తెలంగాణ వార్తలు

మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నాను…30 వ తేదీ హాజరు కాలేను సిట్ అధికారులకు కేసీఆర్ లేఖ

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి పంపిన నోటీసుకు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ గురువారం రాత్రి జవాబు ఇచ్చారు. ఈనెల 30వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని తనను కోరారని, అయితే ప్రస్తుతం మున్సిపాలిటీలకు, కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జరుగుతోందన్నారు.

రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు ఈనెల 30వ తేదీ చివరి గడువుగా గుర్తు చేశారు. ఎన్నికలు పార్టీల ప్రాతిపదికగా జరుగుతున్నందున, తాను చాలా మందికి అధికార పత్రాలు జారీ చేయడంలో నిమగ్నమై ఉన్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఆయా అంశాలను దృష్టిలో ఉంచుకుని, సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం తనను విచారించేందుకు మీకు అనుకూలమైన మరో తేదీని నిర్ణయించవచ్చని కేసీఆర్ సూచించారు. ఈ విచారణను తాను నివసించే ఎర్రవల్లిలో నిర్వహించవచ్చని పేర్కొంటూ ఇంటి నెంబర్ సహా పూర్తి చిరునామాను తెలిపారు.

ఇదే దశలో సీఆర్పీసీ సెక్షన్ 160లోని నిబంధనలను సిట్ అధికారికి కేసీఆర్ గుర్తు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఏ పోలీసు అధికారి అయినా, తన పరిధిలోని లేదా సమీపంలోని ఏ స్టేషన్ లోనైనా విచారించేందుకు తన ముందు హాజరు కావాలని రాతపూర్వకంగా వ్యక్తిని కోరవచ్చన్నారు. ఆయా కేసులో వాస్తవాలు, పరిస్థితులు తెలిసిన సంబంధిత వ్యక్తి అవసరమైన విధంగా విచారణ అధికారి ముందు హాజరు కావాలసి ఉందని చట్టం చెబుతోందన్నారు.

అయితే పదిహేనేళ్లలోపు, లేదా 65 ఏళ్ల వయస్సుకంటే ఎక్కువగా ఉన్న పురుషుడుగాని, మహిళగాని, మానసికంగాగాని, శారీరకంగా వికలాంగుడైన వ్యక్తినిగాని అతను నివసించే ప్రదేశం కాకుండా వేరే ప్రాంతంలో హాజరు కావాలని కోరకూడదని సిట్ అధికారికి రాసిన జవాబు పత్రంలో కేసీఆర్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో 65 ఏళ్లకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ పురుషుడైనా స్టేషన్ కు రావలసిన అవసరం లేదన్నారు. దర్యాప్తు బృందం ఆయా వ్యక్తి నివసిస్తున్న ప్రదేశంలోనే విచారణ జరపాల్సి ఉంటుందని చట్టం నిర్దేశిస్తోందని తాను గుర్తు చేస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.

కాబట్టి సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం ముందస్తు నోటీసుతో తాను నివసిస్తున్న ఇంటి నెం. 3-96, ఎర్రవల్లి, మర్కూక్ మండలం, సిద్ధిపేట జిల్లా-502279 అనే చిరునామాలో తనను విచారణ చేసుకోవచ్చన్నారు. విచారణ జరపాల్సిన ప్రదేశంపై ప్రాదేశిక పరిమితులు నిర్దేశించరాదని కూడా సీఆర్పీసీ సెక్షన్ 160 స్పష్టం చేస్తోందన్నారు. భవిష్యత్తులో తనకు పంపే అన్ని నోటీసులు తాను పేర్కొన్న ప్రస్తుత నివాసపు చిరునామాకు పంపవచ్చన్నారు.

తెలంగాణా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, అసెంబ్లీలో ప్రస్తుత విపక్ష నాయకునిగా, ఈ దేశ పౌరునిగా బాధ్యతాయుతంగా తాను దర్యాప్తునకు పూర్తి సహకారాన్ని అందిస్తానని కేసీఆర్ సిట్ అధికారులకు రాసిన లేఖలో హామీ ఇచ్చారు.

Related posts

చివర గింజ వరకు కొంటాం…మంత్రి పొంగులేటి

Ram Narayana

నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం.. వీడియో ఇదిగో!

Ram Narayana

రోడ్డు పక్కన హోటల్‌లో మిర్చి బజ్జీ రుచి చూసిన కేటీఆర్…

Ram Narayana