- మధ్యప్రదేశ్‌లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలులో జాప్యంతో నిరాశ
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాలతో కోర్టు ఆదేశం
- వారం రోజుల్లో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు
వైద్య విద్యలో ప్రవేశం కోసం రెండుసార్లు నీట్ పరీక్షలో అర్హత సాధించినా, ప్రభుత్వ విధానపరమైన లోపం కారణంగా సీటు కోల్పోయిన ఓ విద్యార్థి.. దేశ అత్యున్నత న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించి చారిత్రాత్మక విజయం సాధించాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల అథర్వ చతుర్వేది పోరాటానికి స్పందించిన సుప్రీంకోర్టు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి అతనికి ప్రొవిజనల్ ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది.
జబల్‌పూర్‌కు చెందిన అథర్వ చతుర్వేది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటా కింద రెండుసార్లు నీట్‌లో మంచి మార్కులు సాధించాడు. అయితే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయకపోవడంతో అతడికి అడ్మిషన్ లభించలేదు. దీనిపై తొలుత హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేశాడు.
మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు అథర్వ ఆన్‌లైన్‌లో తన వాదనలను స్వయంగా వినిపించాడు. రాష్ట్ర ప్రభుత్వ విధాన లోపం వల్ల అర్హత ఉన్న విద్యార్థికి అన్యాయం జరగకూడదని స్పష్టం చేసిన ధర్మాసనం కేవలం 10 నిమిషాల్లోనే అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
“ప్రైవేట్ కాలేజీలు రిజర్వేషన్ విధానాన్ని పాటించకపోతే, వాటికి తాళాలు వేయండి” అని ఈ సందర్భంగా సీజేఐ ఘాటుగా వ్యాఖ్యానించారు. వారం రోజుల్లోగా 2025-26 విద్యా సంవత్సరానికి అథర్వకు ప్రొవిజనల్ అడ్మిషన్ కల్పించాలని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC), మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే, ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఫీజుల నిర్మాణంపై ఇంకా స్పష్టత లేకపోవడంతో, అథర్వ కుటుంబానికి ఆర్థికపరమైన ఆందోళనలు కొనసాగుతున్నాయి.