ దేశ భవిష్యత్తుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ‘ఎన్బీసీ న్యూస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. ప్రస్తుతం వెనెజువెలాను ఎవరు నడిపిస్తున్నారన్న ప్రశ్నకు “నేనే” అని ఒక్క మాటలో సమాధానమిచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆ దేశంలో ఇప్పుడప్పుడే ఎన్నికలు ఉండవని, ముందుగా అక్కడి మౌలిక సదుపాయాలను బాగు చేయాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు.

వచ్చే 30 రోజుల్లో వెనెజువెలాలో ఎన్నికలు జరుగుతాయా? అన్న ప్రశ్నకు ట్రంప్ ప్రతికూలంగా స్పందించారు. “ముందు దేశాన్ని ఒక దారికి తీసుకురావాలి. ప్రజలు ఓటు వేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం. దేశ ఆరోగ్యాన్ని తిరిగి పుంజుకునేలా చూడడమే మా మొదటి ప్రాధాన్యం” అని ఆయన పేర్కొన్నారు.

వెనెజువెలా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి చమురు రంగాన్ని పునర్నిర్మించేందుకు అమెరికా చమురు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ తెలిపారు. ఈ ప్రక్రియకు 18 నెలల కంటే తక్కువ సమయం పడుతుందని ఆయన అంచనా వేశారు. “దీని కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ ఖర్చును చమురు కంపెనీలే భరిస్తాయి. ఆ తర్వాత వచ్చే ఆదాయం ద్వారా లేదా మా ద్వారా వారు ఆ సొమ్మును తిరిగి పొందుతారు” అని వివరించారు.

తాము వెనెజువెలాతో యుద్ధం చేస్తున్నామన్న వాదనను ట్రంప్ తోసిపుచ్చారు. “మేము యుద్ధం చేస్తోంది వెనెజువెలాతో కాదు.. మా దేశంలోకి డ్రగ్స్ పంపుతున్న మాఫియాతో. తమ జైళ్లలోని ఖైదీలను, నేరస్తులను మా దేశంలోకి వదిలిపెట్టిన వారిపైనే మా పోరాటం” అని ఆయన స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని, ఒకవేళ సహకారం అందకపోతే రెండోసారి సైనిక దాడి చేసేందుకు కూడా సిద్ధమని హెచ్చరించారు.

కాంగ్రెస్ అనుమతి తీసుకోలేదన్న విమర్శలపై స్పందిస్తూ.. తమ చర్యలకు చట్టసభల మద్దతు ఉందని, అనవసరంగా సమాచారం లీక్ కాకూడదనే గోప్యంగా ఉంచామని ట్రంప్ సమర్థించుకున్నారు.

మ‌దురో డ్యాన్స్ స్టెప్పులే ఆయ‌న కొంప‌ముంచాయా?

How Maduros Regular TV Appearances Provoked Trump To Attack Venezuela
  • వెనిజువెలా అధ్యక్షుడి అరెస్ట్‌కు ఆయన చేసిన డ్యాన్సే కారణమని న్యూయార్క్ టైమ్స్ కథనం
  • అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేయడంతో ఆగ్రహించిన ట్రంప్ సర్కార్
  • సైనిక చర్య జరిపి మదురో దంపతులను అరెస్ట్ చేసిన యూఎస్ దళాలు
  • న్యూయార్క్‌లో కోర్టు ముందు హాజరు.. నేరాన్ని అంగీకరించని మదురో

వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా సైనిక చర్యకు దిగడం, ఆయన్ను అరెస్ట్ చేయడం వెనుక ఆసక్తికరమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మదురో ప్రభుత్వ టెలివిజన్‌లో తరచూ డ్యాన్స్ చేస్తూ కనిపించడమే ట్రంప్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టిందని, ఇదే సైనిక చర్యకు దారితీసిందని ‘ది న్యూయార్క్ టైమ్స్’ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది.

వివరాల్లోకి వెళితే.. పదవి నుంచి తప్పుకొని టర్కీకి ప్రవాసం వెళ్లాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటంను మదురో తిరస్కరించారు. పైగా ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ టీవీలో ఉత్సాహంగా కనిపిస్తూ అమెరికాను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. “నో క్రేజీ వార్” అనే పాటకు ఆయన డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది. మదురో చేసిన ఈ పనులను అమెరికా తీవ్ర అవమానంగా భావించిందని, “ఆయన చేసిన ఒక డ్యాన్సే కొంపముంచిందని” ఓ అధికారి వ్యాఖ్యానించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

మదురో తమను తక్కువ అంచనా వేస్తున్నారని భావించిన వైట్‌హౌస్, సైనిక చర్యకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ నెల‌ 3న తెల్లవారుజామున కరాకస్‌లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన అమెరికా సైనిక దళాలు, నికోలస్ మదురో, ఆయన అర్ధాంగి సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకుని న్యూయార్క్ కు తరలించాయి.

