జాతీయ వార్తలు

ఆ వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని ఊహించలేదు: త్రిష

  • తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం
  • “అగౌరవాన్ని ఎప్పటికీ సహించను” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
  • తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని న్యాయవాది ద్వారా స్పష్టత
  • వ్యక్తిగత జీవితాలను రాజకీయ చర్చల్లోకి లాగొద్దని హితవు
  • నటుడు విజయ్‌ను విమర్శిస్తూ నైనార్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తనపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ప్రముఖ నటి త్రిష తీవ్రంగా స్పందించారు. “అగౌరవాన్ని ఖండించాల్సిందే, ఎప్పుడైనా సరే” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వివాదంపై తన న్యాయవాది ద్వారా సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసి, తన రాజకీయ వైఖరిపై పూర్తి స్పష్టత ఇచ్చారు.

రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇంతటి అనుచిత వ్యాఖ్యలు వస్తాయని తాను ఊహించలేదని త్రిష తన న్యాయవాది నిత్యేశ్ నటరాజ్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని తేల్చి చెప్పారు. తనను కేవలం తన నటన, వృత్తిపరమైన జీవితంతోనే గుర్తించాలని, రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఆమె కోరారు.

“వ్యక్తిగత జీవితాలను ఎప్పుడూ బహిరంగ చర్చకు పెట్టకూడదు. ముఖ్యంగా ఉన్నత పదవుల్లో ఉన్నవారు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని ఆ ప్రకటనలో హితవు పలికారు. తనకు సంబంధం లేని విషయాల్లోకి తన పేరును లాగవద్దని త్రిష విజ్ఞప్తి చేశారు.

ఇటీవల నటుడు విజయ్ సేలంలో నిర్వహించిన రాజకీయ ర్యాలీని విమర్శిస్తూ, రాజకీయాల్లో ఆయనకు అనుభవం లేదని చెప్పే క్రమంలో నైనార్ నాగేంద్రన్.. “విజయ్ ముందు నటి త్రిషతో రిలేషన్ నుంచి బయటకు రావాలి… అప్పుడే రాజకీయ ప్రపంచం ఎలా ఉంటుందో అర్థమవుతుంది” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. డీఎంకే సహా పలు పార్టీలు, వర్గాలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలోనే త్రిష ఈ విధంగా స్పందించారు.

త్రిషపై వ్యాఖ్యల పట్ల బీజేపీ నేత విచారం…

Nainar Nagendran regrets comments on Trisha offers apology
  • త్రిష ఆగ్రహం వ్యక్తం చేసిన కాసేపటికే స్పందించిన నాగేంద్రన్
  • నా వ్యాఖ్యల పట్ల బాధపడిన వారికి క్షమాపణ చెబుతున్నానన్న నాగేంద్రన్
  • ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం తనకు లేదన్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సినీ నటి త్రిషపై తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన త్రిషకు క్షమాపణ చెప్పారు. పొరపాటుగా ఆ వ్యాఖ్యలు చేశానని, తనను క్షమించాలని కోరారు. తనపై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల నటి త్రిష తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని తాను అనుకోలేదని, సంబంధం లేని విషయాల్లోకి తనను లాగవద్దని త్రిష మండిపడ్డారు.

త్రిష స్పందించిన కొద్దిసేపటికే నైనార్ నాగేంద్రన్ తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. “ఇవి పొరపాటున చేసిన వ్యాఖ్యలు. బీజేపీ అఖిల భారత మహిళా విభాగం నాయకురాలు వానతి శ్రీనివాసన్, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై నాతో ఈ వ్యాఖ్యల గురించి మాట్లాడారు. నా వ్యాఖ్యల పట్ల బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నాను” అని నాగేంద్రన్ ప్రకటన విడుదల చేశారు.

తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎవరి మనసును బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని, అలాగే ఎవరి మనసును బాధపెట్టకూడదనే అనుకుంటానని అన్నారు.

కాగా, ఇటీవల బహిరంగ సభలో నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. తనలా సొంతగా పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై నాగేంద్రన్ స్పందిస్తూ, విజయ్‌కి రాజకీయ అనుభవం లేదని, మొదట త్రిషతో బంధం నుంచి బయటకు వచ్చి తన కుటుంబంతో మమేకం కావాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయ దుమారం రేపాయి.

Related posts

మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. కేంద్రమంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి!

Drukpadam

సొంత నియోజకవర్గం నుంచి మరో వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

Ram Narayana

జైల్లో నిందితుడిని పెట్టుకుని దేశమంతా గాలించిన పోలీసులు!

Drukpadam