తెలంగాణ వార్తలు

ఉద్యోగుల ఆరోగ్యానికి రేవంత్ సర్కార్ భద్రత …

  • కొత్త ఆరోగ్య, ప్రమాద బీమా పథకాలకు కేబినెట్ ఆమోదం
  • 60 ఏళ్లలోపు ఉద్యోగి సహజ మరణానికి రూ.10 లక్షల అదనపు సాయం
  • క్యాష్‌లెస్ వైద్యం కోసం డిజిటల్ హెల్త్ కార్డుల జారీ
  • జీతంలో 1.5 శాతం కంట్రిబ్యూషన్‌తో కొత్త హెల్త్ స్కీమ్ అమలు

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి కోసం రెండు కీలకమైన సంక్షేమ పథకాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం, ఈ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. 

కొత్తగా ప్రవేశపెట్టనున్న పథకం ప్రకారం, 60 ఏళ్లలోపు సర్వీసులో ఉన్న ఉద్యోగి సహజంగా మరణిస్తే, వారికి అందే రెగ్యులర్ ప్రయోజనాలతో పాటు అదనంగా రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ అందించనున్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే కోటి రూపాయలకు పైగా పరిహారం ఇచ్చేలా మరో పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ బీమా పథకాలకు ఉద్యోగుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

దీంతో పాటు, ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన క్యాష్‌లెస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్‌ (EHS)కు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీని కింద ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 17 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి 1.5 శాతం చెల్లించనుండగా, అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఈ నిధులతో ఏర్పాటు చేసే ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలోని 652 ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందిస్తారు. లబ్ధిదారులందరికీ డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నిర్ణయాలతో సుమారు 7.56 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

Related posts

ఇతర రాష్ట్రాలతో పోలుస్తూ తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంపై భట్టివిక్రమార్క వ్యాఖ్యలు!

Ram Narayana

ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉన్న అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్న కేసీఆర్

Ram Narayana

రూ.13,000 కోట్ల గేమింగ్ స్కామ్: హైదరాబాద్‌లో కీలక సూత్రధారి అరెస్ట్..

Ram Narayana