
- గుంటూరులో అంబటి నివాసం వద్ద ఉద్రిక్తత… పోలీసు బందోబస్తు!
- చంద్రబాబుపై అంబటి బూతులతో విరుచుకుపడిన వైనం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
- అంబటిని అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాలు!
గుంటూరులో సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబును బూతులతో దూషించిన నేపథ్యంలో, టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయనను అరెస్ట్ చేయబోతున్నారనే వదంతులు వ్యాపించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ప్రచారంతో గుంటూరులోని నవభారత్ నగర్ లో ఉన్న అంబటి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి, భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రస్తుతం అంబటి రాంబాబు గుంటూరులోని తన నివాసంలోనే ఉన్నారు. ఆయనపై ఉన్న పలు ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ ఖాయమంటూ సోషల్ మీడియాలో, స్థానికంగా ప్రచారం జోరందుకుంది. ఈ సమాచారంతో వైసీపీ కార్యకర్తలు, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై అంబటి నివాసానికి వెళ్లే మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. మీడియా ప్రతినిధులతో సహా ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించడం లేదు. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
అంబటి ఇంటిని ముట్టడించిన టీడీపీ శ్రేణులు… చేతులు జోడించి క్షమాపణ చెప్పాలన్న ఎమ్మెల్యే గల్లా మాధవి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. అంబటి బహిరంగంగా, రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్ చేశారు. ఆమె నేతృత్వంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, మహిళలు గుంటూరు నవభారత్ నగర్‌లోని అంబటి నివాసాన్ని ముట్టడించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
గల్లా మాధవి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు అంబటి నివాసం వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆగ్రహంతో ఉన్న కొందరు కార్యకర్తలు అంబటి ఇంటిపై రాళ్లు రువ్వగా, మరికొందరు ఇంటి బయటన ఉన్న కారును ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తల దాడుల్లో ఇంటి కిటికీ అద్దాలు, పూలకుండీలు పగిలిపోయాయి. టీడీపీ మహిళా కార్యకర్తలు చీపురు కట్టలతో నిరసన తెలుపుతూ, అంబటి నివాసంపై కోడిగుడ్లు విసిరారు.ః
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఇంతటి అసభ్యకరంగా దూషించడం హేయమైన చర్య. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, ప్రజలందరి ముందు చేతులు జోడించి క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
మహిళా కార్యకర్తలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “చంద్రబాబు మాకు దైవంతో సమానం. గతంలో ఆయన కుటుంబసభ్యులను దూషించినప్పుడు సంయమనం పాటించాం. కానీ ఈసారి సహించేది లేదు. అంబటి రాంబాబును వెంటనే అరెస్ట్ చేయాలి, లేదంటే మాకు అప్పగించాలి” అంటూ వారు పోలీసులను డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో అంబటి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సీఎం చంద్రబాబుపై అంబటి అసభ్య వ్యాఖ్యలు.. గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర అసభ్య పదజాలంతో దూషణలకు దిగిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు శనివారం జిల్లా ఎస్పీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. అంబటిపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా గోరంట్లలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద, తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అయిందంటూ ‘మహాపాపం’ పేరుతో టీడీపీ నేతలు ఇటీవల ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని, లేదంటే తామే తొలగిస్తామని అంబటి రాంబాబు హెచ్చరించారు. చెప్పినట్టుగానే శనివారం ఉదయం గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, ఆ తర్వాత ఫ్లెక్సీ వద్దకు వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీ వద్దకు చేరుకున్నాయి. ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఫ్లెక్సీ వద్దకు రావద్దని అంబటికి సూచించారు. అయితే, ఆలయం నుంచి తిరుగు ప్రయాణమైన అంబటిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కారు దిగేందుకు ప్రయత్నించగా పోలీసులు నివారించారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన అంబటి రాంబాబు.. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అత్యంత దారుణమైన భాషలో దూషించారు.
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు అంబటిని అక్కడి నుంచి పంపించివేశారు. ఈ ఘటన అనంతరం గుంటూరులోని ఆయన నివాసం వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి వ్యాఖ్యలను ‘అత్యంత దుర్మార్గం’ అని మంత్రి కొల్లు రవీంద్ర, పార్థసారథి వంటి వారు తీవ్రంగా ఖండించారు. ఒక మాజీ మంత్రి అయి ఉండి, ముఖ్యమంత్రిపై ఇంతటి అనుచిత భాషను ఉపయోగించడం ఏమిటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఇప్పటివరకు అంబటిని భరించాం… ఈ రోజు నుంచి సినిమా చూపిస్తాం: కేంద్రమంత్రి పెమ్మసాని

- వైసీపీ నేత అంబటి రాంబాబుకు కేంద్రమంత్రి పెమ్మసాని తీవ్ర హెచ్చరిక
- ఇకపై అంబటికి అసలు సినిమా చూపిస్తామని వ్యాఖ్య
- సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కారణమని వెల్లడి
- 24 గంటల్లో తమ స్పందన ఎలా ఉంటుందో తెలుస్తుందని స్పష్టీకరణ
- అంబటి వ్యాఖ్యలను ఖండించిన హోంమంత్రి వంగలపూడి అనిత
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంబటి అత్యంత అనుచితమైన భాషలో వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ఇప్పటివరకు అంబటిని సహనంతో భరించామని, ఇకపై ఆయనకు అసలు సినిమా చూపిస్తామని హెచ్చరించారు. 24 గంటల్లో తమ స్పందన ఎలా ఉంటుందో తెలుస్తుందని అల్టిమేటం జారీ చేశారు.
ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ, “బరితెగించి మాట్లాడేవారికి భయపడేలా ట్రీట్‌మెంట్ ఉంటుంది. మేం చట్టబద్ధంగా వెళితే ఏం జరుగుతుందో అంబటికి త్వరలోనే తెలుస్తుంది” అని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిని అవమానించడం అంటే రాష్ట్ర ప్రజలను అవమానించినట్లేనని అన్నారు. అధికారం కోల్పోయిన అసహనంతో వైసీపీ నేతలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని, అలాంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించబోదని ఆమె హెచ్చరించారు.