తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ఎస్‌లోనే ఉన్నా..జగిత్యాల ఎమ్మెల్యే

  • బీఆర్ఎస్ నుంచి గెలిచాను.. అదే పార్టీలోనే ఉన్నానని తెలిపిన సంజయ్ కుమార్
  • బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు అఫిడవిట్ ఇచ్చానన్న సంజయ్ కుమార్
  • అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని మాత్రమే ప్రకటించినట్లు వెల్లడి
  • కాంగ్రెస్ పార్టీలో చేరానని భావించి బీఆర్ఎస్ రచ్చ రచ్చ చేసిందని ఆవేదన

తాను గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచానని, ఇప్పటికీ అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేనని జగిత్యాల శాసన సభ్యుడు సంజయ్ కుమార్ అన్నారు. తన జీతం నుండి నెలకు రూ.5 వేలు బీఆర్ఎస్ పార్టీకి కట్ అయ్యాయని వెల్లడించారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని అఫిడవిట్ కూడా ఇచ్చానని తెలిపారు. జగిత్యాల అభివృద్ధి కోసం తాను ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని స్పష్టం చేశారు.

జగిత్యాల అభివృద్ధి కోసం తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని, ఆ సమయంలో ఆయన శాలువా కప్పారని అన్నారు. తాను ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వెళ్లలేదని అన్నారు. కలిసి పని చేస్తామని చెప్పాం తప్ప పార్టీలో చేరినట్లు ఎక్కడా పేర్కొనలేదని అన్నారు. కానీ ఆధారాలు లేకుండా మీడియా అసత్య ప్రచారం చేసిందని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని భావించి బీఆర్ఎస్ వాళ్లు తన ఆసుపత్రి వద్ద రచ్చరచ్చ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

వివరణ ఇవ్వడానికి తనకు కనీసం అవకాశం ఇవ్వలేదని, నోటీసు కూడా ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఇదే విషయం అడిగారని అన్నారు. తన ఖాతా నుంచి గత మార్చి వరకు బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు కట్ అయ్యాయని అన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ స్వయంగా దానిని ఆపేసిందని అన్నారు.

కాగా, సంజయ్ పార్టీ మారారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను స్పీకర్ ప్రసాద్ కుమార్ ఈరోజు కొట్టివేశారు. సంజయ్ పార్టీ మారినట్లు ఆధారాలు చూపించలేకపోయారని ఈ సందర్భంగా స్పీకర్ పేర్కొన్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పిటిషన్లు దాఖలు చేయగా, ఈరోజు వరకు 8 మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ తీర్పు ఇచ్చారు. వారిపై అనర్హత పిటిషన్లను కొట్టివేశారు.

జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారినట్లు ఆధారాలు లేవనడంపై స్పందించిన కేపీ వివేకానంద

Sanjay Kumar Jagtial MLA Party Change Allegations KP Vivekanand Reacts
  • సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లో ఎందుకు చేర్చుకున్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారన్న వివేకానంద
  • ఎనిమిది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారని ఆగ్రహం
  • స్పీకర్ కాలయాపన చేస్తూ ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవంటూ తమ పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టివేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పందించారు. సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారని ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రశ్నించారని గుర్తు చేశారు.

కానీ స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అనర్హత పిటిషన్లపై కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలు లేవంటూ ఎనిమిది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో బీజేపీ కూడా కుమ్మక్కయిందని ఆరోపించారు.

స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదు: జగదీశ్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్నా స్పీకర్ కు కనబడకపోవడం విచారకరమని అన్నారు. స్పీకర్ ఏకపక్ష నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ చర్యలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు బహిరంగంగా సభలకు, కాంగ్రెస్ కార్యక్రమాలకు హాజరవుతున్నారని, అది స్పీకర్‌కు కనపడటం లేదా అని నిలదీశారు. సభాపతి ఆత్మసాక్షిగా, చట్టపరంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని విమర్శించారు. స్పీకర్ ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేయడం చట్టవిరుద్ధమేనని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్ వదిలేసినా కోర్టుల్లో శిక్ష తప్పదని అన్నారు.

స్పీకర్ తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు: కేటీఆర్

KTR Slams Speakers Actions as Unconstitutional
  • ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్ల కొట్టివేత రాజ్యాంగ విరుద్ధమన్న కేటీఆర్
  • సీఎం రేవంత్ ఆదేశాలతోనే స్పీకర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణ
  • వీడియో సాక్ష్యాలున్నా ఆధారాలు లేవనడం హాస్యాస్పదమంటూ ట్వీట్

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను వరుసగా కొట్టివేయడం రాజ్యాంగానికి గొడ్డలిపెట్టు అని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే స్పీకర్ నడుచుకుంటున్నారని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని విమర్శించారు.

సోషల్ మీడియాలో స్పందిస్తూ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌పై అనర్హత పిటిషన్‌ను స్పీకర్ కొట్టివేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే సంజయ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఫోటోలు, వీడియోలు కళ్లముందు కనిపిస్తున్నా, ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను తిరస్కరించడం అర్థరహితమని అన్నారు. ఈ చర్య ద్వారా స్పీకర్ తన పదవికే అవమానం తెస్తున్నారని, అటు సుప్రీంకోర్టు తీర్పును, ఇటు ప్రజాతీర్పును కాలరాస్తున్నారని మండిపడ్డారు. 

జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డే ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేను విమర్శిస్తున్న తరుణంలో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికలంటే భయం పట్టుకుందని, అందుకే ఈ నాటకాలాడుతోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంతో కాంగ్రెస్ ఇంకా కోలుకోలేదని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాగ్రహం చూసి రేవంత్ సర్కారు వణికిపోతోందని అన్నారు. 

ఈ మొత్తం పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే సూత్రధారి అని కేటీఆర్ ఆరోపించారు. ఆయన ఢిల్లీకి పంపే మూటలకు ఆశపడి రాహుల్ గాంధీ మౌనం వహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదని స్పష్టం చేశారు. పట్టపగలే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడం వికృత రాజకీయ క్రీడ అని, ఈ చర్యలకు ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.

Related posts

నేనే తప్పు చేయలేదు… ఎలాంటి విచారణకైనా సిద్ధమే: కేటీఆర్

Ram Narayana

బీఆర్ యస్ బలహీనపడింది …మండలి చైర్మన్ గుత్తా ఆసక్తికర వ్యాఖ్యలు …

Ram Narayana

తొర్రురు,జనగామలలో లక్కీ డ్రా… కాంగ్రెస్‌ను వరించిన అదృష్టం…

Ram Narayana