ప్రస్తుతం న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్న మదురో దంపతులు నిన్న‌ కోర్టు ముందు హాజరయ్యారు. తమపై మోపిన మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల కేసులను వారు అంగీకరించలేదు. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి అల్విన్ కె. హెల్లర్‌స్టీన్ ప్రకటించారు.

92 ఏళ్ల వయసులోనూ తీర్పులు.. మదురో కేసును విచారించనున్న వృద్ధ న్యాయమూర్తి

Alvin Hellerstein to Oversee Maduro Case at 92 Years Old
  • మదురో కేసును విచారించనున్న 92 ఏళ్ల జడ్జి ఆల్విన్ హెల్లర్‌స్టెయిన్
  • అమెరికా రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ జడ్జీలకు లేని రిటైర్మెంట్ వయసు 
  • 9/11 దాడులు, ట్రంప్ కేసులు వంటి కీలక విచారణలు చేపట్టిన అనుభవం హెల్లర్‌స్టెయిన్ సొంతం 

వెనిజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోపై జరుగుతున్న చారిత్రాత్మక విచారణ ఒక ఆసక్తికరమైన అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ కేసును పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తి ఆల్విన్ హెల్లర్‌స్టెయిన్ వయసు ఏకంగా 92 ఏళ్లు. ఇంతటి కీలకమైన అంతర్జాతీయ కేసును ఒక వృద్ధ న్యాయమూర్తి విచారించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

 అయితే, అమెరికా న్యాయ వ్యవస్థలో ఇది అసాధారణమేమీ కాదు. అమెరికా రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ III’ ప్రకారం ఫెడరల్ జడ్జీలకు రిటైర్మెంట్ వయసు అంటూ ఏదీ లేదు. వారు తమ పదవుల్లో ‘జీవితకాలం’ కొనసాగవచ్చు. న్యాయమూర్తులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాతలు ఈ నిబంధనను చేర్చారు. ఒకవేళ జడ్జిపై తీవ్రమైన అభియోగాలు ఉండి, అభిశంసన ద్వారా తొలగిస్తే తప్ప, వారు స్వచ్ఛందంగా తప్పుకునే వరకు పదవిలో ఉండవచ్చు.

మూడు దశాబ్దాలుగా ఫెడరల్ బెంచ్‌లో ఉన్న హెల్లర్‌స్టెయిన్ కు అతిపెద్ద కేసులను హ్యాండిల్ చేసిన చరిత్ర ఉంది.

  • సెప్టెంబర్ 11 దాడుల బాధితుల పరిహారం కేసులు.
  • డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన పలు చట్టపరమైన అంశాలు.
  • మదురో అనుచరులకు డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో శిక్షలు ఖరారు చేయడం.
  • ప్రస్తుతం మదురో కేసు కూడా ఆయన దగ్గరకు రావడానికి కారణం.. ఈ డ్రగ్ నెట్‌వర్క్ దర్యాప్తుపై ఆయనకు ఉన్న అపారమైన పట్టు, అనుభవమే.

పదవీ విరమణ ఎందుకు చేయరు?
అమెరికాలో 65 ఏళ్లు నిండిన జడ్జీలు ‘సీనియర్ హోదా’ తీసుకునే వీలుంటుంది. ఇందులో జీతం మొత్తం వస్తుంది కానీ, పని భారం తగ్గుతుంది. అయినా కూడా చాలా మంది జడ్జీలు చురుగ్గా ఉంటూ పూర్తిస్థాయి కేసులను చేపడుతున్నారు. అయితే, వృద్ధాప్యం కారణంగా మానసిక సామర్థ్యం తగ్గుతుందనే విమర్శలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. ఉదాహరణకు, 98 ఏళ్ల వయసులోనూ పదవిలో ఉండాలనుకున్న జడ్జి పౌలిన్ న్యూమన్‌ను ఆమె సామర్థ్యంపై అనుమానంతో ఇటీవల విధులకు దూరంగా ఉంచారు.

Related posts

విద్యార్థి నేతలకు బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులు

Ram Narayana

అబుదాబి లాటరీలో రూ.34 కోట్ల జాక్ పాట్ కొట్టిన ఎన్నారై.. ఫోన్ చేస్తే నో రెస్పాన్స్!

Ram Narayana

న్యూయార్క్ సమీపంలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, పొగ..!

Ram Narayana