మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇజ్రాయెల్‌తో యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న వేళ, ఇరాన్ సంచలన హెచ్చరికలు జారీ చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని మూడు కీలక ఓడరేవులను తమ చట్టబద్ధ లక్ష్యాలు (లెజిటిమేట్ టార్గెట్స్)గా ప్రకటించింది. ఆ ప్రాంతాల్లోని ప్రజలు తక్షణమే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. రాబోయే గంటల్లో ఈ పోర్టులపై దాడులు జరగవచ్చని సంకేతాలిచ్చింది.
ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దుబాయ్‌లోని జెబెల్ అలీ, అబుదాబిలోని ఖలీఫా, ఫుజైరా పోర్టులే తమ లక్ష్యాలని పేర్కొంది. ఈ ఓడరేవుల్లో పౌర ఆవాసాల మాటున అమెరికా సైనిక దళాలు దాగి ఉన్నాయని, కాబట్టి వాటిపై దాడి చేయడం తమకు చట్టబద్ధమైన హక్కని ఇరాన్ స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది.
ఇరాన్‌కు చెందిన కీలకమైన ఖార్గ్ ద్వీపంపై అమెరికా దాడులు జరిపిన నేపథ్యంలోనే ఈ హెచ్చరికలు రావడం గమనార్హం. ఇరాన్ ముడిచమురు ఎగుమతుల్లో 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతాయి. అయితే, తాము సైనిక లక్ష్యాలనే ధ్వంసం చేశామని, చమురు క్షేత్రాలకు నష్టం కలిగించలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్ కామ్) తెలిపింది.
ఇరాన్ చర్యలపై యూఏఈ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ అధికారులు కొద్ది వారాల క్రితం తమ దేశంలో పర్యటించినప్పుడు ఇలాంటి దాడులకు పాల్పడతామని ఎలాంటి సూచన ఇవ్వలేదని, ప్రస్తుత హెచ్చరికలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని యూఏఈ విదేశాంగ మంత్రి లానా నుస్సీబెహ్ అన్నారు. తుపాకులు నిశ్శబ్దమయ్యాకే మధ్యవర్తిత్వంపై చర్చలు సాధ్యమని ఆమె స్పష్టం చేశారు.
ఇప్పటికే సౌదీ అరేబియా, కతార్, కువైట్‌లలోని పలు ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది. మరోవైపు, ఫుజైరా చమురు కేంద్రం వద్ద ఓ డ్రోన్‌ను కూల్చివేయగా, దాని శకలాలు పడి మంటలు చెలరేగాయి. దీంతో చమురు లోడింగ్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది.