బీఆర్ యస్ పై మంత్రి పొంగులేటి ఫైర్ ..పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హితవు
ఒళ్ళంతా విషంతో కారుకూతలు కూస్తే మళ్ళీ వాతపెట్టడం ఖాయమన్న మంత్రి
అప్పటి ‘ప్రభువుల’కు ప్రజలే బుద్ధి చెబుతారన్నమంత్రి
అశ్వారావుపేటలో కాంగ్రెస్ సర్పంచుల సన్మాన సభలో బీ ఆర్ ఎస్ పార్టీ పై ధ్వజం
- గులాబీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యింది

బీఆర్ యస్ నాయకులకు ఒళ్ళంతా విషమేనని ,ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టిన ఇంకా వారికీ బుద్దిరాలేదని ఇదే తీరు కొనసాగితే మళ్ళీ వాతలు పెట్టడం ఖాయమని రాష్ట్ర రెవెన్యూ , గృహనిర్మాణ ,సమాచారశాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు …మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ,అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగిస్తూ బీఆర్ యస్ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు ..
అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే కర్రుకాల్చి వాత పెట్టినా.. గత పాలకులకు ఇంకా జ్ఞానం రాలేదు. ఒళ్లంతా విషం నింపుకొని రోడ్ల మీద కారుకూతలు కూస్తున్న ఆనాటి ‘ప్రభువుల’కు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నాలుగోసారి వాత తప్పదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అశ్వారావుపేటలోని శ్రీశ్రీ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ మద్దతుదారులైన 60 మంది సర్పంచుల సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పదేళ్ల పాలనలో పేదవాడికి ఇల్లు కట్టించాలనే జ్ఞానం కూడా లేని అప్పటి పాలకులు, ఇప్పుడు అధికారం పోయిందన్న అక్కసుతో సోల్లు వాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. పదేళ్లలో నియోజకవర్గానికి కనీసం 10 ఇళ్లు కూడా ఇవ్వని వారు ఇప్పుడు తమ ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే మూడుసార్లు చెంప చెళ్లుమనిపించిన ప్రజలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే తీర్పును పునరావృతం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
అశ్వారావుపేట గిరిజన ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధతో తమ ప్రభుత్వం ఇక్కడకు 4,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని, ఇది గిరిజన ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే మేడారం జాతరను 200 ఏళ్ల వరకు చెక్కుచెదరని రీతిలో అద్భుతమైన రాతి కట్టడాలతో పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజలను ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా, గ్రామాల్లో నిస్వార్థంగా సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని సర్పంచులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న తదితరులు పాల్గొని ప్రసంగించారు.
సత్తుపల్లిలో 81 మంది నూతన సర్పంచులకు ఘన సన్మానం
పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన బీఆర్ఎస్ నేతలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మార్చుకోకుండా పిచ్చి కుక్కల్లా మాట్లాడుతున్నారని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం సత్తుపల్లిలోని రాణి సెలబ్రేషన్స్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అధ్యక్షతన జరిగిన 81 మంది సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
- గులాబీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యింది
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొన్నటి పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూశాక బీఆర్ఎస్ నాయకులకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఓటమిని జీర్ణించుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రోడ్డు మీద పిచ్చి కుక్క కరిస్తే ఎలా పిచ్చెక్కినట్లు వాగుతారో.. అదే పద్ధతిలో గత పదేళ్లు పాలించిన వారు బ్లఫ్ చేస్తున్నారు. 10 మంది సర్పంచులను గెలిపించుకుని, కార్యకర్తలందరినీ నిలబెట్టి మేమే గెలిచామని చెప్పుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. - మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే గతి!
గతంలో ఎన్నికల ఫలితాలను సెమీఫైనల్స్‌గా అభివర్ణించిన మాజీ మంత్రులపై పొంగులేటి నిప్పులు చెరిగారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 69 శాతం సీట్లు గెలిచి కాంగ్రెస్ తన జైత్రయాత్రను చాటింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇది 80 శాతానికి మించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామన్న హెచ్చరికలు ప్రజల ముందు సాగవు. గతంలో అశాస్త్రీయంగా చేసిన జిల్లాల విభజనను సరిచేసి, శాస్త్రీయంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తను పొట్టలో పెట్టుకుని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఈ విజయానికి నాంది అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
అభివృద్ధి…సంక్షేమాలకు సమ ప్రాధాన్యత : మంత్రి పొంగులేటి
అశ్వారావుపేట : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాన ప్రాధాన్యతతో అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తో కలిసి మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో నగరాభివృద్ధి నిధుల ద్వారా రూ.1.50 కోట్లతో మున్సిపల్ మార్కెట్ భవనం, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మున్సిపాలిటీ కార్యాలయ భవనానికి కూడా శంకుస్థాపన చేశారు. దమ్మపేట గ్రామంలో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకెళ్తోందన్నారు. సమ్మక్క – సారలమ్మ మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాకతీయుల కాలం నాటి నిర్మాణ శైలిని అనుసరిస్తూ మేడారం ఆలయాన్ని రాతి నిర్మాణాలతో అభివృద్ధి చేస్తున్నామని, ఇవి మరో 200 సంవత్సరాలు నిలిచేలా రూపకల్పన చేసినట్లు చెప్పారు.
ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనకు రానుండగా, 19న అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.