తాత్కాలిక పద్దతిలో డీజీపీ నియామకంపై సుప్రీం కీలక తీర్పు ..
4వారాల్లో పూర్తి చేయండి.. తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు
ప్రభుత్వం జి ఓ పై సుప్రీం ను ఆశ్రయించిన ధన గోపాల్ రావు
డీజీపీ నియామకంలో సుప్రీం గైడ్ లైన్స్ పాటించలేదని వాదన …
డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై సుప్రీం కోర్టు కీలకతీర్పు వెలువరించింది. 4 వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని యూపీఎస్సీ, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఏప్రిల్లోలో తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. గతేడాది తెలంగాణ డీజీపీగా బి.శివధర్ రెడ్డి నియామకం విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై ఇవాళ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. 4 వారాల్లో పూర్తి స్థాయి డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని యూపీఎస్సీకి, తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానిస్తూ ఈ విషయాన్ని సింగిల్ జడ్జి బెంచ్ ముందు ఎందుకు లిస్ట్ చేశారు? ఆయన ఆదేశంలో తప్పేమీ లేదు. కానీ సాధారణంగా ఇలాంటి అంశాలను సీనియర్ జడ్జి విచారించాలని మేము ఆశిస్తామని అన్నారు.
ఇంతకీ ఏం జరిగింది…?
శివధర్ రెడ్డికి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబరు 26న జీవో జారీ చేసింది. అయితే ఈ నియామకం చెల్లదని, సదరు జీవోను కొట్టేయాలంటూ హైదరాబాద్ కు చెందిన ధనగోపాలరావు అక్టోబరు 10న తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ప్రకాశ్సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో డీజీపీల నియామకంపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని.. దాని ప్రకారం డీజీపీని తాత్కాలిక పద్ధతిలో నియమించడానికి వీల్లేదని పిటిషనర్ పేర్కొన్నారు. విచారణ జరిపిన హైకోర్టు డీజీపీగా శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించిన జీవో కొట్టివేతకు నిరాకరించింది. కానీ, డీజీపీ ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.